
టీడీపీ నేత దౌర్జన్యం
కదిరి : నల్లచెరువులో టీడీపీ నేత, సింగిల్ విండో డైరెక్టర్ తిరుపాలు వీరంగం సష్టించాడు. కె.పూలుకుంటకు వెళ్లే దారిలో పిల్లలకు బిస్కెట్లు కొనుక్కుంటున్న దామవాండ్లపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త చిన్న వెంకటరమణపై తిరుపాలు మంగళవారం ఇనుప రాడ్‌తో దాడి చేసి కుడిచేయి విరగ్గొట్టాడు. ఒక కేసులో రాజీ ధోరణితో వెళ్లండని ఆయన సూచించడంతో ‘నువ్వెవర్రా చెప్పడానికి? నీ పెద్ద మనిషి తనం ఎవడికి కావాల్రా..’ అంటూ వచ్చీ రాగానే ఇనుపరాడ్‌తో దాడి చేశాడని బాధితుడు పోలీసుకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానికులు వెంటనే కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పరామర్శించిన డాక్టర్ సిద్దారెడ్డి
వైస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పి.వి. సిద్దారెడ్డి వెంటనే కదిరి ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్న వెంకటరమణను పరామర్శించారు. బాధితుడికి ధైర్యం చెబుతూ, పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని ఆరోపించారు. ఆయన వెంట పార్టీ నల్లచెరువు మండల కన్వీనర్ రమణారెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ దశరథనాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మీపతి ఉన్నారు.