పాపభీతితో లొంగిపోయాడు
Published Tue, Mar 28 2017 12:33 AM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM
పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): పాపభీతి వెంటాడటంతో తలనీలాల దొంగ పో లీసులకు లొంగిపోయాడు. సింహాద్రి అప్పన్న ఉగ్రరూపంలో నిద్రలో కనిపిస్తున్నాడని, నిజం చెప్పమని గర్జించడంతో లొంగిపోయానని సింహాచలం దేవస్థానంలో తలనీలాలు దొంగిలించిన ప్రధా న నిందితుడు ఏలూరు సమీపంలోని మాదేపల్లి గ్రామానికి చెందిన పసుపులేటి రాంబాబు (47) పోలీసులకు తెలిపాడు. విశాఖ పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర సంయుక్త పోలీస్ కమిషనర్ సత్తార్ ఖాన్, క్రైం డీసీపీ రవికుమార్‌మూర్తి వివరాలు వెల్లడించారు. 2015 ఫిబ్రవరి 14న సింహాచలం దేవస్థానంలో 10 బస్తాల్లో ఉన్న సుమారు 150 కేజీల తలనీలాలు చోరీకి గురయ్యాయి. వీటి విలువ రూ. 7.50 లక్షలు ఉంటుందని అప్పట్లో అంచనా వేశారు. తలనీలాలు ఎవరు దొంగలించారు, ఎక్కడికి తరలించారో తెలుసుకునేందుకు పోలీసులు చేపట్టిన దర్యాప్తు అంగుళం కూడా ముందుకు సాగలేదు.
దొంగగా మారిన తలనీలాల వ్యాపారి
ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాంబాబు తండ్రి నుంచి వారసత్వంగా తలనీలాల వ్యాపారం స్వీకరించాడు. రాష్ట్రంలోని పలు దేవాలయాలకు చెందిన తలనీలాలను వేలం ద్వారా కొనుగోలు చేసి వాటిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. కొన్నాళ్లపాటు భద్రాచలం కొత్తగూడెంకు చెందిన చల్లా జంపన్నతో కలిసి తలనీలాల వ్యాపారం చేశాడు. వీరిద్దరూ క్రికెట్ బెట్టింగ్‌లలో తమ వద్ద ఉన్న సొమ్మంతా పోగొట్టుకుని అప్పులపాలయ్యారు. అప్పుల ఊబి నుంచి బయట పడేందుకు రాంబాబు, జంపన్నలు కలిసి సింహాచలం దేవస్థానం కల్యాణకట్టలో నిల్వ ఉంచిన తలనీలాల బస్తాలలో పదింటిని కిటికీ ఊసలు వంచి దొం గిలించారు. తర్వాత కాణిపాకం వినాయకుని దేవస్థానంలో కూడా వీరిద్దరూ కలిసి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ కేసులో చల్లా జంపన్నను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అదే తరుణంలో రాంబాబులో పాపభీతి మొదలయింది. సింహాద్రి అప్పన్న కలలో కనిపిస్తున్నాడని, తాను లొంగిపోదామనుకుంటున్నానని ప్రకాశం జిల్లా మాలకొండ దేవస్థానం కార్యనిర్వహణాధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో విషయం తెలుసుకున్న గోపాలపట్నం పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టి రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.4.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో అడిషినల్ డీసీపీ (క్రైం) వరదరాజు, ఏసీపీ భీమారావు, గోపాలపట్నం సీఐ వైకుంఠరావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement