పోలీస్టేషన్‌లో ఏఎస్‌ఐకు ఫిర్యాదు చేస్తున్న వీఆర్‌ఓ, వీఆర్‌ఏ
రెవెన్యూ సిబ్బందిపై టీడీపీ సర్పంచ్ దాడి
Published Tue, Sep 13 2016 11:30 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
పాత శ్రీకాకుళం : ‘ఏరా.. ఒళ్లు ఎలా ఉంది.. నువ్వు ఫోన్ చేయడమేట్రా? వీఆర్‌ఓ చేయలేడా.. వాడు ఏం చేస్తున్నాడు.. మేం వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే.. మాకు ఫోన్ చేసే అర్హత నీకు లేదు.. ప్రభుత్వం మాదీ, మాతో జాగ్రత్తగా ఉండండి.. లేదంటే మీ జాతకాలు మార్చేస్తాం..’ అంటూ శ్రీకాకుళం రూరల్ మండలం శిలగాం సింగువలస టీడీపీ సర్పంచ్ వీఆర్‌ఏ, వీఆర్‌ఓలను అసభ్యకర పదజాలంతో దూషించాడు. అక్కడితో ఆగకుండా ఒక్కొక్కరినీ చెంపదెబ్బకొట్టాడు. దీంతో ఉద్యోగులిద్దరూ మంగళవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... శిలగాం సింగువలస లో రేషన్ డిపోకు సంబంధించి డీలర్ నియామకానికి సర్పంచ్ సంతకం అవసరం ఏర్పడింది. దీనికోసం వీఆర్‌ఏ కొర్రాగి చిన్న రాజారావు మంగళవారం ఉదయం టీడీపీ సర్పంచ్ ఇంటికి వెళ్లారు. సర్పంచ్ లేకపోవడంతో ఆయన ఇంటి వద్ద నుంచే ఫోన్ చేశాడు.
ఈ సమయంలో వీఆర్‌ఏపై సర్పంచ్ తీవ్రంగా మండిపడ్డాడు. మధ్యాహ్నం పూట ప్రజా సాధికార సర్వేలో ఉన్న వీఆర్‌ఓ, వీఆర్‌ఏను చూసి అటుగా వెళ్లిన సర్పంచ్ ఆగాడు. ఇంతలో వీఆర్‌ఏ సర్పంచ్ వద్దకు వెళ్లి రేషన్ డిపోకు సంబంధించి సంతకం కావాలని అడిగారు. దీంతో సర్పంచ్ ఒక్కసారిగా ఆగ్రహంతో రెచ్చిపోయి వీఆర్‌ఏపై చేయి చేసుకున్నాడు. ఇంతలో వీఆర్‌ఓ వైద శ్రీనివాసరావు విషయం తెల్సుకుందామని సర్పంచ్ వద్దకు వెళ్లగా ఆయనకు కూడా చెంపదెబ్బలు తగిలించాడు. దీంతో వీఆర్‌ఓ, వీఆర్‌ఏలు జరిగిన విషయాన్ని రెవెన్యూ సంఘం అసోషియేషన్‌కు తెలియజేయగా నేతలు కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం రాత్రి వీఆర్‌ఓ, వీఆర్‌ఏ సంఘ ఉద్యోగులంతా కలిసి రూరల్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని శ్రీకాకుళం డీఎస్పీ భార్గవనాయుడు, టౌన్ సీఐ అప్పలనాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్లారు. రూరల్ ఏఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement