పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం
లండన్‌లో బ్రిటిష్-సౌత్ ఇండియన్ బిజినెస్ మీట్ -2015
{పపంచంలో మేటిగా టీఎస్ ఐ పాస్: ఎంపీ బూర
సాక్షి, హైదరాబాద్: ఏ రంగంలో పెట్టుబడులు పెట్టడానికైనా భారత్‌లో అన్ని రాష్ట్ర్రాల కంటే తెలంగాణ అనువైన రాష్ట్రమని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అభిప్రాయ పడ్డారు. లండన్‌లో గురువారం జరిగిన ‘బ్రిటిష్ - సౌత్ ఇండియా బిజినెస్ మీట్-2015 ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. బ్రిటిష్ పార్లమెంటులో జరుగుతున్న ఈ మీట్‌లో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతోపాటు భారత సంతతికి చెందిన బ్రిటన్ ఎంపీ వీరేంద్రశర్మ, తెలంగాణ పర్యాటక కారద్యర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ఈ మీట్‌లో ఎంపీ బూర ప్రసంగిస్తూ.. తెలంగాణ విశిష్టత, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, పారిశ్రామిక ప్రగతి, ఐటీ, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, విద్యుత్ తదితర అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించారు.
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా టీఎస్ ఐపాస్ పేరుతో సరికొత్త పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన టీ.హబ్ దేశంలోనే పెద్దదని వివరించారు. పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర్రానికి రావాలని పిలుపునిచ్చారు. ఈ బిజినెస్ మీట్‌లో తెలంగాణ పర్యాటక రంగం విశిష్టత, రాష్ట్రంలోని దర్శనీయ ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, హైదరాబాద్ బిర్యానీ తదితర అంశాల గురించి పర్యాటక కార్యదర్శి బుర్రా వెంకటేశం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.