స్వైన్‌విహారం..
స్వైన్‌విహారం..
Published Wed, Mar 29 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM
- ఐదేళ్ల తరువాత జిల్లాలో మరోసారి
- రావులపాలేనికి చెందిన ఇద్దరి బాలికలకు వ్యాధి నిర్ధారణ
- కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు
- అప్రమత్తమైన యంత్రాంగం
సాక్షి ప్రతినిధి, కాకినాడ/రావులపాలెం : సుమారు ఐదేళ్ల క్రితం జిల్లాను వణికించిన స్వైన్‌ఫ్లూ మరోసారి బయటపడింది. రావులపాలెంలో ఇద్దరు బాలికలకు ఈ వ్యాధి సోకినట్టు నిర్ధారణకావడం జిల్లావాసులను హడలెత్తిస్తోంది. తొలిసారిగా 2012లో స్వైన్‌ఫ్లూ కేసులు జిల్లాలో నమోదు కావడంలో అప్పట్లో పెద్ద సంచలనమైంది. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చినబోడ్డువెంకటాయపాలెం, పెదబొడ్డు వెంకటాయపాలెం పరిసర ప్రాంతాల్లో అప్పట్లో ఆరు స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మత్స్యకారులు అధికంగా నివసించే ఆ గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో స్వైన్‌ఫ్లూ రావడానికి కారణమైందని అప్పట్లో వైద్యులు నిర్ధారించారు. తాజాగా రావులపాలెంలో రెండు స్వైన్ ఫ్లూ కేసులు వెలుగు చూడడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జర్వం, జలుబు లక్షణాలతో రాజమహేంద్రవరం, కాకినాడ ఆస్పత్రుల్లో చికిత్స పొందున్న రావులపాలేనికి చెందిన ఇద్దరు బాలికలకు స్వైన్‌ఫ్లూ సోకినట్టు నిర్ధారించడంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రావులపాలెంలో ఇటీవల నిమోనియా వ్యాధితో సత్తి నళిని(47) మృతి చెందింది. ఆమెకు దీప్తి, శ్రీజ ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ జ్వరం, జలుబుతో బాధపడుతుండగా నాలుగు రోజుల క్రితం రాజమహేంద్రవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆ ఇద్దరిలో శ్రీజకు హెచ్1ఎన్1 పాజిటివ్ ఉండటంతో స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకినట్టు నిర్ధారణకు వచ్చి అందుకు అనుగుణంగా చికిత్స చేస్తున్నారు. మెడిసిన్ చదువుతున్న దీప్తికి సాధారణ జ్వరమే అని నిర్ధారణ కావడంతో ఆ కుటుంబం కాస్త ఊరట చెందింది.
అంతలోనే వారి సమీప బంధువైన నాలుగేళ్ల కర్రి హర్షిత అనారోగ్యానికి గురవ్వడంతో ఆందోళనలో పడ్డారు. స్వైన్‌ఫ్లూ భయం వెంటాడుతుండగా ఆ బాలికకు కాకినాడ మెయిన్‌రోడ్డులోని ఒక ప్రైవేటుæ ఆస్పత్రిలో చేర్పించగా స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఆ విషయం బయటకు రావడంతో వారి బంధువుల్లో ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కె. చంద్రయ్య, ఊబలంక పీహెచ్‌సీ వైద్యులు ఎం.శైలజారాణి, జి.దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులతో మాట్లాడి పిల్లల ఆరోగ్య పరిస్థితులు ఆరా తీశారు. శ్రీజ తండ్రి వెంకటరెడ్డి, సోదరి దీప్తితో బాలికల అనారోగ్య లక్షణాలు తెలుసుకున్నారు.
పశ్చిమగోదావరి నుంచి తూర్పుకు..
వీరిద్దరి కంటే ముందు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన కొండేటి బాలాజీ స్వైన్‌ఫ్లూతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని డీఎంఅండ్‌హెచ్‌ఎం చంద్రయ్య ఊబలంకలో ధ్రువీకరించారు. శ్రీజ తండ్రి వెంకటరెడ్డి వ్యాపార రీత్యా పాలుకొల్లు, నరసాపురం ప్రాంతాలకు వెళ్లి రావడం, నరసాపురానికి చెందిన బాలాజీ స్వైన్‌ఫ్లూతో రాజమహేంద్రవరం రావడం ఆ క్రమంలోనే అక్కడి నుంచి స్వైన్‌ఫ్లూ మన జిల్లాకు వచ్చి ఉంటుందనే అనుమానాన్ని డీఎంహెచ్‌ఓ వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే శీతాకాలంలో కనిపించే స్వైన్‌ఫ్లూ వేసవిలో నమోదు కావడం వైద్యాధికారులకు అంతుబట్టడం లేదు.
కాకినాడ జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డు
స్వైన్ ప్లూ వ్యాధిగ్రస్తుల కోసం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఒక వార్డును ఏర్పాటు చేశాం. ఈఎన్‌డీ ఆప్తమాలజీ వార్డు పైఅంతస్తులో పది బెడ్లతో ఈ వార్డును అందుబాటులో ఉంచాం. వైద్య సేవలందించేందుకు మూడు షిప్ట్‌ల్లో వైద్య సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉంచాం. హెడ్ నర్స్ ఆధ్వర్యంలో స్టాఫ్‌నర్స్, ఎఫ్‌ఎన్‌వోలతో సిబ్బందిని సమాయత్తం చేశాం. వెంటిలేటర్‌ను ఏర్పాటు చేశాం. మరో ప్రత్యేక వార్డును సిద్ధం చేస్తున్నాం.
- డాక్టర్ రాఘవేంద్రరావు, సూపరింటెండెంట్, కాకినాడ జీజీహెచ్
వ్యాధి లక్షణాలు
స్వైన్ ప్లూ హెచ్1ఎన్1 ఇన్‌ప్లూఎంజ వైరస్ కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. సాధారణ జలుబుగా ప్రారంభమై ఆరు రోజులుగా జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, దగ్గు, తలనొప్పి, వాంతులు, విరేచనాలతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే స్వైన్‌ప్లూగా గుర్తిస్తారు.
Advertisement