sanitary inspector
-
శానిటరీ ఇన్స్పెక్టర్ పైత్యం.. లైవ్‌లో చితకబాదిన బంధువులు
సాక్షి, సదాశివపేట(సంగారెడ్డి): లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకన్నను మహిళలు చితకబాదిన సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్దాపూర్ కాలనీకి చెందిన ఓ మహిళ కొత్త ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు విషయం తెలుసుకున్న శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకన్న ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. తాను లోన్ ఇప్పిస్తానని ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు తెలిపింది. గురువారం సాయంత్రం బాధిత మహిళ కుటుంబ సభ్యులు వెంకన్న ఇంటికి వెళ్లి అతడిని చితకబాదారు. గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో శనివారం పోస్టు చేయడంతో విషయం బట్టబయలైంది. శానిటరీ ఇన్స్పెక్టర్, బాధిత మహిళ పరస్పరం ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డిని వివరణ కోరగా విధుల్లో ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ను చితకబాదుతున్న విషయం తెలుసుకొని అక్కడకు వెళ్లి వారిని సముదాయించామన్నారు. ఇరువురు పోలీస్ స్టేషన్లో రాజీ చేసుకొన్నట్లు తెలిపారు. -
ఏసీబీ వలలో శానిటరీ ఇన్స్పెక్టర్
భీమునిపట్నం: జీవీఎంసీ భీమిలి జోన్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆర్.రవి శుక్రవారం తన ఛాంబర్లో రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కె.రంగరాజు తెలియజేసిన వివరాల ప్రకారం... స్థానిక పాత బస్టాండ్ వద్ద గతంలో మూతపడిన శ్రీనివాస థియేటర్‌కు చెందిన గొడౌన్లో ఉత్తమ్ ఫుడ్స్ అనే సంస్థ చిన్న పిల్లల కోసం విక్రయించే తినుబండారాలు తయారు చేస్తుంది. ఈ సంస్థకు ట్రేడ్ లైసెన్స్ లేని కారణంగా మే 17న జోనల్ కమిషనర్ సీహెచ్ గోవిందరావు సీజ్ చేశారు. తరువాత శానిటరీ ఇన్స్పెక్టర్ రవి ఫుడ్స్ యాజమాన్యాన్ని బెదిరించి తనకు అధికారం లేకపోయినా నూనె డబ్బాలను సీజ్ చేశాడు. నూనెను తనిఖీల కోసం పంపిస్తానని వీరిని బెదిరించేవాడు. తనకు రూ.10వేలు ఇస్తే కేసులు లేకుండా చూస్తామని చెప్పడంతో వీరు రూ.5వేలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. అనంతరం శానిటరీ ఇన్స్పెక్టర్పై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫుడ్స్ యాజమాన్యం తరపున కొల్లూరు సూర్య మణికంఠ శానిటరీ ఇన్స్పెక్టర్కు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం శానిటరీ ఇన్స్పెక్టర్ రవిని అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. డీఎస్పీ రంగరాజుతో పాటు సీఐలు ఎంవీ గణేష్, రమణమూర్తి, లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే వర్మను సస్పెండ్ చేయాలి
తూర్పుగోదావరి, పిఠాపురం: గొల్లప్రోలు నగరపంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ శివలక్ష్మిను అవమానించిన ఎమ్మెల్యే వర్మను టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. స్థానిక విష్ణాలయంలో కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కులవివక్ష పోరాట సమితి మండల కేఎస్ నాయకులు ఏలేటి నానిబాబు మాట్లాడుతూ మహిళ అని చూడకుండా శానిటరీ ఇన్స్పెక్టర్ శివలక్ష్మి చేతులతో మురుగును తీయించిన వర్మపై తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలో నియంత పాలన చేస్తూ, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే మహిళా అధికారి పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడం తగదన్నారు. జిల్లా నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ సిబ్బందిని నియమించడం చేతగాని వ్యక్తి మహిళా అధికారిపై అనుచితంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గంలో అధికారులకు, సిబ్బందికి రక్షణ లేకుండా పోయిందన్నారు. తక్షణం శానిటరీ ఇన్స్పెక్టర్కు ఎమ్మెల్యే క్షమాపణ చేప్పాలన్నారు. లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మహిళా అధికారిపై దౌర్జన్యానికి పాల్పడిన ఎమ్మెల్యే వైఖరిని ఖండించాల్సింది పోయి సస్పెన్షన్ ఆర్డర్స్ జారీ చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో వ్యవసాయకార్మిక సంఘం జిల్లా సహాయకార్యదర్శి కూరాకుల సింహాచలం, రజకవృత్తి దారులు సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు, డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి అంజిబాబు, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం కమిటీ సభ్యులు మల్లేశ్వరరావు, సమాచారహక్కు ప్రచార ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు పప్పు దుర్గారమేష్, ఐఏన్టీయూసీ నాయకులు కేశవరపు అప్పలరాజు, లాయర్ అసోసియేషన్ నాయకులు జీఎస్ భాస్కర్, ప్రజా సంఘాలు నాయకులు నాగేశ్వరరావు, కొజ్జారపు త్రిమూర్తులు, సురేష్, అశోక్ పాల్గొన్నారు. -
‘తూర్పు’లో మరో చింతమనేని
కాకినాడ: మహిళల పట్ల టీడీపీ నాయకుల ప్రవర్తన మారినట్లుగా కనిపించడం లేదు. గతంలో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్, మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెల్సిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఓ మహిళా అధికారితో డ్రైనేజీలో చేయి పెట్టించి వార్తల్లోకి ఎక్కారు. గొల్లప్రోలు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శివలక్ష్మీతో బలవంతంగా కచ్ఛ డ్రైనేజీలో చేయి పెట్టించి మురుగు నీటి మట్టిని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఎత్తించారు. ఇటీవల గొల్లప్రోలు 10వ వార్డులో గ్రామదర్శిని కార్యక్రమం సందర్భంగా డ్రైనేజీ శుభ్రంపై స్థానికులు, ఎమ్మెల్యే వర్మకు ఫిర్యాదు చేశారు. దీంతో వర్మ, శానిటరీ అధికారులకు ఫోన్ చేసి బండ బూతులు తిట్టారు. శానిటరీ ఇన్స్పెక్టర్ శివలక్ష్మీని పిలిపించి ఆమె నుంచి బలవంతంగా సెల్‌ఫోన్ లాక్కున్నారు. కాలువ పారతో కచ్ఛ డ్రైయిన్‌లో మట్టిని తీస్తూ..శివలక్ష్మీ చేత్తో ఆ మట్టిని బలవంతంగా ఎత్తించారు. అందరి ముందు అవమానానికి గురికావడంతో శివలక్ష్మీ సెలవు పెట్టి వెళ్లిపోయారు. విధులలో నిర్లక్ష్యం వహించిందన్న కారణంగా శివలక్ష్మీని, మున్సిపల్ కమిషనర్ విధుల నుంచి ఉపసంహరించారు. ఎమ్మెల్యే వర్మ తనకు చేసిన అవమానంపై ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని శివలక్ష్మీ కన్నీరు పెట్టుకున్నారు. మళ్లీ తన జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరికలు కూడా చేశారు. నలభై వేల మంది జనాభా కలిగిన గొల్లప్రోలు మున్సిపాలిటీలో 60 మంది శానిటరీ సిబ్బంది ఉండాలి.. కానీ 32 మంది మాత్రమే ఉన్నారు. -
గాంధీజీ స్థాయి తగ్గిస్తున్నారు
న్యూఢిల్లీ: జాతిపిత గాంధీజీని బీజేపీ ప్రభుత్వం అగౌరవపరుస్తోందని ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్(87) ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వచ్ఛభారత్ కార్యక్రమం చాటున గాంధీజీ ప్రతిష్టను మోదీ సర్కారు ‘సీనియర్ శానిటరీ ఇన్స్పెక్టర్’ స్థాయికి దిగజార్చిందని ఇర్ఫాన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో చరిత్రకారులు, కళాకారులు, విద్యార్థులు, వివిధరంగాలవారు పాల్గొన్న కార్యక్రమంలో ఇర్ఫాన్ మాట్లాడారు. గాంధీజీ 150వ జయంతి వార్షికోత్సవాలు ప్రారంభమౌతున్న తరుణంలోనైనా దేశప్రజలు మహోన్నతమైన ఆయనను జాతిపితగా గౌరవించుకోవాలని ఆయన అన్నారు. జాతీయత అంశంపై ప్రసంగిస్తూ. ఒకే జాతిగా ఉండటం అనే భావన, ఒకే దేశంగా ఉండటం అనే భావన వేర్వేరు అని అన్నారు. -
ఆయన రూమ్‌కు వెళ్తేనే హాజరేస్తాడట!
