టీడీపీ సర్పంచ్ అరెస్టు
పాత శ్రీకాకుళం : శిలగాం సింగువలసకు చెందిన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ కంచు దశరధుడును పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులపై దాడి చేసిన సంఘటనకు సంబంధించి దశరధుడును అరెస్టు చేశారు. అయితే ఈయన అరెస్టును అడ్డుకునేందుకు తెరవెనుక పచ్చచొక్కాల నేతల విఫలయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. బుధవారం ఉదయం నుంచే సర్పంచ్ అరెస్టును ఆపేందుకు స్టేషన్‌లోనే విశ్వ ప్రయత్నాలు తెరవెనుక జరిగినట్టు సమాచారం.
పార్టీకి చెందిన సర్పంచ్ అధికారులపై దాడి చేసిన కేసులో అరెస్టు అయితే పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న క్రమంలో ఒక దశలో ఎమ్మెల్యే, ఎంపీ కూడా రాజీ చేసేందుకు యత్నించినట్టు సమాచారం. చిన్న తగాదానే కాబట్టి వీఆర్‌వో శ్రీనివాసరావు, వీఆర్‌ఏ చిన్నరాజారావును పిలిపించి రాజీ చేయాలని స్థానిక ఎంపీపీకి ఎమ్మెల్యే, ఎంపీ సూచించినట్టు భోగట్టా. అయితే రాజీకి అధికారులు ససేమిరా అనడంతో చేసేది లేక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో టౌన్ సీఐ అప్పలనాయుడు సమక్షంలో సర్పంచ్ దశరధుడును అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా ఎస్సీ, ఎస్టీకు చెందిన నేతలతో పాటు కొందరు రెవెన్యూ ఉద్యోగులు తహసీల్దార్, ఆర్‌డీవో, ఎస్పీకి రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కావాలంటూ వినతిపత్రం అందజేశారు.