శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు
Published Tue, Nov 1 2016 6:52 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM
* మహిళపై లైంగిక వేధింపులు నిజమే..
* నిర్ధరించిన విచారణ కమిటీ
గుంటూరు (నెహ్రూనగర్): లైంగిక వేధింపుల సంఘటనలో నగరపాలక సంస్థలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై వేటు పడింది. రెండవ డివిజన్‌లో పనిచేసే శానిటరీ ఇన్‌స్పెక్టర్ అం గడి రాజేష్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న శానిటరీ వర్కర్ నగర కమిషనర్ నాగలక్ష్మి, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్‌కు పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేయటం నగరంలో చర్చనీయాంశమైంది.
ఫిర్యాదుపై స్పందించిన కమిషనర్ నాగలక్ష్మి విచారణాధికారిగా ఎంహెచ్‌ఓ నాగేశ్వరరావును నియమించారు. ఈ విచారణ జరుగుతుండగానే మరొక త్రిసభ్య కమిటీగా డీసీ ఏసుదాసు, సెక్రటరీ వసంతలక్ష్మి, ఎస్‌ఎస్ రాజ్యలక్ష్మిలను నియమించారు. విచారణలో సదరు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై ఆరోపణలు రుజువవడంతో అతనిని సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సదరు శానిటరీ ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ శానిటరీ ఇన్‌స్పెక్టర్ల యూనియన్ సంఘం కమిషనర్ నాగలక్ష్మిని కలవడానికి సోమవారం కమిషనర్ చాంబర్‌కు వెళ్లగా ఆమె వారిని తీవ్రంగా మందలించినట్టు తెలిసింది. లైంగిక వేధింపుల ఫిర్యాదుపై కమిషనర్ నాగలక్ష్మి తీసుకున్న చర్యలపై పలు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
మరికొందరిపై చర్యలకు రంగం సిద్ధం?
మరికొన్ని వార్డుల్లో మహిళా వర్కర్లపై లైంగిక వేధింపులపై కమిషనర్‌కు ఫిర్యాదులు అందినట్టు సమాచారం. వాటిపై కూడా రహస్యంగా విచారణ జరిపించి తేలితే చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.
Advertisement