సూరీడి వాత.. విద్యుత్ కోత
Published Tue, Apr 18 2017 2:03 AM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM
కొవ్వూరు : సూరీడు చిర్రెత్తిస్తున్నాడు. జిల్లాలో ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. జంగారెడ్డిగూడెంలో సోమవారం అత్యధిక ఉష్ణోగ్రత 44 డిగ్రీలు నమోదైంది. వేడి గాలులు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. దీనికి విద్యుత్ కోతలు తోడయ్యాయి. జిల్లా అవసరాల మేరకు విద్యుత్ సరఫరా కాకపోవడంతో లోటును భర్తీ చేసుకోవడానికి రోజుకో ప్రాంతంలో కోత విధిస్తున్నారు. రానున్న రోజుల్లో వినియోగం మరింత పెరగనుండగా.. విద్యుత్ కోతల సమస్య మరింత తీవ్రం కానుంది. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 820 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతోంది. ట్రాన్స్‌కో నెట్‌వర్క్ సమస్య కారణంగా 30 నుంచి 40 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడుతోంది. దీంతో కొన్ని ప్రాంతాలకు సరఫరాలో కోత విధిస్తున్నారు. కామవరపుకోట మండలం ఆడమిల్లిలో 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణంలో ఉంది. ఇది పూర్తయితే జిల్లాకు 230 మెగావాట్ల విద్యుత్ అందే అవకాశం ఉంది. సూర్యాపేట నుంచి అందే ఒకలైన్‌కు మాత్రమే కనెక్షన్ ఇవ్వడంతో ఈ సబ్ స్టేషన్ నుంచి 70 నుంచి 80 మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుతోంది. విశాఖలోని హిందూజా ప్లాంట్‌నుంచి మరో లైన్ ఈ సబ్‌స్టేషన్‌కు రావాల్సి ఉంది. ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. సరఫరాలో నష్టాలతో కొన్ని ప్రాంతాల్లో లో ఓల్టేజీ సమస్య తలెత్తుతోంది. దీంతో అధికారులు కొన్ని ప్రాంతాల్లో కోతలు విధిస్తున్నారు. రానున్న రోజుల్లో విద్యుత్ కోతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నారు.
Advertisement
Advertisement