సావనీర్‌ను అవిష్కరిస్తున్న మేయర్ రామ్మోహన్, తదితరులు
ఏఎస్‌రావు నగర్ : తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. శుక్రవారం సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌ఎంఈ)హైదరాబాద్, తెలంగాణ ఇండస్ట్రియల్ అసోసియేషన్, చర్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ సంయుక్తాధ్వర్యంలో ఎన్ఎస్‌ఐసీలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ తెలంగాణ పారిశ్రామిక విధానానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రసంశలు వస్తున్నాయని అన్నారు.
సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. నగరానికి మణిహారంలాగా 14 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు సన్నాహలు జరుగుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పి.పావనీరెడ్డి, ఎంఎస్‌ఎంఈ డైరక్టర్ అరవింద్ పట్వారీ, తెలంగాణ ఇండస్ట్రీయల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె. సుధీర్‌రెడ్డి, ఎన్ఎస్‌ఐసీ మేనేజింగ్ డైరక్టర్ వెంకటచలపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించిన మేయర్ పారిశ్రామిక వేత్తల నుంచి వివరాలను తెలుసుకున్నారు.
ప్రచారం లేక లక్ష్యానికి గండి..
ఎంఎస్‌ఎంఈ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ గురించి సరైన ప్రచారం లేక పోవటం వల్ల ఆశించిన లక్ష్యం నెరవేరటం లేదని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఈ ఎగ్జిబిషన్ గురంచి ముందస్తు ప్రచారం చేస్తే చిన్న పరిశ్రమల వారికి ఎంతో ఉపయోగపడేదని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా అనేక స్టాల్స్ ఖాళీగా దర్శనం ఇచ్చాయి. పారిశ్రామిక వేత్తల కంటే రాజకీయ నాయకులే ఎక్కువగా కన్పించారు. దీంతో అతిథులు నిరుత్సాహపడ్డారు.