వెంకటగిరిలో దాదాగిరి | tdp leaders warned telgu ganga contracters | Sakshi
Sakshi News home page

వెంకటగిరిలో దాదాగిరి

Published Mon, Jul 25 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

tdp leaders warned telgu ganga contracters

 
  •  తెలుగుగంగ పనుల కోసం తెగబడ్డ రాజకీయం
  •  కాంట్రాక్టర్లకు టీడీపీ ముఖ్య నాయకుడి బెదిరింపులు
  •  రూ.2.6 కోట్ల టెండరు నోటిఫికేషన్‌ రద్దు చేసిన అధికారులు 
  •  మరో రూ.1.30 కోట్ల కల్వర్టు, రోడ్డు పనుల టెండరు రద్దుకూ ఒత్తిడి
  •  వెంకటగిరి నియోజకవర్గంలో టెండర్లు వేయాలంటే హడలిపోతున్న కాంట్రాక్టర్లు  
 
సాక్షి ప్రతినిధి, నెల్లూరు:
 ‘‘నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా టెండర్లు ఎలా వేస్తావు. మీకు ప్రతిసారి నేను చెప్పను. పనులన్నీ నేనే చేసుకోవాలి. మర్యాదగా టెండర్లు వెనక్కు తీసుకుంటే సరి. లేదంటే ఇక్కడకొచ్చి పనిచేయలేరు’’ అంటూ వెంకటగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ ముఖ్య నాయకుడు కాంట్రాక్టర్లను నేరుగా బెదిరిస్తున్నారు. కాంట్రాక్టర్లు మాట వినకపోతే అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఏ కారణం లేకుండానే టెండర్‌ నోటిఫికేషన్లను రద్దు చేయిస్తున్నారు. ఆయన దాదాగిరికి హడలెత్తుతున్న కాంట్రాక్టర్లు వెంకటగిరి నియోజకవర్గంలో పనులవైపు చూసే సాహసం చేయడం లేదు.
వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుగంగ ప్రాజెక్టు ఎడవ కాలువ వైపు 3.950 కిలోమీటర్ల నుంచి 5.600 కిలోమీటర్ల వరకు ఇన్‌స్పెక్షన్‌ రోడ్డు నిర్మాణానికి రూ.1,44,56,750 అంచనాతో జూన్‌ 22వ తేదీ టెండరు పిలిచారు. ఇదే కాలువ మీద 2.600 కిలోమీటర్ల నుంచి 3.900 కిలోమీటర్ల వరకు రూ.1,13,93,552 అంచనా వ్యయంతో మరో రోడ్డు నిర్మాణానికి కూడా జూన్‌ 22వ తేదీ ఆన్‌లైన్‌లో టెండర్లు ఆహ్వానించారు. అనేక మంది పోటీపడిన  రూ.2.60 కోట్ల విలువైన ఈ రెండు పనులకు రూ.50 లక్షల మేర తక్కువకు టెండర్లు దాఖలయ్యాయి. ఈ నెల 6వ తేదీతో టెండర్ల గడువు ముగిసింది. అధికారులు టెండర్లు ఖరారు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ పనులను ఎలాగైనా తానే దక్కించుకోవాలనుకున్న అధికార పార్టీ ముఖ్య నాయకుడు తెలుగుగంగ అధికారులను తన ఇంటì కి పిలిపించుకున్నారు. ఆన్‌లైన్‌లో ఎవరెవరు ఎంత తక్కువకు టెండర్లు దాఖలు చేశారో కనుక్కుని వారి పేర్లు, మొబైల్‌ నంబర్లు తీసుకున్నారు. తాను చెప్పేంత వరకు ఈ పనులు ఖరారు చేయొద్దని అధికారులకు హుకుం జారీ చేశారు. దీంతో అధికారులు వణికిపోయారు.
కాంట్రాక్టర్లకు బెదిరింపులు∙
 అధికారులను లైన్‌లోకి తెచ్చుకున్న సదరు నాయకుడు నేరుగా కాంట్రాక్టర్లకు ఫోన్‌ చేసి ఈ పనులు వదులుకోకపోతే ఇబ్బంది పడతారని హెచ్చరించినట్లు తెలిసింది. ఆయన బెదిరింపులకు భయపడిన కొందరు ఈ పనుల నుంచి వెనక్కు పోవడానికి సిద్ధమయ్యారు. ఒకరిద్దరు కాంట్ట్రాక్లరు మాత్రం తాము ఎందుకు పనులు చేయకూడదని ఎదురు ప్రశ్నించి వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణానికి అవసరమయ్యే యంత్రాలన్నీ తానే కొనుక్కున్నానని, మీరు ఎలా పనిచేస్తారో చూస్తానని ఆ నాయకుడు బెదిరించారు. అయినా కొందరు కాంట్రాక్టర్లు తగ్గకపోవడంతో, ఇక లా¿¶ ం లేదనుకుని టెండర్‌ నోటిఫికేషన్‌ రద్దు చేయాలని అధికారుల మీద ఒత్తిడి చేశారు. ఏ కారణం లేకుండా టెండరు నోటిఫికేషన్‌ను ఎలా రద్దు చేయాలని అధికారులు బేల ముఖం వేస్తే ‘అవన్నీ నాకు తెలియదు. మీరు రద్దు చేయక పోతే ఇబ్బంది పడతారు, ఇక మీదట ఏ పనులకు టెండర్లు పిలిచినా ఇతర కాంట్రాక్టర్లు ఎవరూ టెండర్లు వేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీదే’ అని విరుచుకుపడ్డట్టు సమాచారం. దీంతో ఏం చేయాలో పాలుపోని తెలుగుగంగ ప్రాజెక్టు అధికారులు ఈ నెల 22వ తేదీ టెండర్‌ నోటిఫికేషన్‌ రద్దు చేశారు. ఈ పనులకు పోటీ పడిన కాంట్రాక్టర్లు చెల్లించిన ఈఎండీని అదే రోజు వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. టెండరు ఎందుకు రద్దు చేశారని కాంట్రాక్టర్లు అడిగితే కారణాలు అడిగి తమను ఇబ్బంది పెట్టొద్దని, ఈ విషయంలో గొడవ చేయొద్దని అధికారులు వారి కాళ్లా వేళ్లా పడుతున్నారు. రూ.50 లక్షల తక్కువతో పనులు చేయడానికి దాఖలైన ఈ టెండర్లు రద్దు చేయించడంలో సఫలీకృతుడైన ఆ నాయకుడు ఈసారి తన మనుషులతో 5 శాతం ఎక్కువతో టెండర్లు దాఖలు చేయించి ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.60 లక్షలు గండికొట్టేందుకు తెగబడ్డారని కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. ఈ అన్యాయం చూస్తూ మౌన ంగా ఉండటం తప్ప తామేమీ చేయలేమని అధికారులు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు.
కల్వర్టు పనుల రద్దుకూ ఒత్తిడి
  తెలుగుగంగ ప్రాజెక్టు పరి«ధిలోని అంతర్గత రోడ్లు, పైప్‌లైన్ల పై కల్వర్టు, గుండవోలు వద్ద రోడ్డు  నిర్మాణం కోసం  రూ.1,38,75,748తో ఈ నెల 11వ తేదీ తెలుగుగంగ ఎస్‌ఈ  ఆన్‌లైన్‌లో టెండరు పిలిచారు. ఈ నెల 25వ తేదీతో టెండర్ల దాఖలుకు గడువు ముగిసింది. వెంకటగిరి నియోజకవర్గంలోని ఈ పనులకు కూడా పలువురు కాంట్రాక్టర్లు పోటీ పడ్డారు. విషయం తెలుసుకున్న టీడీపీ ముఖ్య నేత కాంట్రాక్టర్లకు ఫోన్లు చేసి ‘నా నియోజకవర్గంలో మీరెలా పనులు చేయాలనుకుంటున్నారు? మీ కథలన్నీ నాకు చెప్పొద్దు’ అని బెదిరించారు. ఒకరిద్దరి నుంచి ఈ పనులకు కూడా పోటీ తప్పేట్లు లేకపోవడంతో ఈ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేయాలని అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. చిన్న పనులకు కూడా అధికార పార్టీ ముఖ్య నేత రంగంలోకి దిగి బెదిరించడం, అన్నీ తానే చేసుకోవాలనడం ఏ మాత్రం బాగా లేదని కాంట్రాక్టర్లు అ«ధికారుల వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజును కలిసి తమ బాధలు వివరించాలని జిల్లాలోని కాంట్రాక్టర్లు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement