narketpalli
-
స్వామీజీతో ప్రచారం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
-
స్వామీజీతో ప్రచారం.. కి.మీ మేర ట్రాఫిక్ జామ్..!
సాక్షి, నల్లగొండ : నార్కెట్ పల్లిలోని వేణుగోపాలస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తడంతో హైదరాబాద్, విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నార్కెట్ పల్లి-చిట్యాల మధ్య కిలోమీటర్ల పొడవున వాహనాలు జామ్ కావడంతో కంట్రోల్ చేయలేక ట్రాఫిక్ సిబ్బంది చేతులెత్తేశారు. బుధవారం రోజున వేణుగోపాలస్వామిని దర్శించుకుంటే సర్వ రోగాలు నయమవుతాయని ఓ స్వామీజీ చెప్పడంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా జనాలు భారీగా తరలి వచ్చారు. హైవేపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో వేణుగోపాలస్వామి దర్శనం కోసం వచ్చిన వేలాదిమంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులను తప్పుదోవ పట్టించేందుకు కావాలనే స్వామీజీ చేత ప్రచారం చేయించినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఈ ఘటనపై నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదు
నార్కట్‌పల్లి : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి ప్రాజెక్టులపై అవగాహన లేకుండా, ప్రజల సమస్యలు పరిష్కరించకుండా అధికార దాహంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై స్థాయికి మించి మాట్లాడడం అధికార దాహమేనన్నారు. అసెంబ్లీలో ప్రాజెక్టు కోసం అప్‌సెండింగ్ సమావేశానికి ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరు కాని ఆయనకు ప్రాజెక్టుల గురించి ఏమి తెలియదన్నారు. ప్రాజెక్టుల గురించి తెలియని ఆయనకు మూసీ ప్రాజెక్టు నిండిన వెంటనే గేట్లు తెరిచి నీటిని వృధా చేశారని అన్నారు. ప్రాజెక్టులపై అవగాహన ఉంటే నీటిని ఎలా వృథా చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ పేరుతో గెలిచిన వేముల వీరేశం కేవలం భూకబ్జాలకే పరిమితమయ్యారు తప్ప ప్రజల సమస్యలు, మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, సర్పంచ్‌లు కొండూరు శంకర్, బొక్క భూపాల్‌రెడ్డి, చెర్వుగట్టు దేవస్థాన మాజీ చైర్మన్ మేకల రాజిరెడ్డి, నాయకులు పాశం శ్రీనివాస్‌రెడ్డి, బొబ్బలి మల్లేషం, వల్లపు మల్లేషం, వెంకటచారి, లింగస్వామి, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
హామీలను అమలు చేయడం లేదు
నార్కట్‌పల్లి : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేయకుండా ప్రజలను, రైతులను మాటల గారడీతోనే పాలన వెల్లబుచ్చుతున్నారని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రైతులు అడగక ముందుకే రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ రుణమాఫీ చేయకుండా విడతలుగా ఏర్పాటు చేసి అదీ కూడా ఇవ్వకుండా రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ నిరుద్యోగుల సమస్య ఈనాటికి పరిష్కారం కాలేదన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, మూడెకరాల భూమి ఎస్సీలకు ఇస్తామని చెప్పి కేవలం తన జిల్లాకే ఇస్తే రాష్ట్రమంతటా ఇచ్చినట్టా అని ప్రశ్నించారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకువచ్చేందుకు రైతులు, ప్రజలే ముందుకు వస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, ఎంపీటీసీలు ఐతరాజు యాదయ్య, కన్నెబోయిన వెంకటాద్రి, దాసరి కృష్ణ, సర్పంచ్ కొండూరు శంకర్, దేవస్థాన మాజీ చైర్మన్ మేకల రాజిరెడ్డి, నాయకులు జహంగీర్, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్, శశిధర్‌రెడ్డి, సైదులు, సత్తిరెడ్డి, సత్తి, మనోహర్, వెంకటచారి, శంకర్, సలీం తదితరులున్నారు. -
ఆభరణాల కోసమే హత్య
