ఎందుకింత తెగులు..?
ఎందుకింత తెగులు..?
Published Sun, Jul 16 2017 10:53 PM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM
తెలుగుమీడియం ఆకస్మిక రద్దుపై విమర్శల వెల్లువ
ముందస్తు కసరత్తు లేకుండానే నిర్ణయం
మున్సిపల్, నగరపాలక పాఠశాలల విద్యార్థుల ఆందోళన
తెలుగు రాష్ట్రం.. అయితే తేనెలూరించే తెలుగు నుడికారంపై తెలుగుదేశం ప్రభుత్వమే కత్తిగట్టింది. ఈ ఏడాది నుంచి మున్సిపల్, నగరపాలక పాఠశాలల్లో తెలుగు మాథ్యమాన్ని రద్దు చేసి..ఆంగ్ల మాథ్యమమే నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆంగ్ల భాషపై మోజు కంటే కార్పొరేటుపై మోజే ఇందుకు కారణమంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకింత తెగులు.. అంటూ ప్రభుత్వ నిర్ణయానికి విద్యార్థులు, తల్లిదండ్రులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం క్లాసుల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయకుండానే ఇంత హడావుడి నిర్ణయం ఏమిటని ఉపాధ్యాయులు ‘నారాయణ..నారాయణ’అంటున్నారు.
రాయవరం (మండపేట) : దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవరాయులు తెలుగు భాష కీర్తిని కొనియాడితే, తెలుగు పౌరుషాన్ని తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రపంచానికి చూపించారు. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటూ ఇంగ్లిష్ కవి ప్రశంసించారు. తెలుగు భాషకు ఉన్న ఇంతటి ఔనత్యాన్ని తెలుసుకుండీ కూడా.. కార్పొరేటు మోజుతో.. చంద్రబాబు హైటెక్ ప్రభుత్వం మున్సిపల్, నగరపాలక సంస్థల పాఠశాలల్లో తెలుగు భాషను పాతరేసేందుకు సిద్ధమవుతోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
రాజమహేంద్రవరం, కాకినాడ కార్పొరేషన్లతోపాటు రామచంద్రపురం, మండపేట, అమలాపురం, సామర్లకోట, పెద్దాపురం, తుని, పిఠాపురం మున్సిపాల్టీల్లో 226 ప్రాథమిక, 12 ప్రాథమికోన్నత, 47 ఉన్నత పాఠశాలలున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 15,035, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,461, ఉన్నత పాఠశాలల్లో 19,760 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 18,156 మంది బాలురు, 18,100 బాలికలు ఉన్నారు. ఉన్న పళంగా ఈ పాఠశాలల్లో ఆంగ్ల మాథ్యమం ప్రవేశపెట్టడంతో వారందరూ అయోమయ పరిస్థితిలో పడ్డారు.
ఏకపక్ష నిర్ణయం..
మున్సిపల్ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. ముందస్తు కసరత్తు లేకుండా ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమలు చేయాలంటూ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ తీసుకున్న ఈ నిర్ణయం వీరిని కలపరపెడుతున్నాయి. ఒక్కసారిగా ఆంగ్ల మాథ్యమం ప్రవేశపెడితే పాఠాలు బోధించే ఉపాధ్యాయులకూ కష్టమే.
విద్యకు దూరమయ్యే ప్రమాదం..
మున్సిపల్ పాఠశాలల్లో పేద, బడుగు, బలమీన వర్గాల విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. ఆంగ్ల భాష అందరికీ అవసరమే అయినా.. తెలుగు మీడియం పూర్తిగా పక్కనబెట్టి.. కేవలం ఇంగ్లిష్ మీడియం చదవాలంటే విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషకు పట్టం కట్టాల్సింది పోయి తెలుగును విద్యార్థి దశ నుంచే దూరం చేయడం సిగ్గచేటని పలువురు విమర్శిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలను చూసైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వైఎస్సార్ హయాంలో..
2009లో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేద విద్యార్థులకు ఇంగ్లిష్ చదువులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సక్సెస్ పేరుతో ఆరో తరగతి నుంచి తెలుగుతో పాటు ఆంగ్ల మాథ్యమం ప్రవేశ పెట్టారు. అయితే తెలుగు మీడియం రద్దు చేయలేదు. విద్యార్థులు ఆసక్తిని బట్టి ఇంగ్లిష్ మీడియంలో చదువుకునే అవకాశం కల్పించారు. ఈ నిర్ణయాన్ని ప్రజలు ఎంతో మెచ్చుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం తెలుగు మీడియాన్ని పూర్తిగా రద్దు చేయడం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందనే పలువురు విమర్శిస్తున్నారు.
తొందరపాటు చర్య..
మున్సిపల్, కార్పొరేషన్ స్కూల్స్‌లో ఒకేసారి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం తొందరపాటు చర్య. ఇంగ్లిషుతో పాటు మాతృభాషను సమాంతరంగా కొనసాగించాలి. బలవంతపు చదువు వల్ల విద్యార్థులు చదువుకు దూరమవుతారు.
– కవి శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్‌టీయూ
మీడియం ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి
విద్యార్థి మీడియంను ఎంచుకునే స్వేచ్ఛను కల్పించాలి. ఒకేసారిగా ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడం, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకపోవడం వల్ల గందరగోళం ఏర్పడుతుంది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలి.
– టి.కామేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్
Advertisement