సబార్డినేట్ సర్వీస్ రూల్స్ తెలుసుకోండి
Published Tue, Aug 30 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
నిడమర్రు:
రాష్ట్ర ప్రభుత్వం తమ యాజమాన్యంలో పనిచేసే ఉద్యోగులకు వివిధ సర్వీస్ రూల్స్ రూపొందించింది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించి ఉద్యోగులకు డిపార్ట్‌మెంట్ల వారీగా వేర్వేరు సర్వీస్ నిబంధనలు ఉన్నాయి. అన్ని కేడర్లకు వర్తించే సాధారణ, ప్రత్యేక, తాత్కాలిక నిబంధనలతో 1996లో స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌ను ప్రభుత్వం రూపొం దించింది. ప్రభుత్వం చేపట్టే నియామక విధానాలు, ఆ నియాయకాల్లోని అభ్యర్థుల అర్హతలు, ఉద్యోగంలో చేరే గడువు, సీనియారిటీ, పరీక్షలు, ప్రొబేషన్ కాలం తదితర నిబంధనలు ఇందులో పొందుపరిచారు.
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అర్హతలు
మంచి ఆరోగ్యం, మంచి అలవాట్లు కలిగి, సంబంధిత పోస్టులో పనిచేయడానికి తగిన శారీరక దారుఢ్యం ఉండాలి. మంచి నడవడిక ప్రవర్తన కలిగి ఉన్నట్టు నివేదిక ఉండాలి. పోస్టుకు అవసరమైన విద్య, ఇతర అర్హతలు కలిగి ఉండాలి. నిర్ణీత వయోపరిమితి తప్పనిసరి.
పా్యనల్ లిస్ట్ తయారీ
ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలోని పోస్టుల భర్తీలో స్క్రీనింగ్ కమిటీతోను, పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో సంబంధంలేని పోస్టుల విషయంలో సంబంధిత డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీతో సంప్రదించిన తర్వాత నియామక అధికారి పదోన్నతికి అర్హత గల అభ్యర్థుల జాబితా తయారు చేయడాన్ని ప్యానల్ లిస్ట్ తయారీ అంటారు. ఏటా మరుసటి ఏడాది ఆగస్టు 31కు ఏర్పడే ఖాళీలు 1:3 నిష్పత్తిలో పదోన్నతికి అర్హుల జాబితా తయారుచేస్తారు.
విధుల్లో చేరేందుకు గడువు
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు అపాయింట్‌మెంట్ ఆర్డర్ రిజిస్టర్ పోస్టులో అందిన రోజు నుంచి 30 రోజుల్లోపు విధుల్లో చేరాలి. పదోన్నతిపై నియమించిన ఉద్యోగులు ఉత్తర్వులు అందిన 15 రోజుల్లోగా ఆ పోస్టులో బాధ్యతలు తీసుకోవాలి. పదోన్నతి లభించినా విధుల్లో చేరకపోతే వచ్చే ఏడాది పదోన్నతి బదిలీలో వారి పేరు చేర్చరు. పదోన్నతిని నిరాకరించడం కుదరదు.
పరీక్షలు ఇలా..
ఉద్యోగం లభించిన పిదప ప్రొబేషన్ కాలం పూర్తి అయ్యేలోపు తెలుగు భాష పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షను తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత చెందిన వారికి, 45 ఏళ్లు వయసు నిండిన వారికి పరీక్ష విషయంలో మినహాయింపు ఉంటుంది. కొత్తగా నిర్దేశించిన డిపార్ట్‌మెంటల్ పరీక్షలను ప్రొబేషన్ కాలంలో లేక పదోన్నతి లభించిన తర్వాత నిర్వహించిన రెండు డిపార్ట్‌మెంట్ టెస్ట్‌ల కాలంలోగా ఉత్తీర్ణత చెందాలి.
సీనియారిటీ
ప్రభుత్వ ఉద్యోగి సీనియారిటీ అతడు ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి లెక్కిస్తారు. అయితే నియామకం నిమిత్తం నియామక అధికారి అభ్యర్థుల జాబితా తయారుచేసి ఉంటే సదరు జాబితాలోని క్రమసంఖ్య ప్రాతిపదికగా అతని సీనియారిటీ నిర్ణయిస్తారు.
నియామకం
నియామకాలు నాలుగు విధాలుగా చేపడతారు. కొత్తవారిని ఎంపిక చేసి నియమించడం (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్), ఇతర సర్వీసు లేదా అదే సర్వీసుకు చెందిన మరో సమాన స్థాయి పోస్టు నుంచి బదిలీ ద్వారా నియమించడం, ఉద్యోగంలో ఉన్న వ్యక్తికి పదోన్నతి కల్పించి నియామకం చేపట్టడం, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పద్ధతిపై నియమించడం.
ప్రొబేషన్ కాలం
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఉద్యోగుల విషయంలో నియామకపు తేదీ నుంచి మూడేళ్లు, పదోన్నతి లభించిన తేదీ నుంచి రెండేళ్ల సర్వీస్ ప్రొబేషన్ కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో సదరు ఉద్యోగి సమర్థవంతంగా పనిచేసినట్టు ఉన్నతాధికారులు ధ్రువీకరిస్తే ఆ ఉద్యోగి సర్వీస్‌లో స్థిరపడినట్టు అవుతుంది. ఈ కాలంలో ఉద్యోగి పనితీరుపై పర్యవేక్షణ ఉంటుంది. ఒకే సర్వీస్‌కు చెందిన ఒక కేటగిరీ నుంచి మరో కేటగిరీకి పదోన్నతి పొందాలంటే ఒక సర్వీస్ నుంచి వేరో సర్వీస్‌కు బదిలీపై నియామకం పొందాలన్న ఉద్యోగి తాను ప్రస్తుతం పనిచేస్తున్న క్యాడర్‌లో ప్రొబేషన్ కాలం పూర్తి చేసి ఉండాలి.
Advertisement