ఇది సెంట్రల్... మాదే కంట్రోల్
ఇది సెంట్రల్... మాదే కంట్రోల్
Published Thu, Sep 8 2016 7:10 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
టీడీపీ ముఠా అక్రమాలకు అడ్డాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం
- ఉత్సవాలకు చందాల పేరిట వ్యాపారుల వద్ద వసూళ్ల దందా
- ఖాళీ స్థలాలు స్వాహా... ఆపై బలవంతపు సెటిల్‌మెంట్లు
- చోద్యం చూస్తున్న పోలీసులు
ఓ వ్యాపారి రానున్న దసరా ఉత్సవాలకు రూ.50 వేల చందా పంపించారు. టీడీపీ ప్రజాప్రతినిధి అనుచరులు ఆ చందాను తిరస్కరించారు. ‘రూ.లక్షకు తక్కువ తీసుకోవద్దని సార్ చెప్పారు. వెళ్లి రూ.లక్ష తెండి. లేకపోతే మీ ఇష్టం. జరగాల్సింది జరుగుతుంది’ అంటూ హుకుం జారీచేశారు. విధిలేని పరిస్థితుల్లో ఆ వ్యాపారి రూ.లక్ష చందా సమర్పించుకున్నారు. ప్రతి పండుగనూ ప్రతి వివాదాన్నీ ఆ ప్రజాప్రతినిధి సొమ్ముచేసుకుంటున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి ఇదీ...
సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ నడిబొడ్డున ఉన్న సెంట్రల్ నియోజకవర్గం అధికార టీడీపీ అక్రమాలకు అడ్డగా మారింది. టీడీపీ ప్రజాప్రతినిధి సన్నిహిత ముఠా తమ ఆగడాలతో అందర్నీ బెంబేలెత్తిస్తోంది. కొన్నేళ్లుగా మరుగునపడిపోయిన వసూళ్ల దందాను మళ్లీ తెరపైకి తెచ్చింది. రాష్ట్రస్థాయిలో వాణిజ్య కేంద్రంగా గుర్తింపుపొందిన స్థానిక మార్కెట్‌ను తమ అక్రమార్జనకు వనరుగా మార్చుకుంది. ఖాళీ స్థలాలను ఆరగిస్తూ.. ఇతరత్రా వివాదాల్లో జోక్యం చేసుకుంటూ సొమ్ముచేసుకుంటోంది. రాజకీయ ఒత్తిడికి పోలీసులు తలొగ్గడంతో ఆ ముఠా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది.
వ్యాపారాన్ని బట్టి టార్గెట్లు
మార్కెట్‌ను ప్రజాప్రతినిధి ముఠా గుప్పిటపట్టింది. వందల సంఖ్యలో ఉన్న దుకాణాల నుంచి వివిధ రూపాల్లో వసూళ్ల దందా సాగిస్తోంది. డూండీ వినాయక ఉత్సవాల కమిటీ అంశాన్ని వ్యూహాత్మకంగా వివాదాస్పదం చేసింది. ప్రశ్నించినవారిపై పోలీసులు ఏకపక్షంగా కేసు నమోదు చేసి మార్గం సుగమం చేశారు. ఇదే అదనుగా ఆ ముఠా రానున్న ఉత్సవాలకు చందాల పేరిట వసూళ్ల దందా సాగిస్తోంది. వ్యాపారాన్ని బట్టి రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు టార్గెట్లు నిర్ణయించి మరీ వసూలు చేస్తోంది. ఈ వసూళ్ల ఎన్ని కోట్లు ఉంటుందనేది అంచనా వేయలేమని వ్యాపారులు పేర్కొంటున్నారు. వసూలు చేసిన మొత్తంలో 25 శాతానికి మించి ఉత్సవాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదని, మిగిలినదంతా ప్రజాప్రతినిధి ఖజానాకేనని స్పష్టం చేస్తున్నారు.
ఖాళీ స్థలాలపై కన్ను
ఏలూరు రోడ్డుకు సమీపంలోని ఓ స్థలంపై ప్రజాప్రతినిధి బంధువు కన్నుపడింది. మార్కెట్ విలువ ప్రకారం ఆ స్థలం ధర రూ.3 కోట్ల వరకు ఉంటుంది. అందులో కొన్ని దుకాణాల నిర్మాణానికి స్థల యజమాని సిటీ ప్లానింగ్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కార్పొరేషన్ అధికారులు అనుమతివ్వకుండా జాప్యం చేస్తున్నారు. దీనిపై అధికారులను ఆయన ఆరా తీయగా వెళ్లి ప్రజాప్రతినిధి బంధువుతో మాట్లాడమని సూచించారు. ఆయన తనకు ఆ స్థలాన్ని కోటి రూపాయలకు అమ్మాలని చెప్పారు. అందుకు ఆయన సమ్మతించలేదు. దీంతో ఇప్పటికీ ఆ స్థలంలో భవన నిర్మాణానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు. అదే ప్రాంతంలో హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబానికి చెందిన పూర్వికుల ఇంటిని అతితక్కువ మొత్తానికి బలవంతంగా తమపేరిట రాయించుకున్నారు. దీనిపై ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించినా ఫలితంలేకపోయింది.
‘అన్న’ చెబితే అంతే
ప్రజాప్రతినిధిని అనుచరులు అన్నగా సంబోధిస్తారు. తమ దృష్టికి వచ్చిన ప్రైవేటు వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారు. అన్న చెప్పారంటూ... తమతో డీల్ కుదుర్చుకునేవారికి అనుకూలంగా వ్యవహారాన్ని ఏకపక్షంగా ముగిస్తున్నారు.
- ఓ మహిళ ఇటీవల ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడం వివాదాస్పదమైంది. దానిపై రోగి బంధువులు ఆందోళన చేశారు. ప్రజాప్రతినిధి ముఠా ఆస్పత్రి యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ బాధితులను బెదిరించింది. మృతదేహం సహా వారిని బలవంతంగా బయటకు పంపించింది. ఈ వ్యవహారంలో ఆ ముఠా రూ.10 లక్షలు వసూలు చేసిందని పోలీసులే చెప్పడం గమనార్హం.
- అదే ప్రాంతంలో మరో ఆస్పత్రిలో కూడా ఓ శస్త్రచికిత్స వికటించి ఒకరు మృతిచెందడం వివాదాస్పదమైంది. ఆ వ్యవహారంలో కూడా ప్రజాప్రతినిధి సన్నిహిత ముఠా రంగంలోకి దిగింది. ఆస్పత్రి యాజమాన్యానికి అనుకూలంగా పెదరాయుడి తరహాలో తీర్పునిచ్చింది. యాజమాన్యం నుంచి రూ.10 లక్షలు వసూలు చేసింది.
Advertisement
Advertisement