28న తెలుగు కవిత్వ సమాలోచన
తెనాలి: పట్టణ సామాజిక, సాహిత్య సంస్థ ప్రజ్వలిత ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన ‘తెలుగు కవిత్వ సమాలోచన’ రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నారు. సదస్సు బ్రోచర్‌ను శనివారం గౌతమ్‌గ్రాండ్‌లో ఆవిష్కరించారు. సదస్సు విశేషాలను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగళ్ల వేంకట దుర్గాప్రసాద్ వివరించారు. గౌతమ్ గ్రాండ్ కాన్ఫరెన్సు హాలులో ఉదయం 9 గంటల్నుంచి ఆరంభమయే తెలుగు కవిత్వ సమాలోచనలో వివిధ కవితా రీతులపై ఆయా రంగాల ప్రముఖులు ప్రసంగిస్తారు. దిగంబర కవిత్వానికి 50 ఏళ్లయిన సందర్భంగా మూడు సంపుటాల సంయుక్త సంచిక, ధిక్కారవాదం– దిగంబర కవిత్వం పుస్తకాలను ఆవిష్కరిస్తారు. దిగంబర కవులు నగ్నముని, మహాస్వప్న, నిఖిలేశ్వర్, భైరవయ్యను సత్కరిస్తారు. సాయంత్రం జరిగే సభలో గుంటూరు సాంస్కృతిక సంస్థకు చెందిన ఎస్.బాలచందర్‌ను ప్రజ్వలిత 2015– సాంస్కృతిక సేవామూర్తి పురస్కారంతో సత్కరిస్తారు. రాష్ట్ర ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర భాష, సాంస్కృతికశాఖ డైరెక్టర్ డి.విజయభాస్కర్‌తో సాహితీ ప్రముఖులు పాల్గొంటారు. అనంతరం ప్రముఖ కవి సీతారాం కాలేజి విద్యార్థులతో కవితావరణం నిర్వహిస్తారు. సంస్థ కార్యదర్శి వై.వేణుగోపాలరెడ్డి, విధాన నిర్ణాయక మండలి సభ్యులు కుక్కుమళ్ల ఆదెయ్య, కనపర్తి బాబూరావు, గోగినేని కేశవరావు, దేవిశెట్టి కృష్ణారావు, చందు భాస్కరరావు, సహాయ కార్యదర్శి పందిటి సుబ్బారావు, తెనాలి అబ్రహాం లింకన్, సమన్వయకర్త తెనాలి వినయ్‌కుమార్ పాల్గొన్నారు.