అగ్గి రగిలింది | gandepalli mandal tdp president resign | Sakshi
Sakshi News home page

అగ్గి రగిలింది

Published Tue, Feb 7 2017 2:36 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

అగ్గి రగిలింది - Sakshi

అగ్గి రగిలింది

జ్యోతుల వర్గంపై జగ్గంపేట నియోజకవర్గంలో తిరుగుబాటు
టీడీపీ పదవులకు గండేపల్లి మండలాధ్యక్షుడి రాజీనామా
ఫలించని నెహ్రూ వర్గీయుల దౌత్యం
ఇప్పటికే దూరమైన పలువురు నేతలు
రాజీనామాల పరంపరతో ‘దేశం’లో అలజడి


రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి. ఈ సామెత మెట్ట ప్రాంతంలో సీనియర్‌ నాయకుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విషయంలో ఇప్పుడు నిజమవుతోంది. మొదట్లో టీడీపీలో ఉన్న ఆయన.. ఆ తరువాత మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై.. ఆ పార్టీని వంచించి.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏ పార్టీలో ఉన్నా జిల్లా రాజకీయాలను శాసించేవారు. అటువంటి నాయకుడికి వ్యతిరేకంగా ఇప్పుడు సొంత పార్టీలో.. సొంత నియోజకవర్గంలోనే అసమ్మతి అగ్గి రగిలింది. ఈ పరిణామాలు ఆయన వర్గాన్ని చివరకు ఏ తీరానికి చేరుస్తుందా అనే చర్చ మెట్ట రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.
 
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఆదినుంచీ తెలుగుదేశం పార్టీ విధేయుడిగా ఉన్న గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు పోతుల మోహనరావు పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. ఆవిర్భావం నుంచీ ఆయన పార్టీలో క్రియాశీలక నేతగా ఉన్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన జ్యోతుల నెహ్రూ వర్గం.. తమకు కనీస మర్యాద, ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్వగ్రామం సింగరంపాలెంలో రాజీనామా విషయాన్ని మోహనరావు ప్రకటించారు. పార్టీ మండల అధ్యక్ష పదవితోపాటు, వైఎస్‌ ఎంపీపీ, మండల స్థాయి జన్మభూమి కమిటీ పదవులకు ఆయన రాజీనామా చేశారు. తద్వారా పార్టీ అధిష్టానానికి తన అసంతృప్తిని తెలియజేశారు. ఆయనకు సంఘీభావంగా సూరంపాలెం గ్రామానికి చెందిన కుంచే వెంకటస్వామి, ఎన్‌టీ రాజాపురానికి చెందిన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ కంటిపూడి సత్యనారాయణ కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వీరిద్దరూ కూడా నెహ్రూతో రాజకీయంగా పొసగని ఒకప్పటి జగ్గంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జ్యోతుల చంటిబాబు వర్గీయులే కావడం గమనార్హం. దీనినిబట్టి నెహ్రూ ‘సైకిల్‌’ ఎక్కాక.. చంటిబాబు వర్గంగా ముద్రపడ్డ నేతలను ఒక పథకం ప్రకారమే పార్టీకి దూరం చేస్తున్నట్టు కనిపిస్తోందని టీడీపీ సీనియర్‌ నేతలు విశ్లేషిస్తున్నారు.

ఒక్కపనీ చేయించుకోలేకపోతే ఇంకెందుకు?
కార్యకర్తగా ఉన్నప్పుడే తన గ్రామానికి రెండు మూడు రోడ్లు వేయించుకున్న తాను మండల స్థాయిలో క్రియాశీలక పదవిలో ఉన్నా ఒక్క పని కూడా చేయించుకోలేకపోతున్నానని మోహనరావు ఆవేదన చెందుతున్నారు. కనీసం ఒకరిద్దరికి కూడా గృహ నిర్మాణ రుణాలు, పింఛన్లు మంజూరు కాకుండా ప్రత్యర్థులు మోకాలడ్డుతున్నారని ఆయన వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇది పొమ్మనకుండానే పొగబెట్టడం కాక మరేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తమను కేవలం కూరలో కరివేపాకులుగా వినియోగించుకుని విసిరికొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గండేపల్లి మండలంలో కోర్పు లచ్చయ్యదొర ఏం చెబితే అది చేసుకుంటూపోతే ఇక పార్టీ మండల అధ్యక్ష పదవిలో ఉండి ఉపయోగమేమిటని పోతుల వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఉత్సవ విగ్రహంలా ఉండేæ ఈ పదవులు ఎందుకనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చామని చెబుతున్నారు.

