as rao nagar
-
సృజన: తెలుగింటి బార్బీ
పట్టులంగా, ఓణీ కట్టిన బొమ్మలు కాళ్లకు పారాణి, నుదుటన బాసికం కట్టిన బొమ్మలు, పసుపు కొట్టే బొమ్మలు.. పందిట్లో బొమ్మలు, అమ్మవారి బొమ్మలు, అబ్బురపరిచే బొమ్మలు.. చిందేసే బొమ్మలు.. చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనిపించే బొమ్మలు ..,ఎవ్వరి చూపులనైనా కట్టిపడేసేలా ఉండే బొమ్మలేవీ అంటే.. అవి దివ్య తేజస్వి చేతుల్లో రూపుదిద్దుకున్న అందమైన బొమ్మలై ఉంటాయి. వెస్ట్రన్ బార్బీ డాల్‌ను ఇండియన్ డాల్‌గా మార్చేసి, వాటిని మన సంప్రదాయ వేడుకలకు అనువుగా మార్చేసింది హైదరాబాద్ ఎఎస్‌రావు నగర్‌కు చెందిన దివ్య తేజస్వి. అమ్మాయి పుట్టుక నుంచి షష్టిపూర్తి వరకు ప్రతి వేడుకను బొమ్మల్లో అందంగానూ, అర్థవంతంగానూ చూపుతూ పది మందికి ఉపాధి కల్పిస్తోంది. భర్త ఉద్యోగరీత్యా బెంగుళూరులో ఉంటున్న దివ్య ఈ అందమైన బొమ్మల రూప కల్పన గురించి అడిగితే ఒక చిన్న ఆలోచన తన జీవితాన్ని ఎలా నిలబెట్టిందో, పదిమందికి ఆదాయవనరుగా ఎలా మారిందో నవ్వుతూ వివరించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘దసరా వచ్చిందంటే బొమ్మల కొలువు గురించి ఆలోచన చేయకుండా ఉండరు. అలాగే, ఒక బొమ్మనైనా ఇంటికి తెచ్చుకుంటారు. నేను ఇంట్లోనే బొమ్మల తయారీ మొదలుపెట్టాను. పాప ముచ్చట తీర్చిన బొమ్మ అమ్మానాన్నలది వెస్ట్ గోదావరి. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. బయోకెమిస్ట్రీ చేశాను. జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం చేసేదాన్ని. పెళ్లయ్యాక మా వారి ఉద్యోగరీత్యా బెంగుళూరు వెళ్లాను. అక్కడ టీచర్‌గా ఉద్యోగంలో చేరాను. మాకు ఓ పాప. హ్యాపీగా గడిచిపోతున్నాయి రోజులు అనుకున్న సమయంలో కరోనా మా జీవితాలను దెబ్బతీసింది. మా ఉద్యోగాలు పోయాయి. అద్దె కట్టడానికి కూడా కష్టంగా ఉన్న రోజులు. ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను. ఓరోజు మా పాప తన బొమ్మకి డ్రెస్ వేసివ్వమంటే, నా చీర అంచుతో చీరకట్టి, అలంకరించి ఇచ్చాను. దాన్ని ఫొటో తీసి ఇన్‌స్టా పేజీలో పెట్టాను. ఆర్డర్లు తెచ్చిన బొమ్మలు నేను పెట్టిన బొమ్మ ఫొటో నచ్చి అమెరికా నుంచి ఒక ఎన్ఆర్ఐ ఫోన్ చేశారు. ‘నాకు ఆ బొమ్మ చాలా నచ్చింది. మా అమ్మాయి ఓణీ ఫంక్షన్ ఉంది. వచ్చినవారికి రిటన్‌గిఫ్ట్ ఇవ్వాలి. నాకు అలాంటి బొమ్మలు ఒక పదిహేను కావాలి. చేసిస్తారా..’ అంది. నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా వేసింది. ఆ నెల రెంట్ ఇవ్వకుండా ఓనర్‌తో మాట్లాడి, ఆ డబ్బుతో బార్బీ బొమ్మలు, వాటికి కావల్సిన మెటీరియల్ తీసుకొచ్చాను. వ్యాపారం అనుకోలేదు. కానీ, ముందు గణేషుడి బొమ్మ తయారు చేశాను. ఆ ముద్దు వినాయకుడిని చూసి ఆ రోజు కళ్లలో నీళ్లు వచ్చేశాయి. ఇక వెస్ట్రన్ కల్చర్‌తో ఉండే బార్బీ బొమ్మను తెలుగింటి సంప్రదాయం అద్దుకునేలా తయారు చేయడానికి చాలా ప్రయోగాలే చేయాల్సి వచ్చింది. జుట్టు రంగు, స్కిన్కలర్, కళ్లు.. వీటితో పాటు డ్రెస్సింగ్.. చాలా సమయమే తీసుకుంది. కానీ, ఒక్కో బొమ్మ తయారు చేసి, అనుకున్న సమయానికి పంపాను. ఆ ఆర్డర్ తర్వాత మరో ఆర్డర్ వచ్చింది. అలా వచ్చిన డబ్బుతో ఇంటి అద్దె కట్టాం. సందర్భానికి తగిన కానుకలు మా అమ్మనాన్నలకు నేను, చెల్లి సంతానం. మా చిన్నప్పుడు మేం ఆడుకోవడానికి మా అమ్మ క్లాత్‌తో బొమ్మలు కుట్టి, చీరలు కట్టి, వాటికి పూసలతో అలంకారం చేసేది. నాకు అదంతా గుర్తుకువచ్చింది. మన సంప్రదాయాల్లో ఎన్నో పండగలు ఉన్నాయి. వాటిని ఉదాహరిస్తూ బొమ్మలు తయారు చేసేదాన్ని. మొదట్లో అంతగా గుర్తింపు లేదు కానీ మెల్ల మెల్లగా గుర్తింపు రావడం మొదలైంది. పుట్టుక నుంచి షష్టిపూర్తి వరకు అమ్మాయి పుట్టిన నాటి నుంచి ప్రతీది వేడుకలాగే సాగుతుంది ఆమె జీవితం. ఒక ఆర్డర్ అయితే వాళ్లమ్మాయి మొదటి రోజు స్కూల్‌కి వెళుతోంది, ఆ రోజును పురస్కరించుకుని బొమ్మ కావాలని అడిగారు. ఉయ్యాల నుంచి విద్యాభ్యాసం, ఓణీ ఫంక్షన్, పెళ్లి, సీమంతం, గృహప్రవేశం, షష్టిపూర్తి ... వరకు ఇలా ప్రతి దశలోనూ జరిగే వేడుక సందర్భాన్ని తీసుకొని, దానికి అనుగుణంగా బొమ్మల సెట్స్‌ను తయారుచేయడం ప్రారంభించాను. ఆర్డర్లు పెరుగుతున్నాయి. నాతోపాటు నాకు తెలిసిన స్నేహితులు జత కలిశారు. ఆర్డర్లు పెరుగుతున్న కొద్దీ వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకరు డ్రెస్ కుడతారు, మరొకరు హెయిర్ బ్లాక్‌గా రావడానికి, ఇండియన్ స్కిన్ కలర్‌కి తేవడానికి, కళ్లు డిజైన్ చేయడానికి కష్టపడతారు. మొదట్లో నాకు ఒక్క బొమ్మ చేయడానికి రోజు మొత్తం పట్టేది. ఇప్పుడు 2–3 గంటలు పడుతుంది. నేను చేసిన విధానం నేర్పించి, నా పనిలోకి తీసుకున్నవారిలో కాలేజీ అమ్మాయిలు, గృహిణిలు ఉన్నారు. వాళ్ల ఇంటి వద్దే వర్క్ చేసిచ్చేవారున్నారు. హైదరాబాద్‌లో ఉన్న మా అమ్మ, చెల్లెలు కూడా ఈ బొమ్మల తయారీలో భాగమయ్యారు. మా అమ్మ, మా చెల్లెలు బొమ్మలకు జడలు, పువ్వులు కుట్టి, పంపుతారు. మా వారు షాపింగ్ చేసుకొస్తారు. ఆన్లైన్లో చూసి, నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయిలు అలంకరణలో మార్పులు చేర్పులు, ప్యాకింగ్‌లో సాయం చేస్తుంటారు. మా చెల్లెలు ‘లలిత డాల్స్’ అనే పేరుతో ఉన్న ఇన్‌స్టా పేజీలో ఫొటోలన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇలా కొందరి చేయూతతో నా బొమ్మలు మరింత అందంగా రూపుకడుతున్నాయి. బడ్జెట్‌కు తగినట్టు.. ఒక బొమ్మ రూ. 200 నుంచి ధర ఉంది. వెడ్డింగ్ సెట్ అయితే రూ. 15000 వరకు ఉంటుంది. తక్కువ ధరలో సెట్ కావాలంటే అందుకు తగినట్టు కస్టమైజ్ చేసి ఇస్తున్నాను. ఇది దసరా సమయం కాబట్టి, అమ్మవారి బొమ్మలు, బతుకమ్మ ఆడుతున్న మహిళల బొమ్మల సెట్.. తయారుచేశాను. హైదరాబాద్‌లోని ఎఎస్‌రావునగర్‌లో ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టాం. అమ్మాయి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలతో పాటు పౌరాణిక గాధలు కూడా ఈ బొమ్మల ద్వారా చూపుతున్నాను’’ అని వివరించింది ఈ కళాకారిణి. – నిర్మలారెడ్డి -
అమ్మో.. రాధిక చౌరస్తా!
సాక్షి, హైదరాబాద్: అదుపు తప్పిన జీహెచ్ఎంసీకి చెందిన చెత్త తరలించే టిప్పర్ ఓ శానిటరీ సూపర్వైజర్ను బలితీసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందంటూ స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్‌లో నివసించే జీడికంటి సౌందర్య(35) కాప్రా సర్కిల్ కార్యాయలంలో పారిశుద్ధ్య విభాగంలో సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నారు. భర్త అశోక్ పెయింటర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం. రోజూలానే మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన సౌందర్య ఈసీఐఎల్‌లో కార్మికుల హాజరును నమోదు చేసి అక్కడి నుంచి తన స్కూటీ(టీస్ 08 ఈఎక్స్ 4887)పై భవానీనగర్ కాలనీకి బయలుదేరారు. ఈ క్రమంలో రాధిక చౌరస్తా నుంచి సాకేత్ వైపుగా వెళ్తుండగా వెనుక నుంచి అదుపుతప్పిన వేగంతో వచ్చిన జీహెచ్ఎంసీ టిప్పర్ (టీఎస్ 08 యూఏ 5203) స్కూటీని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో కింద పడిపోయిన సౌందర్యపై నుంచి టిప్పర్ వెనుక చక్రాలు వెళ్లడంతో ఆమె శరీరం పూర్తిగా ఛిద్రమై అక్కడిక్కడే మృతిచెందింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా టిప్పర్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న టిప్పర్ డ్రైవర్ నరేందర్‌కు దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నవంబర్‌లో రాధిక చౌరస్తా సిగ్నల్ వద్దే ఇదే స్పాట్లో టీఎస్ఐఐసీ కాలనీకి సరిత అనే మహిళ వెళ్తున్న స్కూటీని ఇదే తరహాలో చెత్త టిప్పర్ వెనుక నుంచి ఢీ కొట్టిన విషయం పాఠకులకు విదితమే. కిందపడిపోయిన సరితపై టిప్పర్ చక్రాలు వెళ్లడంతో ఆమె కూడా మృతి చెందిన ఘటన మరవక ముందే మరో ప్రమాదం చోటు చేసుకోవడం స్థానికుల హృదయాలను కలచివేస్తోంది. మరో ప్రమాదంలో... ఇద్దరు స్నేహితులు కలిసి రాత్రి పొద్దు పోయేదాగా మద్యం తాగారు. మత్తులో ఉన్న వారు సిగరెట్ కోసమని బైక్‌పై బయలుదేరారు. బైక్ కాస్తా అదపుతప్పి రోడ్డు పక్క డివైడర్‌కు ఢీ కొనడంతో ఒకరు మృతిచెందగా మరొకరు గాయాలతో బయట పడ్డ సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నేరేడ్మెట్ ఓల్డ్ పోలీస్‌స్టేషన్ సమీపంలో నివసించే దుర్గం భిక్షపతి ఆటోడ్రైవర్. అతని పెద్ద కుమారుడు దుర్గం సాయికిరణ్(26) డిగ్రీ మధ్యలోనే మానేసి ఖాళీగా ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో భగత్‌సింగ్ కాలనీకి చెందిన