ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మదనపల్లె రూరల్ (చిత్తూరు) : ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మదనపల్లె మండలం పాలెంకొండ గ్రామానికి చెందిన వెంకటరమణ కుమార్తె(18) ఇటీవలే ఇంటర్ పూర్తి చేసింది. అదే గ్రామానికి చెందిన ఎంబీఏ చదివే వెంకట నారాయణ(22)తో కొన్నాళ్లుగా ఆమెకు పరిచయం ఉంది. అయితే ఇటీవల ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడుతున్నాడు. దీనిపై ఆమె కుటుంబసభ్యులకు తెలిపింది.
వారి సూచన మేరకు పెద్దనాన్న ఉండే పుంగనూరు మండలం కృష్ణాపురం వెళ్లిపోయింది. అక్కడే ఉండి చదువుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న వెంకట నారాయణ శనివారం ఉదయం అక్కడికి వెళ్లాడు. ఇది గమనించిన పెద్దనాన్న కుటుంబసభ్యులు అతడిని వెంటబడి తరిమారు. ఈ గొడవతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి ఇంట్లోనే విష గుళికలు మింగింది. ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతిచెందింది.