తన్నుకున్న తమ్ముళ్లు
Published Sat, Nov 5 2016 5:57 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
మాచర్లలో ఆధిపత్య పోరు... రోడ్డెక్కిన నేతలు
మాచర్ల: మహిళా ప్రజాప్రతినిధుల తరఫున పెత్తనం చెలాయిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు ఘర్షణకు దారితీసింది. వీరిద్దరూ అధికార టీడీపీకి చెందిన వారే కావడం గమనార్హం. వివరాలలోకి వెళితే... మాచర్ల మండలం చింతలతండా గ్రామ సర్పంచ్ సరోజిని భర్త చిన్నానాయక్ ఉప సర్పంచ్ నీల బావ వాంకుడావత్ స్వామి నాయక్ ఇరువురూ టీడీపీకి చెందిన వారే. సర్పంచ్ తమకు సహకరించడం లేదని ఉపసర్పంచ్ బావ మెజారీ వార్డు సభ్యులను కలుపుకుని పనులుచేస్తున్నాడు. సర్పంచ్‌గా మేం ఉండగా నువ్వు చేసిదేమిటని సర్పంచ్ భర్త వీరిపై గుర్రుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సర్పంచ్ స్థానికంగా అందుబాటులో ఉండడం లేదని ఉప సర్పంచ్ వర్గీయులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.
సర్పంచ్ చెక్ పవర్ కోల్పోవడంతో దీనికి కారణం ఉప సర్పంచ్ వర్గీయులేనని సర్పంచ్ వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు. శుక్రవారం సర్పంచ్ సరోజిని భర్త చిన్నానాయక్ ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన సమయంలోనే ఉప సర్పంచ్ నీలా బావ వాంకుడావత్ స్వామి నాయక్ రాగా ఎదురుపడ్డారు. నువ్వెంత అంటే నువ్వెంత అని వాగ్వాదానికి దిగారు. అది కాస్తా చినికి చినికి గాలివానలా మారి ఘర్షణపడ్డారు. ఒకరినొకరు నెట్టుకుంటూ కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగా వీరు ఘర్షణ పడడంతో అధికారులు, కార్యదర్శులు ఎవరికేం చెప్పాలో అర్థంకాక చూస్తుండిపోయారు. ఆ తర్వాత వీరిద్దరు పట్టణ పోలీస్టేషన్‌కు చేరుకుని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇద్దరూ తెలుగుదేశం పార్టీ వారు కావడం, అనుకూల నాయకులతో ఫోన్లు చేయించడంతో వీరి ఫిర్యాదుల విషయంలో ఏమి చేయాలో అని పోలీసులు ఆలోచనలో పడ్డారు. ఈ విషయమై అర్బన్ సీఐ సత్యకైలాష్‌నా«ద్‌ను ‘సాక్షి’ సంప్రదించగా ఫిర్యాదులపై విచారణ చేస్తున్నామని చెప్పారు. కాగా, ఇప్పటికే నియోజకవర్గంలో వర్గ విభేదాలతో సతమతమవుతున్న టీడీపీ నాయకులకు తాజాగా చింతలతండా నాయకులు రోడ్డున పడి కొట్టుకోవడంతో తలలుపట్టుకునే పరిస్థితి ఏర్పడింది.
Advertisement
Advertisement