♦ ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో విత్తనోత్పత్తి
♦ ‘విత్తన భాండాగారం’పై దర్శన పత్రం విడుదల
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ విత్తన హబ్/వ్యాలీగా తెలంగాణను తీర్చిదిద్దాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. అందుకు అనుసరించాల్సిన వ్యూహాలతో కూడిన ‘దేశంలోనే విత్తన భాండాగారంగా తెలంగాణ’ పేరుతో ఒక దర్శన పత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభమైన జాతీయ విత్తన సదస్సులో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఈ పత్రాన్ని విడుదల చేశారు. విత్తనోత్పత్తికి రాష్ట్రంలో ఉన్న అనుకూల పరిస్థితులు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలు, అందుకు ప్రభుత్వం అందించే సహకారంపై వివరాలు పొందుపరిచారు. విత్తనోత్పత్తిలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. అన్ని జిల్లాలు విత్తన ఉత్పత్తికి అనుకూలమైనవేనని, రాష్ట్రంలో అధికంగా వాణిజ్య, కూరగాయల విత్తనాలే ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. తెలంగాణ శీతల వాతావరణంతో కూడి ఉంటుందని... ప్రపంచంలో ఇలాంటి వాతావరణం ఉండటం అరుదన్నారు.
దర్శన పత్రంలోని ముఖ్యాంశాలివే...
► విత్తన పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు కల్పించడం.
► విత్తన పరిశ్రమను ప్రోత్సహించేందుకు అనుకూలమైన విధానాల రూపకల్పన.
► విత్తన పంట పండించాక అందుకు అవసరమైన విత్తన ప్లాంట్లు, నిల్వ, రవాణా సౌకర్యం కల్పించడం.
► కొత్త ప్రాంతాలకు ఎగుమతి చేయడం.
► ఆఫ్రికా, ఇండోనేసియా, వియత్నాం, బంగ్లాదేశ్ సహా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతులు వృద్ధి చేసే అవకాశాలను గుర్తించడం.
► విత్తన ఉత్పత్తికి ప్రత్యామ్నాయ ప్రాంతా లను గుర్తించి అందుకు అనుగుణంగా క్లస్టర్లను తయారుచేయడం.
► రాష్ట్ర విత్తన వ్యవసాయ క్షేత్రాలను పునరుద్ధరించడం.
► విత్తన ఉత్పత్తి ప్రాంతాలకు పూర్తిస్థాయి విద్యుత్ కల్పించడం. నిల్వల కోసం గోదాములు ఏర్పాటు చేయడం.
► విత్తన కంపెనీలు తమ సామాజిక బాధ్యతగా తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజల విత్తనాలను కూడా తయారు చేయాలి.
ప్రపంచ విత్తన హబ్‌గా తెలంగాణ
Published Wed, Oct 28 2015 4:03 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement