లక్ష్మారెడ్డి Vs రేవంత్‌రెడ్డి
*మంత్రి, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం
*వ్యక్తిగత దూషణ మానుకోవాలి: లక్ష్మారెడ్డి
*అధికారిక సమావేశంలో రాజకీయాలొద్దు : రేవంత్‌రెడ్డి
మహబూబ్ నగర్: ఓ అధికారిక సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, కొడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగింది. శుక్రవారం మద్దూరులోని ఎన్‌ఆర్‌ఎస్‌ఎంఎస్ నిధులతో నిర్మించిన ప్రభుత్వ ఆస్పత్రిలో నూతన భనవ ప్రారంభోత్సవానికి మంత్రి లక్ష్మారెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... ' కమీషన్ల కోసం ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను చేపట్టుతుందని, నేను డాక్టర్‌ను కానటా.. మున్నాబాయి సినిమాలో డాక్టర్‌నటా.. ఇలా కొంతమంది నేతలు ప్రభుత్వంలో ఉన్న మంత్రులపై, ముఖ్యమంత్రిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. కమీషన్ల ప్రభుత్వమే అయితే ఆరు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనులు కట్టబెట్టలేదా. గతంలో ఆంధ్రా పాలకులు కమీషన్ల కోసమే కొత్త ప్రాజెక్టులు చేపట్టిన విషయం గుర్తు పెట్టుకొని ఇలా ఆరోపణలు చేస్తున్నారు. నేను గుల్బర్గాలో డాక్టర్ చేశా. ఎవరైనా విచారణ చేసుకోవచ్చు.. ఆరోపణలు చేసినవారు ఏం చదివారో బయటపెట్టాలి. టీఆర్‌ఎస్ నేతలు ఎప్పుడూ ఎవరిపై వ్యక్తిగత దూషణలు చేయలేదు. ఇలాంటి ఆరోపణలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు'అని అన్నారు.
దీంతో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పైకి లేచి ‘ఇది రాజకీయాలు మాట్లాడుకునే సమావేశం కాదు, అధికారిక సమావేశం. ఒకవేళ రాజకీయాలు మాట్లాడాలని అనుకుంటే నీవు, కేసీఆర్ టీడీపీలో ఉండి పదవులు అనుభవించ లేదా, టీఆర్‌ఎస్ పార్టీ నాయకుల చరిత్రలన్నీ తెలుసు’ అని అనడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి, వాగ్వివాదానికి దారితీసింది. ఇదంతా చూస్తున్న టీడీపీ, టీఆర్‌ఎస్ నేతలు నినాదాలతో హోరెత్తించారు. చివరికి మంత్రి కల్పించుకుని అందరినీ సముదాయించి సమావేశాన్ని ముగించారు.