- భూకబ్జాలు, కేసుల నేపథ్యంలో సస్పెన్షన్‌కు ప్రతిపక్షాల ఒత్తిడి
- తలొగ్గిన టీడీపీ అధిష్టానం
- సస్పెండ్ చేస్తూ ‘సమన్వయ కమిటీ’ నిర్ణయం
(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడు, టీడీపీ ఎమ్మెల్సీ గుణపాటి దీపక్‌రెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ సమన్వయ కమిటీ గురువారం నిర్ణయం తీసుకుంది. దీపక్‌రెడ్డి హైదరాబాద్‌లో భూకబ్జాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించిన సీసీఎస్ పోలీసులు.. ఈ నెల ఆరున ఆయన్ను అరెస్టు చేశారు. 2004లో గుడిమల్కాపూర్‌లోని భోజగుట్టలో ఉన్న రూ.300 కోట్లకుపైగా విలువైన 78.02 ఎకరాల స్థలాన్ని స్థల యజమాని ఇస్లాంఖాన్ నుంచి కొట్టేయాలని దీపక్‌రెడ్డి స్నేహితుడు శైలేష్ కన్నేశాడు. ఇందుకోసం శైలేశ్, దీపక్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహారం నడిపించారు. దీనిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
దీపక్ చరిత్ర నేరపూరితం
దీపక్‌రెడ్డి చరిత్ర ఆది నుంచీ నేరపూరితమే! ఈయన ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయాన అల్లుడు. 2012 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రాయదుర్గం నుంచి పోటీ చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో రూ.6,781 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొని ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. దీపక్‌రెడ్డి ఇంత భారీగా ఆస్తులు ఎలా సంపాదించగలిగారని విపక్షాలతో పాటు స్వపక్ష సభ్యులు కూడా పలువురు ఆరా తీశారు. ఎన్నికల అఫిడవిట్‌లో తన వార్షిక ఆదాయం రూ.3.27 లక్షలుగా, తన భార్య వార్షిక ఆదాయం రూ.1.98 లక్షలుగా చూపారు. ఆదాయపన్ను శాఖకు కూడా రూ.5 లక్షలు మాత్రమే రిటర్న్స్ చూపించారు. ఈ క్రమంలో ఈయన ఆస్తుల వివరాలు, గత చరిత్రపై ఆరా తీయగా అసలు విషయం బట్టబయలైంది. గత చరిత్ర పూర్తి నేరపూరితమని తేలింది. భూకబ్జాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడుతూ భారీగా ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే దాదాపు రూ.15 వేల కోట్ల మేర విలువైన ఆస్తులు ఉన్నట్లు వినికిడి. దందాలు, సెటిల్‌మెంట్ల వ్యవహారాల్లో జేసీ బ్రదర్స్‌తో పాటు జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి కూడా సహకరించినట్లు ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌లో తనకున్న పరిచయాలతో పవన్ కుమార్‌రెడ్డి కూడా కబ్జాలు, సెటిల్‌మెంట్లకు సహకరించారని తెలుస్తోంది.
దీపక్‌రెడ్డిపై పలు కేసులు
దీపక్‌రెడ్డిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారంటూ సెక‌్షన్ 506 కింద రెండు కేసులు, ఆక్రమణలకు పాల్పడ్డారంటూ సెక‌్షన్ 447 కింద కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కొందరిపై దాడి చేశారని సెక‌్షన్ 341 కింద ఓ కేసు, మారణాయుధాలు కలిగి ఉన్నాడని సెక‌్షన్ 148 కింద మరో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా భూకబ్జాలకు సంబంధించి హైదరాబాద్‌లో 6 కేసులు నమోదయ్యాయి.
ఫలించిన ప్రతిపక్షాల ఒత్తిడి
దీపక్‌రెడ్డిపై కేసు నమోదైన తర్వాత ఇంత నేరచరిత్ర ఉన్న వ్యక్తిని పెద్దల సభకు పంపి చంద్రబాబు ఏ సందేశం ఇస్తున్నారంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశాయి. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక చేయడం చూస్తే అవినీతిపరులు, భూకబ్జా దారులను చంద్రబాబు ప్రోత్సహించినట్లు అవుతోందని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో దిగొచ్చిన టీడీపీ అధిష్టానం దీపక్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కాగా.. పార్టీ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన ఎమ్మెల్సీ పదవికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, ఎమ్మెల్సీగా కూడా బర్తరçఫ్ చేసేలా సీఎం నిర్ణయం తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.