టీచర్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
⇒రంగంలోకి దిగిన మూడు ప్రత్యేక బృందాలు
⇒పోలీసులనే బురిడీ కొట్టించిన నిందితుడు
⇒టీచర్‌కు ముగిసిన అంత్యక్రియలు
పలమనేరు: జిల్లాలో సంచలనం రేకెత్తించిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలి హత్య కేసులో నిందుతున్ని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మూ డు బృందాలు రంగంలోకి దిగాయి. ప్రేమకుమారి మృతదేహానికి శుక్రవారం పలమనేరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె భర్త స్వగ్రామమైన బంగారుపాళ్యం మండలం ముంగరమొడుగులో అంత్యక్రియలు చేశారు.
మూగబోయిన మబ్బువాళ్లపేట
మొన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న మబ్బువాళ్లపేటలో ఒక్కసారిగా నిర్మాణుష్యం అలుముకుంది. పట్టపగలే పసిపిల్లల ముందు టీచర్ హత్యకు గురికావడం, పోలీ సులు విచారణల నేపథ్యంలో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల శుక్రవారం మూతబడింది. హత్యను ప్రత్యక్ష్యంగా చూసిన పిల్లలు భయపడుతున్నారని వారి తల్లిదండ్రులు తెలిపారు. రెండ్రోజుల తర్వాత వేసవు సెలవులు ఉండడంతో అధికారులు పిల్లలకు సెలవు ప్రకటించేశారు.
పోలీసులను బురడీ కొట్టించిన నిందితుడు
హత్య జరిగిన కొద్ది సేపటికే కొందరు పోలీసులకు ఫోన్ చేసి నిందితుడుగా అనుమానిస్తున్న చంద్రమౌళి సైతం ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెప్పారు. పోలీసులు మబ్బువాళ్లపేట పరిసర ప్రాంతాల్లో చంద్రమౌళి కోసం గాలింపు చర్యలు చేపడుతూ సమయాన్ని వృథా చేశారు. పక్కా ప్లాన్‌తో నిందితుడు ఇలా పోలీసులను పక్కదారి పట్టించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానికి తోడు ముందుస్తుగానే చంద్రమౌళి పాఠశాలకు మెడికల్ లీవు పెట్టడం కూడా ఇందులో భాగమేననే అంటున్నారు.
హత్య జరిగాక రక్తం మరకలతో ఉన్న నిందితుడు అక్కడి నుంచి తప్పించుకోవడం, రక్తపు మరకలు ఎవరికీ కనిపించకుండా జాగ్త్రత్త పడడం, ఇదంతా గంటలో జరిగేపనేనా అనే కోణంలో విచారణ సాగుతోంది. ఈ హత్యకు ఎవరైనా సహకరించారా అనే విషయంపై ఆరాతీస్తున్నారు. శుక్రవారం చంద్రమౌళి సెల్‌ఫోన్ సైతం స్విచ్ ఆఫ్‌లోనే ఉందని పోలీసులు తెలిపారు. దీంతో నిందితునికి బైక్ ఇచ్చిన వ్యక్తితో బాటు చంద్రమౌళి స్నేహితులను సైతం వారు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. హత్య కేసులో సెల్‌ఫోన్ టవర్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేసి క్లూకోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.