ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ
కాకినాడ: మహిళల పట్ల టీడీపీ నాయకుల ప్రవర్తన మారినట్లుగా కనిపించడం లేదు. గతంలో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్, మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెల్సిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ఓ మహిళా అధికారితో డ్రైనేజీలో చేయి పెట్టించి వార్తల్లోకి ఎక్కారు. గొల్లప్రోలు మున్సిపల్ శానిటరీ ఇన్స్‌పెక్టర్ శివలక్ష్మీతో బలవంతంగా కచ్ఛ డ్రైనేజీలో చేయి పెట్టించి మురుగు నీటి మట్టిని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఎత్తించారు. ఇటీవల గొల్లప్రోలు 10వ వార్డులో గ్రామదర్శిని కార్యక్రమం సందర్భంగా డ్రైనేజీ శుభ్రంపై స్థానికులు, ఎమ్మెల్యే వర్మకు ఫిర్యాదు చేశారు. దీంతో వర్మ, శానిటరీ అధికారులకు ఫోన్ చేసి బండ బూతులు తిట్టారు.
శానిటరీ ఇన్స్‌పెక్టర్ శివలక్ష్మీని పిలిపించి ఆమె నుంచి బలవంతంగా సెల్‌ఫోన్ లాక్కున్నారు. కాలువ పారతో కచ్ఛ డ్రైయిన్‌లో మట్టిని తీస్తూ..శివలక్ష్మీ చేత్తో ఆ మట్టిని బలవంతంగా ఎత్తించారు. అందరి ముందు అవమానానికి గురికావడంతో శివలక్ష్మీ సెలవు పెట్టి వెళ్లిపోయారు. విధులలో నిర్లక్ష్యం వహించిందన్న కారణంగా శివలక్ష్మీని, మున్సిపల్ కమిషనర్ విధుల నుంచి ఉపసంహరించారు. ఎమ్మెల్యే వర్మ తనకు చేసిన అవమానంపై ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని శివలక్ష్మీ కన్నీరు పెట్టుకున్నారు. మళ్లీ తన జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరికలు కూడా చేశారు. నలభై వేల మంది జనాభా కలిగిన గొల్లప్రోలు మున్సిపాలిటీలో 60 మంది శానిటరీ సిబ్బంది ఉండాలి.. కానీ 32 మంది మాత్రమే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment