
వైఎస్సార్ సీపీ విజయం ఖాయం
వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా లింగాల నామినేషన్
ఖమ్మం జెడ్పీసెంటర్: ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన లింగాల కమల్‌రాజ్ గెలుపు ఖాయమని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి కమల్‌రాజ్‌తో ఎంపీ పొంగులేటి మంగళవారం నామినేషన్ వేయించారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ బాబూరావుకు ఒక సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు. పార్టీ జిల్లా కార్యాలయం నుంచి వైఎస్‌ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు వాహనాల్లో కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా వచ్చి నామినేషన్ పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం, బూర్గంపాడు మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటుహక్కు విషయమై జేసీని అడిగారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తమ పార్టీ అభ్యర్థి కమల్‌రాజ్ గెలుపు ఖాయమన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లు ఉన్నాయని గుర్తు చేశారు. టీడీపీ ఎవరితో కలిసి పనిచేస్తే వారితో తాము కలిసేది లేదని ముందుగానే చెప్పామన్నారు. అందుకే ఎవరితో పొత్తు పెట్టుకోలేదన్నారు. అధికార పార్టీకి గుణపాఠం చెప్పాలని ఎంపీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, జిల్లా అధికార ప్రతినిధులు ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మందడపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.