- స్పీకర్‌ను కోరిన విపక్షాలు
- పరిశీలిస్తామన్న స్పీకర్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో పూర్తికాలానికి సస్పెన్షన్‌కు గురైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల విషయంలో పునరాలోచన చేయాలని శాసనసభలో అన్ని పక్షాల నేతలు శుక్రవారం స్పీకర్‌ను కోరారు. వెంటనే వారి సస్పెన్షన్‌ను ఎత్తివేసి, వారిని సభకు పలిపించాలన్న విపక్ష నేతల అభ్యర్థునను పరిశీలిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు.
బడ్జెట్ పద్దులపై కీలక చర్చలు జరుగుతున్న దృష్ట్యా వారికి అవకాశం కల్పించాలని బీజేపీ నేత లక్ష్మణ్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసిన అనంతరం స్పీకర్‌ను కోరారు. సమావేశాల ఆరంభంలో చోటు చేసుకున్న ఘటనలపై విచారం వ్యక్తం చేయడానికి టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, వారికి వెంటనే సభకు వచ్చే అవకాశం కల్పించాలని లక్ష్మణ్ కోరారు.
మొత్తంగా సమావేశాలకు వారిని సస్పెండ్ చేయడం భావ్యం కాదని తాము అన్నప్పుడు 2 లేదా మూడు రోజుల్లో పునరాలోచన చేద్దామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. టీడీపీ శాసనసభ్యులను సభకు అనుమతించాలని ఆయన కోరారు. రవీంద్ర నాయక్ (సీపీఐ), సున్నం రాజయ్య (సీపీఎం) కూడా టీడీపీ సభ్యుల సస్పెన్షన్లను ఎత్తివేయాలని స్పీకర్‌ను కోరారు.
వారి వైఖరిలో మార్పు లేదు
హోం మంత్రి నాయని నరసింహారెడ్డి విపక్షాల వాదనకు అభ్యంతరం చెప్పారు. సభలో జాతీయగీతాన్ని అవమానించిన టీడీపీ సభ్యు లు.. బయటకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, చేసిన తప్పును పక్కనబెట్టి ప్రభుత్వంపై నెపం మోపుతున్నారని దుయ్యబట్టారు. తాము సభను పవిత్ర స్థలం గా, ప్రజల ఆకాంక్షలు నెరవేరే ఆలయంగా భావిస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపా రు. సభ ఆరంభం రోజు జాతీయగీతానికి అవమానం జరిగిందని, రెండోరోజూ సైతం సభ్యులు అదే రీతిన వ్యవహరించడంతో సస్పెన్షన్ నిర్ణయం చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే దీనిపై స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.