నాయకుడు లేని ‘దేశం’
2 నెలలుగా భర్తీ కాని జిల్లా అధ్యక్ష పదవిఎవరూ ముందుకు రాకపోవడమే కారణంపార్టీ జిల్లా కమిటీది ఇదే పరిస్థితినాయకుల వలసలతో టీడీపీ బలహీనంఎర్రబెల్లి, గరికపాటి తీరుపై శ్రేణుల్లో అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలుగుదేశం పార్టీ జిల్లాలో పూర్తిగా బలహీనపడిపోతోంది. పార్టీ జిల్లా కమిటీకి కనీసం అధ్యక్షుడు లేని దుస్థితిలో ఉంది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసి రెండు నెలలు గడిచినా... ఇప్పటికీ టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి భర్తీ కావడం లేదు. ఈ పదవిని చేపట్టేందుకు ఎవరూ ముందుకురాకపోవడం వల్లే ఈ పరిస్థితి ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణ ఎన్నికలకు ముందే టీడీపీ ముఖ్య నాయకులు పార్టీని వీడారు. ఎన్నికల తర్వాత ఆ పార్టీ నుంచి వలసలు బాగా పెరిగాయి.
నియోజకవర్గస్థాయి నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. రాష్ట్ర స్థాయి నాయకుల తీరుతో మిగిలిన వారు ఇదే బాటలో ఉన్నారు. టీడీపీలోని ఒకరిద్దరు ముఖ్య నాయకుల తీరుతో జిల్లాలో పార్టీ పరిస్థితి పూర్తిగా దయనీయంగా మారిందని ‘తమ్ముళ్లు’ చర్చించుకుంటున్నారు.గత ఏడాది డిసెంబర్‌లో టీడీపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చేపట్టింది.
ఈ ఏడాది 18న పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎన్నిక కోసం సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఎవరూ ముందుకురాకపోవడంతో అధ్యక్షుడి ఎన్నిక జరగకుండానే ఈ సమావేశం ముగిసింది. ఇలా జిల్లాలో టీడీపీకి నాయకత్వం లేని పరిస్థితి ఉండడంతో ఈ అంశం పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు చేరింది. ఎవరో ఒకరిని అధ్యక్షుడిగా నియమించాలని ఆయనకు పలువురు జిల్లా నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే సీతక్క, సాధారణ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గండ్ర సత్యనారాయణరావు పేర్లను అధిష్టానం పరిశీలించింది. ఈ సమయంలోనే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో జిల్లాకు చెందిన వేం నరేందర్‌రెడ్డి అభ్యర్థిగా పోటీ చేశారు.
ఈ ఎన్నికలో ఓటుకు కోట్ల రూపాయలను ఇచ్చిన విషయంలో టీడీపీలో అయోమయ పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఎవరూ ముందుకురావడం లేదు. దీంతో ఈ పదవి ఖాళీగానే ఉంటోంది. జిల్లా కమిటీ పరిస్థితి ఇలాగే ఉంది. కొత్తగా నియోజకవర్గ బాధ్యతలు చేపట్టేందుకు ఎవరూ ముందుకురావడం లేదు. వర్ధన్నపేట(ఎస్సీ) నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఇప్పటికీ బీసీ వర్గానికి చెందిన ఈగ మల్లేశం వ్యవహరిస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు ఎవరూ ముందుకురావడం లేదు. పరకాల నియోజకవర్గానికి నాయకుడు లేడు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిస్థితి ఇలాగే ఉంది.
అసలే నాయకులు లేని పరిస్థితుల్లో ఉన్న టీడీపీలో ముఖ్య నాయకుల తీరుపై పార్టీ శ్రేణులు, నాయకులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉన్నా జిల్లాలో పార్టీ బలోపేతం విషయాన్ని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పట్టించుకోవడం లేదని ‘దేశం’ శ్రేణులు అంటున్నాయి. రాజ్యసభ సభ్యుడు గరికపాటి, ఎర్రబెల్లి కలిసి జిల్లాలో పార్టీని బాగు చేయడాన్ని పక్కనబెట్టి అధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఈ కారణాలతో మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ద్వితీయ శ్రేణి నేతలు ఏకంగా పార్టీకే దూరమవుతున్నారు. మొత్తంగా సాధారణ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు జిల్లాలో టీడీపీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.