తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
Published Mon, Nov 28 2016 11:00 PM | Last Updated on Tue, Oct 2 2018 3:04 PM
ఎమ్మెల్యే ఎదుటే బూతుల పంచాంగం
కొల్లూరు : జనచైతన్య యాత్రల్లో తెలుగు తమ్ముళ్ల ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా మండలంలోని తిప్పలకట్ట గ్రామం దీనికి వేదికైంది. సాక్షాత్తూ స్థానిక ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమక్షంలోనే బూతుల పంచాంగంతో ఒకరిపై ఒకరు వీరంగం వేశారు. సోమవారం గ్రామంలో జనచైతన్య యాత్ర ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమక్షంలో నిర్వహించారు. అనంతరం భోజనాల కార్యక్రమంలో కొల్లూరు ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్, తిప్పలకట్ట సర్పంచి దివి మహాలక్ష్మి భర్త సీతారామయ్య మధ్య వివాదం చెలరేగింది. తిప్పలకట్టలో పదిరోజుల క్రితం జరిగిన గేద దొంగతనం కేసులో స్థానిక ఎంపీటీసీ అద్దంకి నాగమల్లేశ్వరరావును అడ్డుపెట్టుకొని ఆడిస్తున్నారంటూ సీతారామయ్య వ్యాఖ్యానించడంతో వాగ్వివాదం మొదలైంది. ఎంపీపీ, శీతారామయ్యల మధ్య మాటల యుద్దం తారస్థాఽయికి చేరి బూతుల పంచాంగానికి తెరలేచింది. అంతేగాక తోపులాటకు దిగారు. ఎమ్మెల్యే, కృష్ణా పశ్చిమ డెల్టా పీసీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ వివాదాన్ని సర్దు బాటు చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఇంతలో వైస్ ఎంపీపీ గొరికపూడి ప్రసాద్ ఎంపీపీని దూషించిన వ్యక్తికి మైనేని మురళీకృష్ణ వత్తాసు పలుకుతున్నారంటూ వాదనకు దిగడంతో వివాదం తారస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. ఎంపీపీ మధు తనకు ఎటువంటి సంబంధం లేని విషయాన్ని అడ్డుపెట్టుకొని దూషించడం ఏంటని ముందు ఆ వ్యవహారం తేల్చాలని ఎమ్మెల్యేని పట్టుబట్టడంతో ఎమ్మెల్యే తలపట్టుకోవాల్చి వచ్చింది. రోజురోజుకు పార్టీలో పెరుగుతున్న వివాదాలు, విభేదాలతో పార్టీ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళనను ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.
Advertisement