ఆభరణాల కోసమే హత్య
ఆభరణాల కోసమే హత్య
Published Mon, Oct 3 2016 10:15 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
వ్యాపారం బాగా సాగేందుకు ఇంట్లో పూజ చేయించాలనుకున్నాడు.. అందుకు చెర్వుగట్టుకు వెళ్లి ఓ శివ భక్తురాలితో మాట్లాడాడు.. ఓ మంచి రోజు చూసి ఇంటికి పిలిచాడు.. ఒంటరిగా వచ్చిన ఆవృద్ధురాలి ఒంటిపై ఉన్న ఆభరణాలను చూసి అతడికి దుర్బుద్ధి పుట్టింది. ఇంకేముంది నిస్సాయురాలైన ఆమెను గొంతునులిమి చంపేసి.. ఆభరణాలను కాజేశాడు. చెర్వుగట్టు సమీపంలో గత నెల వెలుగుచూసిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆభరణాల కోసమే హత్య చేసినట్టు విచారణలో వెల్లడైంది. అరెస్ట్ చేసిన నిందితుడిని సోమవారం సీఐ సుబ్బిరాంరెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టారు.
– నార్కట్‌పల్లి
నల్లగొండ మండలం దోమలపల్లి గ్రామానికి చెందిన బీమనపల్లి భరత్ కుటుంబం పదేళ్ల క్రితం చిట్యాలకు వలస వచ్చింది. భువనగిరి రోడ్డులో అద్దెకుంటూ చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యాపారం బాగా సాగాలని చెర్వుగుట్ట దేవాలయానికి వెళ్లి పూజ నిర్వహించాడు. అక్కడే కొలుపు చెబుతున్న జిల్లా కేంద్రంలోని ఏఆర్‌నగర్‌కు చెందిన ఉటుకూరి మాణిక్యమ్మ(55)ను సంప్రదించాడు. దీంతో ఇంట్లో పూజ చేయాలని అందుకు రూ. 5వేల వరకు ఖర్చు అవుతుందని చెప్పింది.
ఇంటికి పిలిచి..
భరత్ పూజ చేయించేందుకు ఒప్పందం చేసుకుని మాణక్యమ్మను గత నెల 10వ తేదీన ఇంటికి పిలిచాడు. అయితే ఆ సమయంలో భరత్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. మాణిక్యమ్మ ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను చూసి అతడి కన్ను చెదిరింది. దీంతో వాటిని కాజేసేందుకు ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన వద్ద ఉన్న తువాలతో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు, సెల్‌ఫోన్, నాలుగు వేల నగదు తీసుకున్నాడు. ఈ క్రమంలో అతడి భార్య, కుమారుడు వచ్చారు. ఇంట్లో మృతదేహం చూసి అవాక్కయ్యారు. వారికి ఏవో మాటలు చెప్పి అదే రోజు రాత్రి కుమారుడి ఆటోలో మాణిక్యమ్మ మృతదేహాన్ని చెర్వుగట్టు గ్రామానికి వెళ్లే దారిలో పడవేసి వచ్చాడు.
సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా..
గత నెల 11వ తేదీన వృద్ధురాలి హత్య వెలుగుచూడడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. మాణిక్యమ్మ సెల్‌ఫోన్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. పరోక్షంగా సహకారంం అందించి భరత్ భార్య లక్ష్మి, కుమారుడు మహేష్ పరారీలో ఉన్నారని సీఐ వివరించారు. సమావేశంలో ఎస్‌ఐ మోతీరామ్, నరేందర్, క్రైనీ ఎస్‌ఐ గోవర్ధన్ సిబ్బంది ఉన్నారు.
Advertisement
Advertisement