- కొంతమూరు గ్రామకమిటీ ఎన్నిక రసాభాస
- ప్రస్తుత అధ్యక్షుడు వద్దంటూ నినాదాలు
- సభ్యత్వాలు లేకుండా చేశారని ఆరోపణ
తమ్ముళ్ల బాహాబాహీ
Published Tue, Feb 14 2017 9:58 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
రాజమహేంద్రవరం రూరల్ :
తెలుగుదేశం పార్టీలో ఉన్న అసమ్మతి సెగలు గ్రామ స్థాయి సంస్థాగత ఎన్నికలలో ఒక్కసారిగా బయటపడ్డాయి. జన్మభూమి కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు అసలైన కార్యకర్తలకు గుర్తింపునివ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమైంది. టీడీపీ సభ్యత్వాలు సైతం రాయలేదని బహిరంగంగా ఆరోపించడంతో పాటు, బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ ఘటన మంగళవారం కొంతమూరులో చోటు చేసుకుంది. పార్టీ కొంతమూరు గ్రామ కమిటీ ఎన్నికల సమావేశం గ్రామ టీడీపీ అధ్యక్షుడు దండమూడి సత్యప్రసాద్ ఇంటి వద్ద ఖాళీస్థలంలో నిర్వహించారు. పరిశీలకులుగా జిల్లా టీఎ¯ŒSటీయూసీ అధ్యక్షుడు నక్కాచిట్టిబాబు, కార్పొరేటర్లు పల్లిశ్రీనివాసరావు, మానుపాటి తాతారావు, మాజీ కార్పొరేటర్ యార్లగడ్డ శేఖర్ హాజరయ్యారు. కార్యకర్తలు అభిప్రాయం తీసుకుంటుండగానే కంటిపూడి బలరామకృష్ణ వర్గీయులు, దండమూడి ప్రసాద్ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దండమూడి ప్రసాద్‌ను ఎట్టి పరిస్థితుల్లోను గ్రామ అధ్యక్షుడిగా నియమించడానికి వీలులేదని, కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని, జన్మభూమి కమిటీ సభ్యుల పేరుతో దోచుకుతింటున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామకమిటీతో పాటు జన్మభూమి కమిటీ సభ్యులను కూడా మార్చాలన్నారు. దండమూడి ప్రసాద్ వర్గీయులకు మాత్రమే సభ్యత్వాలు ఇచ్చారని, మిగిలినవారికి లేకుండా చేశారని ఆరోపించారు. 20 ఏళ్లపాటు గ్రామ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన తనకు సభ్యత్వం లేకుండా చేశారని బలరామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో బలరామకృష్ణ వర్గీయులు, ప్రసాద్ వర్గీయులు బాహాబాహీకి దిగి తోసుకుని కుర్చీలు విసురుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చివరకు పరిశీలకులు ఇరువర్గాలు ప్రతిపాదనలు ఇవ్వాలని వాటిని రూరల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన తరువాత కమిటీని నియమిస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
Advertisement