ప్రజాదరణ చూసి ఓర్వలేకనే దాడులు
– గౌరువెంకటరెడ్డి
కర్నూలు: జిల్లాలో వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక అధికార పక్ష నాయకులు దాడులకు పాల్పడుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం చెరుకులపాడులో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నారాయణరెడ్డి వర్గీయులపై దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. టీడీపీ నాయకులు చెరుకులపాడు గ్రామంలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజాసంక్షేమానికి వినియోగించాలి తప్ప దుర్వినియోగానికి పాల్పడటం మంచిది కాదని హితవు పలికారు. డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి తన అనుచరవర్గాన్ని ప్రత్యర్థులపై ఎగదోసి దాడులు చేయిస్తున్నాడని ఆరోపించారు. అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజల మన్ననలు పొందాలి తప్ప దౌర్జన్యం, దాడుల ద్వారా ప్రతిపక్షాలను నీరుగార్చాలని ప్రయత్నిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. చెరుకులపాడులో జరిగిన దౌర్జన్యకాండపై విచారణ జరిపి బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.