వర్సిటీలో ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా
వర్సిటీలో ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా
Published Thu, Sep 22 2016 8:31 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
ఏఎన్‌యూ: యూనివర్సిటీలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ శాఖ ఆధ్వర్యంలో గురువారం యూనివర్సిటీ పరిపాలనా భవన్ ఎదుట విద్యార్థి సంఘ నాయకులు ధర్నా చేశారు. పరిపాలనా భవన్ ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించాలని నినదించారు. ఈ సందర్భంగా ఏపీ యూనివర్సిటీల ఎస్‌ఎఫ్‌ఐ శాఖ కన్వీనర్ టీ పవన్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయనందున యూజీసీ 2500 కోట్ల రూపాయల నిధులను నిలిపివేసిందన్నారు. అధ్యాపక పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వ, యూనివర్సిటీల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీ శాఖ అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ ఏఎన్‌యూలో వసతి గృహాలు, విభాగాల్లో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని, వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, లైబ్రరీని 24 గంటలు తెరచి ఉంచాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల ద్వారాల వద్ద బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలని, వికలాంగ విద్యార్థులకు యూనివర్సిటీలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. వసతి గృహలకు వైఫై ఇంటర్నెట్ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం వీసీ అందుబాటులో లేకపోవటంతో వినతిపత్రాన్ని వీసీ కార్యాలయ తలుపునకు అంటించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఏఎన్‌యూ శాఖ కార్యదర్శి పీ ఏసురాజు, మహిళా కన్వీనర్ తులసి, నాయకులు లక్ష్మీనారాయణ, శ్రీను, గోపి, రాజ్‌కమల్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement