
ఒంటరి మహిళపై టీడీపీ నేతల దాడి
అనంతపురం సెంట్రల్ : అనంతపురం రూరల్ మండలం పూలకుంట గ్రామంలో అధికారపార్టీ నాయకులు రెచ్చిపోయారు. ఒంటరిగా నివసిస్తున్న మహిళను విచక్షణా రహితంగా దాడి చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు... గ్రామంలో నివాసముంటున్న కవిత అనే మహిళపై బుధవారం కొంతమంది టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. కవిత భర్త కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కుమార్తెతో కలిసి నివాసముంటోంది. అదే గ్రామానికి చెందిన స్టోర్ డీలర్ శంకర్‌రెడ్డి కవిత సోదరుడిపై మంగళవారం చేయి చేసుకున్నాడు. ఈ అంశంపై శంకర్‌రెడ్డితో కవిత ఫోన్లో వాగ్వాదానికి దిగింది.
దీన్ని జీర్ణించుకోలేని ఆయన నాగిరెడ్డి, రాము, తిరుపాల్ తదితరులతో కలిసి బుధవారం గ్రామ నడిబొడ్డున దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో చేరారు. కాగా ఈ విషయంపై మంగళవారమే బాధితురాలు ఇటుకలపల్లి పోలీసులను ఆశ్రయించింది. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోకుండా దుప్పటి పంచాయితీ చేసి చేతులు దులుపుకున్నారు. తనకు ప్రాణహాని ఉందని కూడా పోలీసులు ఎదుట వాపోయానని, అయినా కూడా పోలీసులు వినకుండా రాజీ చేసి పంపారని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయం చేయాలని బాధితురాలు వాపోయారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలిని మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి, కార్యదర్శి పద్మావతి, గౌరవాధ్యక్షురాలు చిరంజీవమ్మ, నగర కార్యదర్శి జయలక్ష్మి తదితరులు పరామర్శించారు.