వ్యాపారం బాగా సాగేందుకు ఇంట్లో పూజ చేయించాలనుకున్నాడు.. అందుకు చెర్వుగట్టుకు వెళ్లి ఓ శివ భక్తురాలితో మాట్లాడాడు.. ఓ మంచి రోజు చూసి ఇంటికి పిలిచాడు.. ఒంటరిగా వచ్చిన ఆవృద్ధురాలి ఒంటిపై ఉన్న ఆభరణాలను చూసి అతడికి దుర్బుద్ధి పుట్టింది. ఇంకేముంది నిస్సాయురాలైన ఆమెను గొంతునులిమి చంపేసి.. ఆభరణాలను కాజేశాడు. చెర్వుగట్టు సమీపంలో గత నెల వెలుగుచూసిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆభరణాల కోసమే హత్య చేసినట్టు విచారణలో వెల్లడైంది. అరెస్ట్ చేసిన నిందితుడిని సోమవారం సీఐ సుబ్బిరాంరెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టారు. – నార్కట్‌పల్లి నల్లగొండ మండలం దోమలపల్లి గ్రామానికి చెందిన బీమనపల్లి భరత్ కుటుంబం పదేళ్ల క్రితం చిట్యాలకు వలస వచ్చింది. భువనగిరి రోడ్డులో అద్దెకుంటూ చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యాపారం బాగా సాగాలని చెర్వుగుట్ట దేవాలయానికి వెళ్లి పూజ నిర్వహించాడు. అక్కడే కొలుపు చెబుతున్న జిల్లా కేంద్రంలోని ఏఆర్‌నగర్‌కు చెందిన ఉటుకూరి మాణిక్యమ్మ(55)ను సంప్రదించాడు. దీంతో ఇంట్లో పూజ చేయాలని అందుకు రూ. 5వేల వరకు ఖర్చు అవుతుందని చెప్పింది. ఇంటికి పిలిచి.. భరత్ పూజ చేయించేందుకు ఒప్పందం చేసుకుని మాణక్యమ్మను గత నెల 10వ తేదీన ఇంటికి పిలిచాడు. అయితే ఆ సమయంలో భరత్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. మాణిక్యమ్మ ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను చూసి అతడి కన్ను చెదిరింది. దీంతో వాటిని కాజేసేందుకు ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన వద్ద ఉన్న తువాలతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు, సెల్‌ఫోన్, నాలుగు వేల నగదు తీసుకున్నాడు. ఈ క్రమంలో అతడి భార్య, కుమారుడు వచ్చారు. ఇంట్లో మృతదేహం చూసి అవాక్కయ్యారు. వారికి ఏవో మాటలు చెప్పి అదే రోజు రాత్రి కుమారుడి ఆటోలో మాణిక్యమ్మ మృతదేహాన్ని చెర్వుగట్టు గ్రామానికి వెళ్లే దారిలో పడవేసి వచ్చాడు. సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా.. గత నెల 11వ తేదీన వృద్ధురాలి హత్య వెలుగుచూడడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. మాణిక్యమ్మ సెల్‌ఫోన్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. పరోక్షంగా సహకారంం అందించి భరత్ భార్య లక్ష్మి, కుమారుడు మహేష్ పరారీలో ఉన్నారని సీఐ వివరించారు. సమావేశంలో ఎస్ఐ మోతీరామ్, నరేందర్, క్రైనీ ఎస్ఐ గోవర్ధన్ సిబ్బంది ఉన్నారు. -
చెర్వుగట్టు అభివృద్ధికి కృషి
నార్కట్‌పల్లి : చెర్వుగట్టు దేవాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను త్వరలో తీసుకువచ్చి అన్ని వి«ధాలుగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. గురువారం అమావాస్య సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విజయలక్ష్మి దంపతులు చెర్వుగట్టు రామలింగేశ్వరస్వామి దేవాలయంలో నిద్ర చేశారు. శుక్రవారం ఉదయం దేవాలయంలో అభిషేక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ ఆశీర్వచనం చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం గట్టు కింద ఉన్న అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నార్కట్‌పల్లి– అద్దంకి రోడ్డులో ఉన్న యల్లారెడ్డిగూడెం నుంచి చెర్వుగట్టు వరకు డబుల్ రోడ్డు, దేవాలయ గట్టుపైకి డబుల్ ఘాట్ రోడ్డు, గట్టుపైన 10 రేకుల షెడ్లను, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మరుగుదొడ్ల ఏర్పాటులను విడతలుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులను దేవాలయానికి వాస్తు ప్రకారం చేపట్టనున్నట్లు తెలిపారు. దేవాలయంలో భక్తుల సౌకర్యం కోసం చేయాల్సిన అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ఈఓ మనోహర్‌రెడ్డి మంత్రికి వినతి పత్రం సమర్పించారు. ఉదయం మంత్రి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, కట్టంగూరు జెడ్పీటీసీ మాద యాదగిరి, దేవాలయ ఈఓ గుత్తా మనోహర్‌రెడ్డి, సర్పంచ్ మల్గ రమణ బాలకృష్ణ, యల్లారెడ్డిగూడెం ఎంపీటీసీ నల్ల అనిత వెంకన్న, సాగర్ల సైదులు, మేక వెంకట్‌రెడ్డి, ఈర్ల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. -
ఓసీటీఎల్ లాకౌట్ ఎత్తివేయడం కార్మికుల విజయం
