జన్మభూమిలో ‘తమ్ముళ్ల’ దందా!
► జనం రాలేదని ఆక్రోశం
► వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి
సాక్షి ప్రతినిధి, విజయవాడ : జిల్లాలో శనివారం జరిగిన జన్మభూమి సభల్లో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది. కొన్నిచోట్ల వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై టీడీపీ వారు దౌర్జన్యం చేశారు. సభలకు జనం రాలేదు. దీంతో టీడీపీ జనాన్ని ఇండ్లవద్దకు వెళ్లి తీసుకొచ్చారు.
వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడి...
నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం కృష్ణారావుపాలెంలో జరిగిన జన్మభూమి సభ రసాభసాగా సాగింది. సభ ప్రారంభంలో గతంలో జరిగిన సభల్లో తీసుకున్న నిర్ణయాలు, అమలు జరిగిన తీరు గురించి వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ కొందరు టీడీపీ కార్యకర్తలు ఎదురు తిరిగారు. వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త తాళ్లూరి ప్రసాద్‌ను టీడీపీ కార్యకర్త వల్లభ రాజు కాలితో తన్నాడు. వేదిక వద్ద టీడీపీ నియోజవర్గ ఇన్‌ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరావు ఉన్నారు. వేదికకు కొద్ది దూరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పోలీసులు మాత్రమే ఉన్నారు.
సభనుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే కల్పన
పామర్రు హైస్కూలు ఆవరణంలో జరిగిన జన్మభూమి సభ వివాదాస్పదంగా మారింది. తెలుగుదేశం పార్టీ పామర్రు టౌన్ అధ్యక్షుడు పామర్తి విజయశేఖర్ సభలో వేదికపై కూర్చున్నాడు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు పట్టణ ఉప సర్పంచ్ ఆరేపల్లి శ్రీనివాసరావు వేదికపై కూర్చున్నాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు శ్రీనివాసరావును వేదికపై నుంచి కిందకు దించాల్సిందిగా పోలీసులను పట్టుబట్టడంతో ఆయనను పోలీసులు కిందకు తీసుకొచ్చారు. సభా మర్యాదలు పాటించపోవడం, కనీసం ప్రొటోకాల్ పాటించకపోవడంతో సభకు హాజరైన ఎమ్మెల్యే ఉప్పలేటి కల్పన జన్మభూమి సభ నుంచి వెళ్లిపోయారు.
వేదికలపై టీడీపీ నేతలు
పెడనలో జరిగిన జన్మభూమి సభల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు నేరుగా వేదికపై కూర్చున్నాడు. పలు సభల్లో టీడీపీ నాయకులు ప్రజా ప్రతినిధుల్లా వ్యవహరించారు.
పనిచేయని అధికారులొద్దు : మంత్రులు
కెకలూరు: తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. అధికారులు పట్టించు కోవడం లేదు.. వేసవిలో నీటిఎద్దడి నివారణకు అసలు ప్రణాళికే అధికారుల వద్ద లేదు.. జన్మభూమి కార్యక్రమానికి ఇంతమంది వస్తే అధికారులు రాకపోతే ఏలా.. అంటూ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. అలాగే ఏఈ సూర్యరావు సరైన సమాధానం చెప్పకపోవడంతో మంత్రి అయ్యన్న పాత్రుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి ఆర్ డబ్ల్యూఎస్ డీఈని పంపించేయండని చెప్పారు. అదే విధంగా అటవీశాఖ డీఆర్వో రాకుండా గార్డును మాత్రమే పంపారు. దీనిపై అటవీశాఖ పీసీసీఎఫ్‌తో మంత్రి మాట్లాడి మరో పర్వాయం ఇలా జరగకుండా చూడాలని సూచించారు.
అర్హులందరికి సంక్షేమ పథకాలు : మంత్రికొల్లు
మచిలీపట్నం సబర్బన్ : అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఒకటవ వార్డులో శనివారం ఆయన పర్యటించారు. బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ పేదలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలను అందించేందుకే ప్రభుత్వం జన్మభూమి- మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వార్డులో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు.