శ్రీగౌతమి కేసును సీఐడీకి అప్పగించాలి
శ్రీగౌతమి కేసును సీఐడీకి అప్పగించాలి
Published Tue, Jan 24 2017 2:07 AM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM
నరసాపురం : శ్రీగౌతమి మృతి కేసును సీఐడీకి అప్పగించాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా సంఘాలు డిమాండ్ చేశాయి. టీడీపీ నేత సజ్జా బుజ్జి, అతని భార్యను వెంటనే అరెస్ట్ చేసి, శ్రీగౌతమికి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం విద్యార్థి, మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. దీనిలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎన్ కళాశాల నుంచి ర్యాలీగా అంబేడ్కర్ సెంటర్‌కు చేరారు. అక్కడ రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వి.మహేష్, ఐద్వా డివిజన్ కార్యదర్శి పొగాకు పూర్ణ మాట్లాడారు. నంబర్‌ప్లేట్ లేని కారుకు, వైజాగ్‌లోని వేరే కారు నంబర్‌ప్లేట్ తగిలించి పోలీసులు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. సజ్జా బుజ్జి టీడీపీ నేత కావడంతో, కొందరు ఎమ్మెల్యేలు అతనిని కాపాడే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. గౌతమి చెల్లెలు పావని ఓ పక్క కారులో ముగ్గురు, నలుగురు ఉన్నారని చెబుతుంటే, పోలీసులు కాదు ఒక్కడే ఉన్నాడని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పోలీసులపై నమ్మకం పోయిందని, కేసును సీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అధికారపార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కె.అనీల్, ఎం.బాలకృష్ణ, ప్రవీణ్, నరేంద్ర పాల్గొన్నారు.
Advertisement
Advertisement