కందుకూరు: మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ కొండయ్య లైంగిక వేధింపులు భరించలేకపోతున్నామని పలువురు మహిళా పారిశుద్ధ్య కార్మికులు ఆర్డీఓ మల్లిఖార్జున ఎదుట వాపోయారు. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో ఆయన్ను కలిసి ఫిర్యాదు చేశారు. గిట్టని మహిళలు, చెప్పినట్టు వినని మహిళలను లక్ష్యంగా చేసుకుని శానిటరీ ఇన్స్పెక్టర్ వేధిస్తున్నాడని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తన గదికి రావాలంటూ తరుచూ బలవంతం చేస్తున్నాడని, వెళ్లకుంటే మస్టర్ వేయకుండా పనికి రానట్టు నమోదు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సహచర కార్మికుల వద్ద చులకనగా మాట్లాడుతూ వేధిస్తున్నాడని వాపోయారు. దీనిపై గతంలోనే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని, ఆయన వేధింపులు మాత్రం ఆపడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. స్పందించిన ఆర్డీఓ..పద్ధతి మార్చుకోవాలని గతంలోనే శానిటరీ ఇన్స్పెక్టర్ను హెచ్చరించానని, మార్పు రాకుంటే ప్రభుత్వానికి ఆయన్ను సరెండర్ చేస్తానని హెచ్చరించారు. రెండు, మూడు రోజుల్లో మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి విచారిస్తానని హామీ ఇచ్చారు. సమావేశం ఎప్పుడు నిర్వహించేది కార్మికులకు తెలియజేస్తామని, ఆ రోజు వచ్చి తమ ఇబ్బందులు చెప్పాలని ఆర్డీఓ కార్మికులకు సూచించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ఖాదర్‌బాషా, జాజుల కోటేశ్వరరావు, పిడికిటి శంకర్, ఫకృద్దీన్ ఆలీ అహ్మద్ పాల్గొన్నారు. -
శానిటరీ ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు
* మహిళపై లైంగిక వేధింపులు నిజమే.. * నిర్ధరించిన విచారణ కమిటీ గుంటూరు (నెహ్రూనగర్): లైంగిక వేధింపుల సంఘటనలో నగరపాలక సంస్థలో శానిటరీ ఇన్స్పెక్టర్పై వేటు పడింది. రెండవ డివిజన్లో పనిచేసే శానిటరీ ఇన్స్పెక్టర్ అం గడి రాజేష్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న శానిటరీ వర్కర్ నగర కమిషనర్ నాగలక్ష్మి, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్‌కు పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేయటం నగరంలో చర్చనీయాంశమైంది. ఫిర్యాదుపై స్పందించిన కమిషనర్ నాగలక్ష్మి విచారణాధికారిగా ఎంహెచ్ఓ నాగేశ్వరరావును నియమించారు. ఈ విచారణ జరుగుతుండగానే మరొక త్రిసభ్య కమిటీగా డీసీ ఏసుదాసు, సెక్రటరీ వసంతలక్ష్మి, ఎస్ఎస్ రాజ్యలక్ష్మిలను నియమించారు. విచారణలో సదరు శానిటరీ ఇన్స్పెక్టర్పై ఆరోపణలు రుజువవడంతో అతనిని సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సదరు శానిటరీ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ శానిటరీ ఇన్స్పెక్టర్ల యూనియన్ సంఘం కమిషనర్ నాగలక్ష్మిని కలవడానికి సోమవారం కమిషనర్ చాంబర్‌కు వెళ్లగా ఆమె వారిని తీవ్రంగా మందలించినట్టు తెలిసింది. లైంగిక వేధింపుల ఫిర్యాదుపై కమిషనర్ నాగలక్ష్మి తీసుకున్న చర్యలపై పలు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మరికొందరిపై చర్యలకు రంగం సిద్ధం? మరికొన్ని వార్డుల్లో మహిళా వర్కర్లపై లైంగిక వేధింపులపై కమిషనర్‌కు ఫిర్యాదులు అందినట్టు సమాచారం. వాటిపై కూడా రహస్యంగా విచారణ జరిపించి తేలితే చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. -