ఫలించని నెహ్రూ యత్నాలు
మోహనరావు సహా ఇతర నేతలు రాజీనామాకు సిద్ధపడుతున్నారనే విషయం తెలియడంతో వారిని బుజ్జగించేందుకు రెండు రోజులుగా నెహ్రూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నెహ్రూ ముఖ్య అనుచరులు అత్తులూరి సాయిబాబా, మంతెన నీలాద్రిరాజులు జరిపిన దౌత్యం కూడా బెడిసికొట్టిందనే చెబుతున్నారు. 48 గంటల్లో సర్దుబాటు చేస్తామని పలువురు నేతలు రాజీ‘డ్రామా’ నిర్వహించినా వెనక్కు తగ్గేది లేదని మోహనరావు తదితరులు తెగేసి చెప్పారు. ఒకవేళ రాజీనామాలపైæ ఇప్పుడు వెనక్కు తగ్గినా.. ఎనిమిది నెలలుగా ఎదురవుతున్న అవమానాలు భవిష్యత్తులో రెట్టింపు అవుతాయని ఆ వర్గం ఆందోళన చెందుతోంది. మంగళ, బుధవారాల్లో వైస్‌ ఎంపీపీ పదవికి రాజీనామా లేఖను జిల్లా పరిషత్‌ సీఈవోకు అందజేసేందుకు మోహనరావు సిద్ధపడుతున్నారు. ఒకప్పుడు ఏ పార్టీలో ఉన్నా కంటిసైగతో రాజకీయాన్ని నడిపించిన నెహ్రూ.. సొంత నియోజకవర్గంలో రాజుకున్న అసంతృప్తి కుంపటిని ఆర్పలేకపోవడం చూస్తే.. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది.

దూరదూరంగా చంటిబాబు
మరోపక్క నెహ్రూ వర్గీయుల ఆధిపత్య రాజకీయాలతో ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి జ్యోతుల చంటిబాబు టీడీపీ కార్యకలాపాలకు దాదాపు దూరమయ్యారు. జగ్గంపేటలో సీనియర్‌ నాయకుడు కర్రి శ్రీను అసంతృప్తితో ఆదివారమే రాజీనామా చేశారు. గోకవరం మండలం తంటికొండ ఎంపీటీసీ సభ్యురాలు ముర్ల నాగలక్ష్మి.. పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని పేర్కొంటూ ఇటీవల రాజీనామాకు సిద్ధపడగా.. ఆమెను మాత్రం ఎలాగోలా బుజ్జగించి ఆపగలిగారు.

నెహ్రూ చేరికతో రాజుకున్న మూడో కుంపటి
నెహ్రూ టీడీపీలోకి రాక పూర్వం జగ్గంపేట నియోజకవర్గంలోని ఆ పార్టీలో కాకినాడ ఎంపీ తోట నరసింహం, జ్యోతుల చంటిబాబు వర్గాలుండేవి. నెహ్రూ టీడీపీలోకి వచ్చాక మూడో కుంపటి రాజుకుంది. ఈ మూడు కుంపట్ల మ«ధ్య మండలస్థాయి, ద్వితీయ శ్రేణి నాయకులు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగలించుకుంటున్నారు. ప్రత్యర్థి వర్గాన్ని ఎలాగోలా సాగనంపేందుకు పొమ్మనకుండానే పొగ పెడుతున్నారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో వేచి చూడాల్సిందే.

నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నా..
గండేపల్లి : ‘‘టీడీపీ ఆవిర్భావం నుంచీ కార్యకర్తగా ఎన్నో పనులు చేయించుకోగలిగాను. నా గ్రామంలో ఎన్నో పనులు చేయించాను. అధికార పార్టీకి మండల అధ్యక్షుడిని. మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడిని. ఇలా రెండు కీలకమైన పదవులున్నా.. సొంత ఊళ్లో పనులు చేసుకోలేని దుస్థితిలో ఉన్నాను. నా వీధిలో కూడా వేరేవారు పనులు చేపడుతున్నారు. దీనిపై పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లాను. అయినా ప్రయోజనం లేదు. కొద్ది నెలలుగా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. గతంలో టీడీపీ మండల అధ్యక్షుడు వేరే పార్టీకి పోవడంతో అప్పటినుంచీ ఆ బాధ్యతలను పూర్తిస్థాయిలో నెరవేర్చాను. అప్పగించిన బాధ్యతలను భుజాలపై వేసుకుని నమ్మకంగా పని చేశాను. ఇప్పుడు నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాను. అధికారులు, నాయకులూ నా మాట పట్టించుకోవడం లేదు. అందుకే వైస్‌ ఎంపీపీ, పార్టీ మండల అధ్యక్ష పదవి, జన్మభూమి కమిటీ సభ్యుడి పదవి, ఎంపీటీసీ పదవులకు రాజీనామా చేస్తున్నాను’’ అని మండలంలోని టీడీపీ సీనియర్‌ నాయకుడు పోతుల మోహనరావు ఆవేదనతో చెప్పారు. స్వగ్రామం సింగరంపాలెంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎంపీటీసీ, వైస్‌ ఎంపీపీ పదవుల రాజీనామా విషయాన్ని జెడ్పీ సీఈఓకు తెలియజేస్తానని చెప్పారు. పార్టీలోనే కొనసాగుతానని, పదవులకు మాత్రమే రాజీనామా చేశానని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన కొందరు నాయకులు మాట్లాడుతూ, రాజీనామా విషయంపై పునరాలోచన చేయాలని, కొద్ది సమయం ఇవ్వాలని కోరారు. ఈలోగా నాయకుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామన్నారు. కార్యక్రమంలో జెడ్‌పీటీసీ సభ్యురాలు ఎర్రంశెట్టి వెంకటలక్ష్మి భర్త బాబ్జీ, సొసైటీ అధ్యక్షులు పాలకుర్తి ఆదినారాయణ, బొడ్డు సత్తిరాజు, సర్పంచ్‌లు బొండా శ్రీనుబాబు, పైణ్ని వెంకటేశ్వరరావు, మూలయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement