మీ దగ్గర రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయా..
రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం
► అవి మంగళవారం అర్ధరాత్రి నుంచే విలువ కోల్పోతాయని ప్రధాని ప్రకటన
► తాజా నిర్ణయంపై జిల్లా వాసుల్లో మిశ్రమ స్పందన
► ఆశించిన ప్రయోజనం ఉండదంటున్న పలువురు ఆర్థికవేత్తలు
► మార్పు మంచిదే అంటున్న మరికొందరు.. మేధావి వర్గాల్లోనూ అదే అభిప్రాయం
► నేడు, రే పు ఏటీఎంలు పనిచేయవు.. రోజుకు విత్‌డ్రా రూ.10 వేలు మాత్రమే..
► ఉన్న నోట్లను డిసెంబర్ 31లోగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చు
► ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రధానం
సాక్షి, నల్లగొండ : మీ దగ్గర రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయా.. కుటుంబం కోసం ఏదైనా కొనుగోలు చేయడానికి ఈ నోట్లను మీరు దాచిపెట్టుకున్నారా.. బ్యాంకుల్లో ఉంటే ఓకే.. నగదు రూపంలో ఉంటే మాత్రం వెంటనే కదలండి. బ్యాంకులు, పోస్టాఫీసులకు వెళ్లి వాటిని మార్చుకోండి. ఎందుకంటే.. మంగళవారం అర్ధరాత్రి నుంచే 500, 1000 నోట్లు విలువ కోల్పోతున్నాయి. వాటిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఉన్నట్టుండి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం జిల్లా వాసుల్లో పెద్ద చర్చకు దారితీసింది. రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఏ నోటవిన్నా.. ఎక్కడ చూసినా.. ఇదే విషయంపైనే చర్చ సాగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాని మోదీ ప్రకటన సంచలనాన్నే సృష్టించింది.
అవినీతి, బ్లాక్‌మనీ టార్గెట్‌గా...
వాస్తవానికి ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని వార్తలు వ చ్చినప్పటి నుంచే.. ఏదో ఒక సంచలన ప్రకటన ఉంటుందని అందరూ భావించారు. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఆయన ప్రసంగం ప్రారంభమైన మొదట్లో దేశంలో అవినీతి, బ్లాక్‌మనీ, ఉగ్రవాద కార్యకలాపాలు ఎలాంటి ఆటంకంగా మారాయనే దానిపై ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఒక్కసారిగా రూ.500, రూ.1000 నోట్లు మంగళవారం అర్ధరాత్రి నుంచి చెల్లవని, ముద్రణ నిలిపివేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన విన్న ప్రజలు తాము విన్నది నిజమేనా..? అనుకున్న ప్రజలు ప్రధాని ప్రకటన పూర్తిగా అవగతం అయిన తర్వాత మాత్రం తదుపరి పరిణామాలపై చర్చించుకున్నారు.
దేశంలో ఉన్న నల్లధనాన్ని వెలికితీయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం జరిగిందనే చర్చ జరిగింది. దీనికి తోడు అవినీతి, ఉగ్రకార్యకలాపాలకు ఆసరాగా మారిన దొంగనోట్ల ముద్రణ లాంటి వాటిని అరికట్టవచ్చనే, కోణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రా యం జిల్లా వాసుల్లో వ్యక్తమయింది. కేం ద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అభిప్రాయాలు ఎలా ఉన్నా.... సామాన్య ప్రజల వద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్ల విషయంలో ఏం చేయాలన్న దానిపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రధానమనే అంశం ముక్తకంఠంతో వినిపిస్తోంది. ఇప్పటికే ప్రజల వద్ద ఉన్న ఆ నోట్లను డిసెంబర్ 31లోగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చని ప్రధాని చెప్పిన నేపథ్యంలో గ్రామీణులకు ఈ విషయాన్ని తెలియపరిచే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
మిశ్రమ స్పందన..
ఇక, ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఈ నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేస్తుందనే అభిప్రాయం జిల్లా ఆర్థిక వర్గాల్లో వ్యక్తం కాలేదు కానీ...దీనివల్ల కేంద్రం ఆశించిన ప్రయోజనం ఏమీ ఉండదని కొందరు ఆర్థికవేత్తలు అంటున్నారు.
కేంద్రం నిర్ణయంలో కీలకమైనవి..
మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచే రూ.500, 1000 నోట్లు చెల్లవు. ఇకపై పాత నోట్ల ముద్రణ ఉండదు.
ఈ నోట్ల స్థానంలో కొత్త రూ.500, రూ.2000 నోట్లు ముద్రిస్తారు. అవి త్వరలోనే చెలామణిలోకి వస్తాయి.
ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను డిసెంబర్ 31లోగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జమ చేయవచ్చు. అప్పటివరకు బస్సులు, రైళ్లు, ఇతర ప్రభుత్వ రవాణా వ్యవస్థల్లో ఈ నోట్లు చెల్లుబాటు అవుతాయి.
నవంబర్11 వరకు పెట్రోల్ బంకుల్లో కూడా చెల్లుతాయి. ఇంటర్నెట్ లావాదేవీలు, డీడీల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
బుధ, గురు వారాల్లో ఏ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలు కూడా పనిచేయవు. ఇక నుంచి ఏటీఎంల ద్వారా డబ్బు ఉపసంహరణ (విత్‌డ్రాయల్) మొత్తాన్ని కూడా మార్చారు. రోజుకు రూ.10,000, వారానికి రూ..20,000 మాత్రమే ఏటీఎంల ద్వారా తీసుకోవచ్చు.
ఆశించిన ప్రయోజనం ఉండదు..
రూ.500, 1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల నల్లధనం కొంతమేర బయటకు వస్తుంది. అయితే, నగదు రూపంలో ఉన్న నల్లధనమే బయటకు వస్తుంది. అక్రమార్జన ద్వారా సంపాదించిన ఆస్తులు, బంగారం లాంటి వాటికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఇక, నల్లధనం ఉన్న వారు కూడా మార్చుకోకుండా నష్టపోవడానికి సిద్ధపడితే ఈ నిర్ణయం మరింత వృధా అవుతుంది. ఇక, దొంగనోట్ల విషయానికి వస్తే దొంగనోట్ల ముద్రణ దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే స్థాయిలో లేదనే చెప్పుకోవాలి. ఈ కారణాల వల్ల ప్రధాని నిర్ణయం ఆశించిన ప్రయోజనం పొందదు.
- డాక్టర్ అందె సత్యం,
ఎకనామిక్స్ ప్రొఫెసర్
ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది..
ఇది మంచి పరిణామమే. నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయవచ్చు. చేతుల మీదుగా విచ్చలవిడి డబ్బు ప్రవాహాన్ని కూడా నియంత్రించవచ్చు. ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేదిగానే కనిపిస్తోంది. సమసమాజ నిర్మాణం దిశలో కమ్యూనిస్టుల అభిప్రాయానికి ద గ్గరగా ఈ నిర్ణయం ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం.
- ఆకుల రవీందర్, కామర్స్ అసిస్టెంట్
ప్రొఫెసర్, ఎంజీయూ
‘స్మార్ట్’ లావాదేవీల కోసమే..
ఁఅభివృద్ధి చెందిన దేశాల తరహాలో భవిష్యత్తులో నగదు రహిత లావాదేవీలను తీసుకురావాలన్న క్రమంలో ఈ నిర్ణయం చాలా కీలకమైంది. కేవలం ఇంటిసామాన్లు, కూరగాయలు లాంటివి కొనుక్కునేందుకే నగదు లావాదేవీలు జరిపి, మిగిలిన అన్నింటినీ స్మార్ట్ లావాదేవీలు జరపాలనేది కేంద్రం యోచనగా భావించవచ్చు. ఏదైనా మార్పు మంచిదే.
- కందిమళ్ల సుధీర్‌రెడ్డి, సహాయ వాణిజ్య పన్నుల శాఖ అధికారి, హైదరాబాద్
సామాన్య ప్రజలకు నష్టం లేదు.. లాభం లేదు
ఈ నిర్ణయం మంచిదేననే భావన వస్తోంది. అయితే, దీని వల్ల సామన్య ప్రజలకు ఎలాంటి నష్టం, లాభం ఉండదు. నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగానే ఈనిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. అదే విధంగా దొంగనోట్ల ముద్రణను కూడా కొంతమేర నివారించవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. అయితే, ఈ ప్రక్రియలో సామాన్య ప్రజలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
-పెరమాళ్ల వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ జిల్లా కోశాధికారి
ప్రజల్లో అవగాహన కల్పించాలి
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రజల విషయం లో జాగ్రత్తగా ఈ నిర్ణయాన్ని తీసుకెళ్లాలి. వారి దగ్గర న గదు రూపంలో ఉన్న మొత్తాన్ని దళారులకు ఇవ్వకుం డా, బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనే జమ చేసుకోవాలని తె లియజేయాలి. ఈ బాధ్యతలను ప్రభుత్వ వర్గాలే తీసుకోవాలి. డిసెంబర్ 31 కల్లా గ్రామాల్లోని ప్రజల వద్ద రూ.500, 1000 నోట్లు లేకుండా కార్యక్రమాలు నిర్వహించాలి.
- గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ, నల్లగొండ