ఏసీబీకి పట్టుబడ్డ శానిటరీ ఇన్స్పెక్టర్
విశాఖపట్నం : ఓ వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్‌కు చెందిన ఉద్యోగి ఎం.ఈశ్వర్ రావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాల ప్రకారం.. సుభాని అనే పారిశుద్ధ్య కార్మికుడికి మున్సిపాలిటీలో ప్రభుత్వ ఉద్యోగం ఇపిస్తానని కొన్ని రోజుల ముందు శానిటరీ ఇన్స్పెక్టర్ కొంత నగదును తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకుండా తన వెంట తిప్పించుకున్నాడు. మరో రూ.10 వేలు తీసుకువస్తేనే పని జరుగుతుందని బాధితుడికి చెప్పాడు. దీంతో బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీకి అధికారులకు తెలియజేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. ఇన్స్పెక్టర్ ఈశ్వర్ రావు బాధితుడి నుంచి రూ.10 వేలు తీసుకుంటుండగా మంగళవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాలకా..చూడిక
డోన్: ఐదేళ్ల క్రితం డోన్ మునిసిపాలిటీగా ఏర్పడ్డా నేటికి మునిసిపల్ కార్యాలయం పాతభవనంలోనే కొనసాగుతోంది. కొత్త భవన నిర్మాణానికి నిధులు మంజూరైన ఫలితం లేదు. చివరకు నిధులు వెనక్కి మళ్లే అవకాశాలు లేకపోలేదని కార్యాలయ సిబ్బందే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని పాతపేటలో ఉన్న ప్రస్తుత మునిసిపల్ కార్యాలయంలో సిబ్బందికి కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఇక మునిసిపల్ కమిషనర్, చైర్మన్లకు కేటాయించిన గదులు చాలా ఇరుకుగా ఉన్నాయి. టీపీఓ, మేనేజర్, శానిటరీ ఇన్స్పెక్టర్, ఇంజనీరింగ్ సిబ్బందికి సరైన గదులు లేక ఉన్న వాటిలోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇంకా స్థలసేకరణే: మునిసిపల్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి ఐదేళ్ల కిత్రం రూ.కోటిరూపాయల నిధులు విడుదలయ్యాయి. మొదట ప్రస్తుతం ఉన్న పాతభవనాన్ని పడగొట్టి అక్కడే కొత్త భవనం నిర్మించాలని భావించినా, పట్టణంలో నూతనంగా ఫ్లైఓవర్ బిడ్జి నిర్మాణం ఏర్పాటుకానున్నందున పాతభవనం స్థానంలో కొత్త బిల్డింగ్ ఏర్పాటు ఇబ్బందిగా ఉంటుందని భావించి పట్టణ సమీపంలో స్థలసేకరణ జరుపుతున్నారు. అయితే స్థానిక గ్రూపు రాజకీయాల కారణంగా స్థలసేకరణలో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మునిసిపాలిటీ కార్యాలయానికి స్థలాన్ని రెవెన్యూ అధికారులు చూపుతున్నా స్థానిక నేతలు పట్టించుకోకపోవడంతో నేటికి స్థలసేకరణలోనే ఉందని అంటున్నారు. నూతన భవన నిర్మాణం పూర్తయితే కార్యాలయసిబ్బందికి, అటు ప్రజలకు అనువుగా ఉంటుంది. కొత్తగా ఎన్నికైన పాలకవర్గమైనా మునిసిపల్ కార్యాలయానికి శ్రీకారం చుడితే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రి ప్రాంగణంలో అపరిశుభ్రతపట్ల ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే సిబ్బంది తమపై వ్యవహారించే తీరుపై ఈ సందర్భంగా రోగులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో ఆసుపత్రి సిబ్బందిపై కలెక్టర్ మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన శానిటరీ ఇన్స్పెక్టర్, వాటర్మెన్లను సస్పెండ్ చేస్తు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆర్‌ఎంవోకు మెమో జారీ చేశారు.