నకిరేకల్ : నార్కట్‌పల్లిలోని ఓసీటీఎల్ కంపెనీ 183 రోజుల తర్వాత లాకౌట్ ఎత్తి వేయడం కార్మికుల విజయమని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర నాయకురాలు చెరుకు లక్ష్మీ అన్నారు. నకిరేకల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తమకు తోచిన విధంగా చట్టాలను తుంగలో తొక్కుతుంటే అది ఎవరికైనా తెలంగాణలో సా«ధ్యం కాదని మరోసారి రుజువైందన్నారు. ఇప్పటికైనా ఓసీటీఎల్‌లో పారిశ్రామికమైన శాంతిని నెలకొల్పి యాజమాన్యం కార్మికులకు సహకరించాలని కోరారు. ఓసీటీఎల్ కంపెనీ లాభాల బాటలో ఉండాలని కోరారు. సమావేశంలో ఆ వేదిక జిల్లా కన్వీనర్ యానాల లింగారెడ్డి, నాయకులు వనం నరేందర్, నార్కట్‌పల్లి రమేష్, మొరోజు సైదాచారి, పూల సైదులు, ముడుదుడ్ల శ్రీనివాస్, అయిటిపాముల గిరి, సతీష్, సుల్తానా, జాని తదితరులు ఉన్నారు. -
మంత్రాల నెపంతో గోర్లకాపరిపై హత్యాయత్నం
నార్కట్‌పల్లి : మంత్రాలు చేస్తున్నాడని గొర్ల కాపరిపై హత్యాయత్నం చేసిన సంఘటన మండలంలోని శాపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బరిగేల యాదయ్య కోంత కాలం నుంచి గ్రామంలో మంత్రాలు చేస్తున్నాడాని ప్రజల్లో ఆరోపణలు ఉన్నట్లు అందులో భాగంగా మంగళవారం యాదయ్య తన గోర్లను మేత కోసం వ్యవసాయ భూముల వద్దకు తీసుకేళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు ఆతనిపై హత్యాయత్నం చేసినట్లు తెలిపారు. సోమ్మసిల్లి పడి పోయిన యాదయ్యను 108 వాహనంలో చికిత్స నిమిత్తం కామినేని అస్పత్రికి తరలించినట్లు తెలిపారు. దాడి చేసిన వ్యక్తులను పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్ఐ మోతిరామ్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
నార్కట్‌పల్లి రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆర్చీ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల నుంచి పార్సల్ లోడుతో టాటాఏస్ వాహనం నార్కట్‌పల్లి వైపు వస్తోంది. ఇదే సమయంలో కంటైనర్ వేణుగోపాల స్వామి ఆర్చీ సమీపంలో రాంగ్రూట్లో వచ్చి రోడ్డు క్రాస్ చేస్తుండగా ఎదురుగా వచ్చిన టాటాఏస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటాఏస్‌లో ప్రయాణిస్తున్న కనగల్ గ్రామానికి చెందిన కోమాగోని రమేష్, కంచనపల్లి గ్రామానికి మర్రి వినోద్‌కు తీవ్రగాయలయ్యాయి. వారిని చికిత్స నిమితం స్థానికి కామినేని అస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మోతీరామ్ తెలిపారు. -
చెర్వుగట్టు హుండీ లెక్కింపు
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థాన హుండీలను బుధవారం లెక్కించారు. 20 రోజులకు గానూ ఆలయంలోని వివిధ హుండీల ద్వారా రూ. 14,60,653, అన్నదానం హుండీ ద్వారా రూ. 96,891ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆధికారి గుత్తా మనోహర్‌రెడ్డి తెలిపారు. ఈ లెక్కింపులో ప్రధాన అర్చకుడు రామలింగేశ్వరశర్మ , సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రామారావు, శేఖర్, కొండల్‌రెడ్డి, వి.శంకర్, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజయ్య పాల్గొన్నారు. -
ప్రేమజంట బలవన్మరణం
అక్కెనపల్లి(నార్కట్‌పల్లి): వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదని ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో మంగళవారం వెలుగుచూసిన విషాదకర ఘటన వివరాలు.. నల్లగొండ మండలం దోమలపల్లి గ్రామానికి చెందిన మేడి రమేష్(21) కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ప్రసన్న(18) నల్లగొండలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుకుంటోంది. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావటంతో ఈ విషయం తెలిసిన కుటుంబ పెద్దలు మందలించారు. రెండు నెలలుగా రమేష్ హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సంక్రాంతి పర్వదినానికి రమేష్ స్వగ్రామానికి వచ్చాడు. అప్పటికే ప్రసన్నకు వారి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్న విషయం తెలిసింది. దీంతో ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం ఇంటి నుంచి బయలుదేరి నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లి గ్రామ శివారులోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి చేరుకున్నారు. కోనేరు సమీపంలో వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆలయ సిబ్బంది మంగళవారం వచ్చి చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మృతుల స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.