లైంగిక వేధింపులకు పాల్పడిన అధికారిపై కేసు
Published Sat, Oct 8 2016 6:00 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
పట్నంబజారు: జిల్లా పోలీసు కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన అధికారిపై కేసు నమోదు అయింది. నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జిల్లా పోలీసు కార్యాలయంలోని మినిస్టీరియల్ సిబ్బంది కార్యాలయంలో మాధవి జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె తండ్రి మరణించటంతో కారుణ్య నియామకాల్లో భాగంగా ఉద్యోగం వచ్చింది. ఆమెకు వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే బి సెక్షన్‌లో సూపరిటెండెంట్‌గా పనిచేస్తున్న కరీముల్లా మాధవిని తొలి నుంచి లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. ఈ విషయమై బాధితురాలు పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టి తీసుకుని వెళ్లారు. అయినా కరీముల్లా తీరులో ఎటువంటి మార్పు రాకపోవటం, వేధింపులు మరింత తీవ్రం కావటంతో తట్టుకోలేక ఆమె ఈనెల 6వ తేదీన జిల్లా పోలీసు కార్యాలయంలోనే ఎలుకల మందు తిన్నారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను తోటి సిబ్బంది నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న మాధవి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కరీముల్లా పాల్పడిన వేధింపులకు సంబంధించి ఫోన్, సీడీ రికార్డింగ్‌లలో స్పష్టంగా ఉన్నాయి.
సస్పెన్షన్‌కు రంగం సిద్ధం...?
కరీముల్లాను సస్పెండ్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పూర్తి నివేదికను ఉన్నతాధికారులు తీసుకున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement