హైదరాబాద్: తెలంగాణలో చలి తీవ్రత మొదలైంది. రాత్రిళ్లు ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఉత్తర, ఈశాన్య భారతదేశం నుంచి వీస్తోన్న చలిగాలులతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే ఐదు రోజుల వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 7.7 డిగ్రీల కనిష్ట ఉష్ణ్రోగ్రత నమోదైంది. చలికాలం మొదలైన తర్వాత ఇంత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం తెలంగాణలో ఇదే తొలిసారిగా వాతావరణశాఖ పేర్కొంది. ఆదిలాబాద్‌లో మున్ముందు ఐదారు డిగ్రీలకు కూడా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది.
రామగుండం, నిజామాబాద్‌ల్లో సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 13 డిగ్రీలు చొప్పున రికార్డు అయ్యాయి. ఐదు రోజులపాటు చలి తీవ్రత కొనసాగుతుందని... ఆ తర్వాత సాధారణంగానే నమోదు అవుతాయని వాతావరణశాఖ చెబుతోంది. మధ్యలో కొద్దిగా ఉష్ణోగ్రతలు అటూఇటుగా ఉన్నా సంక్రాంతి వరకు చలి తీవ్రత ఉంటుందంటున్నారు.
శీతాకలం ప్రారంభమై ఇన్ని రోజులైనా ఇప్పటివరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఆరేడు డిగ్రీలు అధికంగానే నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి కూడా. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని అధికారులు చెబుతున్నారు. చలి తీవ్రత పెరుగుతోన్న దృష్ట్యా పిల్లలు, పెద్దలు చలి నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు స్వెట్టర్లు, జర్కిన్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో నేపాలీలు ఏర్పాటు చేసిన స్వెట్టర్ల దుకాణాలకు జనం ఎగబడుతున్నారు.
రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
Published Fri, Dec 25 2015 11:21 PM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM
Advertisement