తహసీల్దార్లకు స్థానచలనం
Published Mon, Jul 3 2017 12:02 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
కర్నూలు (అగ్రికల్చర్): రెవెన్యూ శాఖలో ఆదివారం రాత్రి 12 మంది తహసీల్దార్లతో సహా నలుగు డిప్యూటీ తహసీల్దార్లు, 156 మంది వీఆర్‌ఓలను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్‌ఓల బదిలీల వ్యవహారం దాదాపు 40 రోజులుగా పెండింగ్‌లో ఉంది. ఇటీవలనే సాక్షిలో వీఆర్‌ఓల బదిలీలపై అనిశ్చితి కథనం కూడా ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు బదిలీల ప్రక్రియను చేపట్టి ఎట్టకేలకు పూర్తి చేశారు. మూడు రెవెన్యూ డివిజన్ల నుంచి 183 మంది వీఆర్‌ఓల బదిలీలకు ప్రతిపాదనలు పంపగా, 156మందిని బదిలీ చేశారు. వీఆర్‌ఓల బదిలీల్లో అధికార పార్టీ నేతల సిఫార్సులకు అనుగుణంగా బదిలీలు జరిగినట్లు తెలుస్తుంది. పలువురు వీఆర్‌ఓలు ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ సిఫార్సుల మేరకు కోరుకున్న స్థానాలకు బదిలీ అయినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
తహసీల్దార్లలో వెయిటింగ్‌లో ఉన్న ముగ్గురికి పోస్టింగ్‌లు ఇవ్వడంతో పాటు 9 మందిని బదిలీ చేశారు. ఇటీవల ఎంహెచ్‌డీ సుధాకర్‌ను సంజామల తహసీల్దారుగా నియమించారు. అయితే అధికార పార్టీ నేతలు అక్కడ బాధ్యతలు స్వీకరించకుండా అడ్డుకున్నట్లు తెలుస్తుంది. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తున్నారని బండి ఆత్మకూరు తహసీల్దారు శేషఫణిపై కలెక్టర్..నెల రోజులుగా అసంతృప్తితో ఉన్నారు. బండి ఆత్మకూరు చెందిన ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో అక్కడి తహసీల్దార్‌పై వేటు పడింది.
Advertisement