టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌పై వాగ్వాదం | TDP of the altercation on the suspension | Sakshi
Sakshi News home page

టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌పై వాగ్వాదం

Published Sun, Nov 16 2014 12:13 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌పై వాగ్వాదం - Sakshi

టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌పై వాగ్వాదం

సస్పెన్షన్ ఎత్తేయాలని స్పీకర్‌ను కోరిన బీజేపీ, కాంగ్రెస్  సభను అడ్డుకున్నందుకే సస్పెండ్ చేశాం: మంత్రి హరీశ్
 
హైదరాబాద్: టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌పై అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది. ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. శనివారం సభ సమావేశమయ్యాక జీరో అవర్‌లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని సభాపతికి బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. ‘ఒక పార్టీకి చెందిన సభ్యులు లేకుండా సభను కొనసాగిస్తే తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుంది. తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ సభ్యుడి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఎంపీ కవిత అన్నట్లు తెలిసింది. ఇప్పటికే మూడు రోజులైంది. ప్రభుత్వం పెద్ద మనసుతో వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి. సభలోకి అనుమతించాలి’ అని కోరారు. అయితే టీఆర్‌ఎస్ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సస్పెండ్ అయిన సభ్యుడికి పశ్చాత్తాపం లేదని, ఈ అంశంపై బయట ఇప్పటికీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. ఇటీవలే మహారాష్ట్రలో గవర్నర్‌పై దాడి చేసిన సభ్యులను బీజేపీ ప్రభుత్వం రెండేళ్లపాటు సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. ‘మీ ప్రభుత్వం అలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చుగానీ.. మేం మాత్రం వారం పాటు సస్పెండ్ చేస్తే తప్పుబడతారా?’ అని మండిపడ్డారు. శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. పార్లమెంట్ సభ్యురాలిపై చేసిన వ్యాఖ్యకు క్షమాపణ చెబితే సస్పెన్షన్ ఎత్తివేయడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని బదులిచ్చారు. ‘టీడీపీ సభ్యులు సభను తప్పుదోవ పట్టించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంది.

రైతులు అన్యాయమైపోతున్నారు. కానీ ఆ సభ్యులు మాత్రం తెలంగాణనే ఎక్కువ విద్యుత్ వాటా వాడుకుందన్నారు. లేని పత్రాలను చూపి రాష్ట్ర ద్రోహానికి పాల్పడ్డారు. ఆ పత్రాలు సభకు సమర్పించాలని ముఖ్యమంత్రి కోరితే ఇప్పటికీ ఇవ్వలేదు. ఇదే సభలో ఒక శాసనసభ్యుడిపై అమర్యాదగా మాట్లాడారు. కుటుంబ సర్వేలో ఒక ఎంపీ రెండు చోట్ల కుటుంబ వివరాలు నమోదు చేసుకున్నారని తప్పుడు సమాచారం ఇచ్చారు. అలాంటి వారిని సమర్ధిస్తారా?’ అని హరీశ్ ప్రశ్నించారు. ‘అర్థవంతమైన చర్చకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. బడ్జెట్‌పై 17 గంటల 17 నిమిషాలపాటు చర్చ జరిగింది. గతంలో ఎన్నడూ ఇంత సుదీర్ఘ చర్చ జరగలేదు’  అంటూ ఈ సమావేశాల్లో ఏ పార్టీ ఎంతసేపు మాట్లాడిందో మంత్రి వివరించారు. ‘తెలంగాణ కోసం పోరాడితే ఇదే సభలో మమ్మల్ని 14 ఏళ్ల పాటు సస్పెండ్ చేశారు. ప్రతిరోజూ సస్పెన్షన్లు, బైండోవర్లు, అరెస్టులతో నిర్బంధించారు. మేం అలా వ్యవహరించడం లేదు. సభ సజావుగా జరగాలని కోరుకుంటున్నాం. ప్రతి రోజు దుమారం చెలరేగగానే సభను రేపటికి వాయిదా వేసుకుంటూ పోయారు. ఇన్ని గంటల పాటు బడ్జెట్‌పై చర్చ జరిగిన సందర్భాలు గత ఎనిమిదేళ్లలో ఉన్నాయా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. అయితే మంత్రి వివరణకు బీజేపీ సభ్యులు అడ్డుపడ్డారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. విపక్ష సభ్యుల హక్కులను కాపాడాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ‘టీడీపీ సభ్యుడు మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా ఎంపీని కించపరచలేదు. పత్రికల్లో వచ్చిన విషయం మాట్లాడారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని విజ్ఞప్తి చేయడం తప్పా? మంత్రులు ప్రతి అంశంపై ఎదురుదాడికి దిగుతున్నారు’ అని అన్నారు. టీడీపీ సభ్యులను ఏ అంశంపై సస్పెండ్ చేశారో స్పష్టం చేయాలని కాంగ్రెస్ సభ్యులు కూడా పట్టుబట్టారు. ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు.

బడ్జెట్‌పై ఎక్కువ సమయం చర్చ జరిపినందుకు అభినందిస్తున్నామని, అది తమ సహకారంతోనే సాధ్యమైందని గుర్తించాలన్నారు. గతంలో చర్చ జరగకుండా అడ్డుకున్నది టీఆర్‌ఎస్ సభ్యులేనని ఆరోపించారు. ఇప్పటివరకు నిజామాబాద్ ఎంపీ కవిత విషయంలోనే టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసినట్లు భావిస్తున్నామని, అయితే రాష్ట్ర ద్రోహం తలపెట్టారని.. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీశారని సస్పెండ్ చేసినట్టు ఈ రోజు మంత్రి కొత్త విషయం చెబుతున్నారని ధ్వజమెత్తారు. దీనికి హరీశ్‌రావు స్పం దిస్తూ... ‘మన రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు మనకు ముఖ్యమని.. రైతులకు రావాల్సిన వాటా అడగాల్సింది పోయి.. టీడీపీ సభ్యులు ఆ విధంగా వ్యవహరించడం సరి కాదు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధానాన్ని సమర్థిద్దామా?.. సస్పెన్షన్‌కు గురి కాని ఇద్దరు టీడీపీ సభ్యులు నిన్న సభకు వచ్చారు. వారికి మాట్లాడే అవకాశమిచ్చాం. వారు మాట్లాడుతుంటే మేమేం అడ్డుకోలేదు. పోడియం వద్దకు వచ్చి సభను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారినే సస్పెండ్ చేశాం. అందుకే తీర్మానం ప్రవేశపెట్టేటప్పుడు టీడీపీ సభ్యులు రేవంత్‌రెడ్డి, దయాకర్‌రావు పేర్లు లేవు. తర్వాత వాళ్లిద్దరూ పోడియం దగ్గరికి వెళ్లి ఆందోళన చేసినందుకు వాళ్ల పేర్లు కూడా చేర్చాల్సి వచ్చింది. సభా సంప్రదాయాలను పాటిస్తూ సభా గౌరవాన్ని కాపాడుదాం’ అని మంత్రి వివరణ ఇచ్చారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement