పనికిరాని బోరుబావులను మూసేయండి
అన్ని జిల్లాల కలెక్టర్లకు మంత్రి కేటీఆర్ ఆదేశం
నల్లగొండలో శాన్వి మృతిపట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా వల్లాల గ్రామంలోని బోరుబావిలో పడి రెండేళ్ల బాలిక శాన్వి మృతి చెందడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. శాన్వి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శాన్వి మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే మంత్రి కేటీఆర్.. నల్లగొండ జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డికి ఫోన్‌చేసి మాట్లాడారు. నిరుపయోగంగా ఉన్న, పనికిరాని బోరుబావులను మూసివేయాలని గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఈ సంఘటన జరగడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. ప్రమాదకరమైన బోరుబావుల విషయమై ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
యజమానిపై క్రిమినల్ కేసు పెట్టండి
పనికి రాని బోరుబావులను మూసేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఈ ప్రమాదానికి కారణమైన భూమి యజమానిపై క్రిమినల్ కేసు పెట్టాలని మంత్రి కేటీఆర్ నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. గతంలో పలుమార్లు అధికారుల ద్వారా, మీడియా ద్వారా బోరుబావుల విషయమై ప్రచారం నిర్వహించామని, అయినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. పనికిరాని బోరుబావుల మూసివేత కార్యక్రమాన్ని అవసరమైతే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి కేటీఆర్ సూచించారు.