- నగరపాలక సంస్థ స్థలానికీ కంచె
- ఆదెమ్మదిబ్బలో యథేచ్ఛగా ప్రభుత్వ స్థలం కబ్జా
- హెచ్చరిక బోర్డు ఉన్నా డోంట్‌కేర్
- చోద్యం చూస్తున్న అధికారులు
తమ్ముడి బరితెగింపు
Published Tue, Jan 3 2017 11:45 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
సాక్షి, రాజమహేంద్రవరం :
అధికారమే అండగా బరితెగించిన ‘తెలుగు’ తమ్ముడు ప్రభుత్వం స్థలాన్ని కబ్జా చేసేశాడు. ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆ స్థలానికి కంచె కూడా వేశాడు. కోలమూరుకు చెందిన టీడీపీ నేత పిన్నమరెడ్డి ఈశ్వరుడు రూ.100 కోట్ల విలువైన ఆదెమ్మదిబ్బ స్థలంలోని సర్వే నంబర్ 730లో ఉంటున్న పేదలకు గుడిసెకు రూ.50 వేలు, రేకుల షెడ్డుకు రూ.70 వేల చొప్పున ఇచ్చి ఖాళీ చేయించిన విషయం తెలిసిందే. ఆ స్థలానికి కంచె కూడా వేసేశారు. తాజాగా ఆదెమ్మదిబ్బ స్థలంలోనే సర్వే నంబర్ 725/3ఏలో
హోలీ ఏంజెల్స్ పాఠశాల వెనుక, పక్కన ఉంటున్న పేదల గుడిసెలను ఖాళీ చేయించి అక్కడ కూడా కంచె వేశారు. హోలీ ఏంజెల్స్ పాఠశాల యాజమాన్యానికి, నగరపాలక సంస్థకు ఆ పాఠశాల స్థలం విషయంలో కోర్టు వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పులను అనుసరించి నగరపాలక సంస్థ పాఠశాల భవనం వెనుక గోడపై ‘‘సర్వే నంబర్ 725/3ఏలో ఉన్న ఈ స్థలం నగరపాలక సంస్థది. ఆక్రమించినవారు శిక్షార్హులు’’ అంటూ హెచ్చరిక కూడా రాయించారు. సరిగ్గా ఇదే స్థలంలో గతంలో హోలీ ఏంజెల్స్ పాఠశాల తాత్కాలికంగా తరగతి గదులు ఏర్పాటు చేసింది. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వి.విజయరామరాజు ఈ తరగతి గదులను తొలగించారు.
హెచ్చరిక బోర్డు ఉన్నా బేఖాతరు
ఇదిలా ఉండగా హోలీ ఏంజెల్స్ పాఠశాల స్థలంపై యాజమాన్యానికి, నగరపాలక సంస్థకు 20 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో పాఠశాల భవనాల్లోని కొంత భాగంలో కొన్నేళ్లుగా తరగతులు కూడా నిర్వహించడం లేదు. పాఠశాల భవనం వెనుకవైపు నగరపాలక సంస్థ నిర్మించిన వాంబే ఇళ్లున్నాయి. పాఠశాలకు, వాంబే ఇళ్లకు మధ్య నగరపాలక సంస్థ సీసీ రోడ్డు నిర్మించింది. పాఠశాల భవనానికి, సీసీ రోడ్డుకు మధ్య పది నుంచి 15 అడుగుల మేర భవనం పొడవునా ఖాళీ స్థలం ఉంది. పాఠశాల భవనం పక్కన వాంబే ఇళ్లు ఎ, బి బ్లాకుల ఎదుట కూడా పెద్ద మొత్తంలో ఖాళీ స్థలం ఉంది. అక్కడ కూడా నిన్న మొన్నటి వరకూ పేదలు గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకుని నివసిస్తున్నారు. గతంలో ఆ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో వారి ఇళ్లు కూడా కాలిపోయాయి. అప్పట్లో వారికి ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం స్లిప్పులు కూడా పంపిణీ చేసింది. అయితే ఈ స్థలాన్ని తాను కొనుగోలు చేశానంటూ కోలమూరుకు చెందిన టీడీపీ నేత పిన్నమరెడ్డి ఈశ్వరుడు పది రోజుల కిందట వారిని ఖాళీ చేయించారు. దీనిపై గత నెల 26న ‘భూమంత్రం’ శీర్షికన నగరపాలక సంస్థ స్థలాన్ని కబ్జా చేస్తున్నారంటూ ‘సాక్షి’ కథనం ప్రచురించింది. అప్పటినుంచీ స్తబ్దుగా ఉన్న కబ్జాదారులు తాజాగా ఆ స్థలానికి కంచె వేశారు. నగరపాలక సంస్థ స్థలం.. ఆక్రమించినవారు శిక్షార్హులంటూ హెచ్చరిక ఉన్నా ఆ స్థలానికి కంచె వేయడం చూస్తే వారి బరితెగింపును అర్థం చేసుకోవచ్చు.
పట్టించుకోని అధికారులు
ఇంత జరుగుతున్నా నగరపాలక సంస్థ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. కోలమూరు గ్రామం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నారు. గోరంట్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా అయిన పిన్నమరెడ్డి ఈశ్వరుడు అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. ఆయన రాజమహేంద్రవరం శివార్లలో పలు వెంచర్లు వేశారు. కోలమూరు పంచాయతీ రాయుడుపాకలు గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా ఈశ్వరుడు వేసిన నాలుగు వెంచర్లను అధికారులు తొలగించారు. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు అనంతరం ‘రియల్’ వ్యాపారం తగ్గిపోవడంతో నగరంలో ఉన్న ఈ స్థలంపై ఆయన కన్నుపడిందని ఆ గ్రామంలో చర్చించుకుంటున్నారు.
Advertisement
Advertisement