ప్రేమజంట బలవన్మరణం
అక్కెనపల్లి(నార్కట్‌పల్లి): వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదని ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో మంగళవారం వెలుగుచూసిన విషాదకర ఘటన వివరాలు.. నల్లగొండ మండలం దోమలపల్లి గ్రామానికి చెందిన మేడి రమేష్(21) కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ప్రసన్న(18) నల్లగొండలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుకుంటోంది. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావటంతో ఈ విషయం తెలిసిన కుటుంబ పెద్దలు మందలించారు. రెండు నెలలుగా రమేష్ హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
సంక్రాంతి పర్వదినానికి రమేష్ స్వగ్రామానికి వచ్చాడు. అప్పటికే ప్రసన్నకు వారి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్న విషయం తెలిసింది. దీంతో ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం ఇంటి నుంచి బయలుదేరి నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లి గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి చేరుకున్నారు. కోనేరు సమీపంలో వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆలయ సిబ్బంది మంగళవారం వచ్చి చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మృతుల స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.