హరీశ్, తుమ్మల నిర్వాకమే కారణం: రేవంత్
కరీంనగర్ : తెలంగాణ టీడీపీ బృందం మంగళవారం మిడ్ మానేరు గండిని పరిశీలించింది. వరదలో కొట్టుకుపోయిన పంటలను పరిశీలించిన టీడీపీ నేతలు బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ....‘మిడ్ మానేరు గండికి మంత్రులు హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వరరావుల నిర్వాకమే కారణం. మొదటి కాంట్రాక్ట్ రద్దు చేసి తుమ్మల బంధువుకు ఎందుకు కాంట్రాక్ట్ అప్పగించారో చెప్పాలి. మామా, అల్లుడు కోట్లాది రూపాయల కమీషన్లు పొంది 19శాతం లెస్సుతో తుమ్మల బంధువుకు కాంట్రాక్ట్ అప్పగించారు. కాంట్రాక్టర్ ఇచ్చిన కమీషన్ డబ్బులే తుమ్మల ఉప ఎన్నికలో వెదజల్లి గెలిచారు.
దానిపై బహిరంగ చర్చకు వస్తే ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధం. శవాలపై చిల్లర ఏరుకునే వారికంటే సీఎం కేసీఆర్ అధ్వానంగా ఉన్నారు. మిడ్ మానేరు బాధితులను పరామర్శించని సీఎం మనకెందుకు. అవగాహన లేని ప్రజా సమస్యలపై పట్టింపు లేని కేసీఆర్...ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టకరం. ఇప్పటికీ నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇస్తే తామైనా నిధులు తీసుకొస్తాం. మిడ్ మానేరు గండితో పంట పొలాలు అక్కరకు రాకుండా పోయిన రైతులకు ఎకరాకు రూ.20 లక్షలు ఇవ్వాలి. మన్వాడను ముంపు గ్రామంగా ప్రకటించిన తగిన పరిహారం చెల్లి, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలి. మిడ్ మానేరు సమస్యపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. వర్షం, వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు పరిహారం చెల్లించాలి’ అని డిమాండ్ చేశారు.