మిత్రుడు సాయిరాజ్ వద్దకు వెళ్లాడు. ఇద్దరు కలిసి రాత్రి పొద్దు పోయేవరకు మద్యం సేవించారు. అప్పటికే ఒంటి గంట దాటడంతో సమీపంలో పాన్షాపులన్నీ మూసేశారు. మత్తులో ఉన్న వారు సిగరెట్ కోసమని ప్యాషన్ బైక్(ఏపీ 13 హెచ్ 0982)పై ఈసీఐఎల్ చౌరస్తాకు బయలుదేరారు. ఈ క్రమంలో నార్త్ కమలానగర్ మూల వద్ద అదుపు తప్పిన బైక్ రోడ్డు పక్క డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న సాయికిరణ్‌గౌడ్ పక్కనే గోడపైకి ఎగిరిపడి అక్కడిక్కడే మృతిచెందాడు. వెనుక ఉన్న సాయిరాజ్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: రాధిక హత్య కేసు: వీడిన మిస్టరీ..) -
మరో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
సాక్షి, హైదరాబాద్ : నగరంలో వరసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మంగళవారం బంజారాహిల్స్‌లో ఆర్టీసీ బస్సుకింద పడి మహిళా సాఫ్ట్వేర్ మృతి చెందిన ఘటన మరవక ముందే ఏఎస్రావు నగర్ చౌరస్తాలో మరో ఘోరం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ట్రక్కు.. స్కూటీపై వెళ్తున్న మహిళను ఢీకొట్టింది. తలపై నుంచి ట్రక్కు టైరు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. హెల్మెట్‌తో పాటు ఆ మహిళ తల ఛిద్రమైంది. ఏఎస్రావు నగర్‌లోని రాధిక థియేటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. -
రెచ్చిపోయిన ఆకతాయిలు
హైదరాబాద్: నగరంలో ఆకతాయిలు రెచ్చిపోయారు. ఇంటి ముందు పార్క్‌చేసి ఉంచిన వాహనాలకు నిప్పు పెట్టి తగలబెట్టారు. నగరంలోని ఏఎస్రావు నగర్‌లోని ఓ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమరా ఫుటేజిల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. -
పరిశ్రమల ఏర్పాటులో తెలంగాణ ఆదర్శం
ఏఎస్రావు నగర్ : తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. శుక్రవారం సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఎస్ఎంఈ)హైదరాబాద్, తెలంగాణ ఇండస్ట్రియల్ అసోసియేషన్, చర్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ సంయుక్తాధ్వర్యంలో ఎన్ఎస్ఐసీలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ తెలంగాణ పారిశ్రామిక విధానానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రసంశలు వస్తున్నాయని అన్నారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. నగరానికి మణిహారంలాగా 14 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు సన్నాహలు జరుగుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పి.పావనీరెడ్డి, ఎంఎస్ఎంఈ డైరక్టర్ అరవింద్ పట్వారీ, తెలంగాణ ఇండస్ట్రీయల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె. సుధీర్‌రెడ్డి, ఎన్ఎస్ఐసీ మేనేజింగ్ డైరక్టర్ వెంకటచలపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించిన మేయర్ పారిశ్రామిక వేత్తల నుంచి వివరాలను తెలుసుకున్నారు. ప్రచారం లేక లక్ష్యానికి గండి.. ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ గురించి సరైన ప్రచారం లేక పోవటం వల్ల ఆశించిన లక్ష్యం నెరవేరటం లేదని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఈ ఎగ్జిబిషన్ గురంచి ముందస్తు ప్రచారం చేస్తే చిన్న పరిశ్రమల వారికి ఎంతో ఉపయోగపడేదని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా అనేక స్టాల్స్ ఖాళీగా దర్శనం ఇచ్చాయి. పారిశ్రామిక వేత్తల కంటే రాజకీయ నాయకులే ఎక్కువగా కన్పించారు. దీంతో అతిథులు నిరుత్సాహపడ్డారు. -
ఏఎస్‌రావునగర్‌లో శ్రీలక్ష్మీవిలాస్ బ్యాంకు ప్రారంభం
ఏఎస్‌రావునగర్‌లో శ్రీలక్ష్మీ విలాస్ బ్యాంకు బ్రాంచిని వైటల్ తెరాపిటీక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.వేణుగోపాల్‌శెట్టి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు రీజనల్ డీజీఎం వి.చంతిర శేఖర్ మాట్లాడుతూ.. దేశంలో 456 లక్ష్మీవిలాస్ బ్రాంచిలతో రూ.40 వేల కోట్ల టర్నోవర్ నడుస్తుందని తెలిపారు. రీజియన్‌లో 29 బ్రాంచీలు, నగరంలో 17 బ్రాంచీలలో రూ.2392 కోట్ల వ్యాపారం జరుతుందన్నారు. బ్రాంచీ మేనేజర్ కేవీఎస్‌ఆర్‌కే.ప్రసాద్ మాట్లాడుతూ.. గృహ రుణాలకు ఎలాంటి ప్రాసెసింగ్ పీజు లేదని, ఏటీయం, లాకర్‌తో పాటు అన్ని రకాల బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కాప్రా సర్కిల్ మాజీ అధ్యక్షులు పెద్ధి నర్సింహగుప్తా, మల్కాజిగిరి బ్రాంచి మేనేజర్ మధుసూదన్, పెద్ది నాగరాజు గుప్తా, కాసం వెంకటహరి తదితరులు పాల్గొన్నారు. -
స్కూటర్ డిక్కీలోంచి రూ.6.42 లక్షలు చోరీ
హైదరాబాద్: స్కూటర్ డిక్కీలో ఉంచిన రూ.6.42 లక్షలు చోరీకి గురయ్యాయి. కుషాయిగూడ పోలీసులు తెలిపి వివరాలు ఇలా ఉన్నాయి. కాప్రా సాయిప్రియ కాలనీకి చెందిన కె.వెంకటేష్ రీగల్ బార్లో పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అతని బావ గణేష్ పౌల్ట్రీ ఫామ్‌కు సంబంధించిన రూ.6.42 లక్షలను బ్యాంకులో వేయమని ఇచ్చాడు. వెంకటేష్ ఏఎస్రావు నగర్‌లోని ఐసీఐసీఐ బ్యాంకుకు వెళ్తుండగా, మార్గమధ్యలో బండి నిలిపి ఓల్డ్ కాప్రా షాపు వద్ద సెల్‌ఫోన్ రీఛార్జ్ చేయించుకున్నాడు. ఇంతలో డబ్బులు అకౌంట్లో వేయాల్సిన మహ్మద్ ఖాసిం అనే వ్యక్తి ఫోన్ చేసి, సదరు డబ్బును బ్యాంకులో వేయకుండా తన చేతికే ఇవ్వాలని కోరాడు. అందుకు గణేష్ అంగీకారం కూడా తీసుకున్న వెంకటేష్ రోడ్డుపక్కన స్కూటర్ నిలిపి ఖాసిం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఇద్దరు ఆగంతకులు వచ్చి ఏదో చిరునామా అడిగి వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత చూడగా, స్కూటర్ డిక్కీలో పెట్టిన నగదు కనిపించకపోవడంతో లబోదిబోమన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, డబ్బులు ఎక్కడ పోయి ఉంటాయో వెంకటేష్ సరిగ్గా చెప్పలేక పోతున్నాడు. -
బియాస్ లో శవమై తేలిన సాయిరాజ్
మండీ: హిమాచల్ ప్రదేశ్ బియాస్‌నదిలో మరో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడు హైదరాబాద్ ఏఎస్‌రావ్ నగర్‌కు చెందిన బి. మహెన్ సాయిరాజ్ గా గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం రేపు హైదరాబాద్‌కు పంపించనున్నారు. తల్లిదండ్రులతో పోట్లాడి మరీ టూర్ కు వెళ్లిన సాయిరాజ్ చివరకు శవమై తేలాడు. ఇప్పటివరకు13 మృతేదేహాలు వెలికితీశారు. శివప్రకాశ్ వర్మ, ఆశిష్ మంథా, మాచర్ల అఖిల్ మృతదేహాలు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నాయి. గల్లంతైన మిగతా 11 మంది విద్యార్థుల మృతదేహాల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. -
'బంగారు ఆభరణాలు మాత్రమే దోచుకెళ్లారు'
హైదరాబాద్ : ఏఎస్ రావు నగర్లో చోరీకి పాల్పడిన మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకులో దుండగులు కేవలం బంగారు ఆభరణాలు మాత్రమే దోచుకు వెళ్లినట్లు అల్వాల్ డీజీపీ నవదీప్ సింగ్ తెలిపారు. నగదు చోరీ కాలేదని ఆయన చెప్పారు. సీసీ కెమెరా పుటేజీని పరిశీలిస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. గ్రిల్స్ తొలగించి దుండగులు బ్యాంకులోకి చొరబడినట్లు ఆయన తెలిపారు. మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకులో ఈరోజు తెల్లవారుజామున భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఉదయం బ్యాంకు తెరిచేందుకు వచ్చిన సిబ్బంది షట్టర్ తాళాలు పగులగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బ్యాంకు సిబ్బందిని విచారిస్తున్నారు. సీసీ కెమెరాల్లోని నమోదు అయిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. మల్కాజ్గిరి డీసీపీ గ్రేవాల్ సింగ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
ఏఎస్ రావు నగర్‌లోని మహేష్ బ్యాంకులో చోరీ
-
ఏఎస్ రావు నగర్‌లోని మహేష్ బ్యాంకులో చోరీ
హైదరాబాద్ : హైదరాబాద్ ఏఎస్ రావు నగర్‌లోని మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. గ్రిల్స్ తొలగించి బ్యాంక్‌లోకి చొరబడిన దుండగులు బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకు వెళ్లారు. ఉదయం బ్యాంకు తెరిచేందుకు వచ్చిన సిబ్బంది షట్టర్ తాళాలు పగులగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బ్యాంకు సిబ్బందిని విచారిస్తున్నారు. సీసీ కెమెరాల్లోని నమోదు అయిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఇక మల్కాజ్గిరి డీసీపీ గ్రేవాల్ సింగ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే ఎంత మొత్తంలో నగదు, ఆభరణాలు చోరీకి గురైన వాటిపై విచారణ జరుపుతున్నారు.