శివ శివా.. ఇదిగో ఇంటి దొంగ | temple money e.o. draw | Sakshi
Sakshi News home page

శివ శివా.. ఇదిగో ఇంటి దొంగ

Published Tue, Jan 31 2017 12:28 AM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

temple money e.o. draw

  • రూ.33 లక్షల భక్తుల సొమ్మును డ్రా చేసుకున్న ఈవో
  • గ్రామస్తుల ఆరాతో అంతా బట్టబయలు
  • అనపర్తి : 
    ఇంటి దొంగను శివుడైనా పట్టుకోలేడంటారు... అందుకేనేమో ఏకంగా శివాలయంలోనే కైంకర్యానికి పాల్పడ్డాడు ఆలయ ఉద్యోగి. ఆలయాన్ని, ఆస్తులను పరిరక్షించేందుకు కాపలాగా ఉండాల్సిన అధికారి కంచే చేను మేసిన చందంగా ఎంతో భక్తి శ్రద్ధలతో హుండీలో వేసిన రూ.33 లక్షలు స్వాహా చేసిన వైనమిది. వీటితోపాటు దేవుడి ఆలయ నిర్మాణం నిమిత్తం భక్తులు సేకరించిన విరాళాలను బ్యాంకులో జమ చేయగా వాటిని కూడా డ్రా చేసి ఎంచక్కా తన సొంతానికి వాడేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాలయాలున్నాయి. రుక్మిణి, సత్యభామ సమేత  వేణుగోపాలస్వామి, పార్వతీ సమేత రామ లింగేశ్వరస్వామి, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఈ ఆలయాలు రహదారికంటే లోతైన ప్రదేశంలో ఉండడంతో ఆలయాలను పునర్నిర్మించాలనే ఆలోచన గ్రామస్తులకు 2011లో వచ్చింది. దీంతో భక్తులు ఎవరికి తోచిన విరాళాలను వారు అందజేశారు. ఇలా భక్తులు అందజేసిన విరాళాలు రూ.33 లక్షలు రామవరం ఆంధ్రా బ్యాంకులో శ్రీరామలింగేశ్వర, వేణుగోపాల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, మహేంద్రవాడ పేరిట (ఖాతా నంబరు 094110100022656) 2012లో జమ చేశారు. ఈ సొమ్మును దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ నిర్మాణానికి విడుదల చేసే సీజీఎఫ్‌ (కామ¯ŒS గుడ్‌ ఫండ్‌) సొమ్మును డిపాజిట్‌గా చూపించేందుకు డిపాజిట్‌ చేశారు. భక్తుల డిపాజిట్‌ చేసిన రూ.33 లక్షల సొమ్ము అలా ఉండగానే రూ.50 లక్షలు ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఆలయ నిర్మాణ పనులు గతేడాది చివర్లో ప్రారంభం కాగా పనులు చురుగ్గా సాగుతున్నాయి. బ్యాంకులో జమ చేసిన రూ.33 లక్షల గురించి ఈవో బి.వెంకటేశ్వరరావును పలుమార్లు గ్రామస్తులు ఆరా తీశారు. వాస్తవానికి రూ.20 లక్షలు సీజీఎఫ్‌కు డిపాజిట్‌గా చూపిస్తే సరిపోతుందని భావించిన గ్రామస్థులు మిగిలిన రూ. 13 లక్షలు నిర్మాణ పనులకు వినియోగించాలని భావించారు. ఆ సొమ్మును బ్యాంకు నుంచి డ్రా చేయాలని ఈవో వెంకటేశ్వరరావును గత పది రోజులుగా కోరుతున్నారు. డిపాజిట్‌ చేసిన కొద్ది రోజుల నుంచే దఫదఫాలుగా రూ.33 లక్షలు ఈవో కైంకర్యం చేశాడు. తాను అక్రమంగా దిగమింగిన సొమ్ము విషయం ఎక్కడ బయట పడుతుందోనని ఈవో వెంకటేశ్వరరావు తాత్సారం చేయడం ప్రారంభించాడు. ఈవో వెంకటేశ్వరరావు కప్పదాట్లను గ్రహించిన గ్రామస్తులు విషయాన్ని రామచంద్రపురంలోని ఎండోమెంట్స్‌ ఇ¯ŒSస్పెక్టర్‌ వర్ధినీడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకుని వెళ్లారు. సోమవారం ఆయన గ్రామస్తులతో కలిసి రామవరం ఆంధ్రాబ్యాంకు వెళ్లి ఖాతా వివరాలను పరిశీలించి అవాక్కయ్యారు. 2012 జూలై ఏడో తేదీన చివరిసారిగా డిపాజిట్‌ చేసిన రూ.13.43 లక్షలతో కలిపి మొత్తం రూ.33 లక్షల సొమ్మును ఈవో వెంకటేశ్వరరావు నాలుగు నెలల వ్యవధిలోనే దశలవారీగా డ్రా చేసినట్లు గుర్తించారు. ఆలయ సొమ్మును దిగమింగి ఏమీ ఎరగనట్లుగా తమ చుట్టూ తిరిగిన ఈవో వ్యవహారశైలి పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రూ.33 లక్షల సొమ్మును ఈవో ఒక్కడే డ్రా చేశారా..లేకా దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే అనుమానాలను  వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను వెలికి తీసి, దిగమింగిన సొమ్మును కక్కించాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు. 
    నిబంధనలకు విరుద్ధంగా...
    బ్యాంకులో డిపాజిట్‌ చేసిన సొమ్మును ఎండోమెంట్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ అనుమతితో ఈవో డ్రా చేయాల్సి ఉంది. నిర్మాణ పనులపై ఏఈ ఇచ్చిన నివేదిక ఆధారంగా బ్యాంకులో డిపాజిట్‌ చేసిన నిధులు డ్రా చేసుకునేందుకు ఏసీ అనుమతి ఇస్తారు. ఏసీ ఇచ్చిన అనుమతి కాపీ ఆధారంగా బ్యాంకు అధికారులు ఈవోకు చెక్కు ద్వారా డబ్బు విత్‌డ్రాకు అనుమతిస్తారు. అయితే ఏసీ నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాకుండానే బ్యాంకు అధికారులు ఆ సమయంలో ఎలా అనుమతించారన్న విషయంపై దేవాదాయ శాఖ అధికారులు విస్తుపోతున్నారు. తాను చేసిన అక్రమం బయట పడిపోయే సమయం వచ్చిందని భావించిన ఈవో గత నాలుగు రోజుల నుంచి పరారీలో ఉన్నట్లు తెలిసింది.వివరణ కోసం ‘సాక్షి’ ప్రయత్నించగా ఫో¯ŒS స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చింది. 
     
    నిజమే..
    గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఈవో వెంకటేశ్వరరావును విచారించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. దీంతో గ్రామస్తులతో కలిసి బ్యాంకుకు వెళ్లి సోమవారం విచారించాను. ఈవో నిధులు డ్రాచేయడం వాస్తవమే. విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించి శాఖాపరమైన విచారణ చేపతాం. అప్పటి బ్యాంకు అధికారులు ఎలా అనుమతించారన్న విషయంపై కూడా విచారిస్తాం.  
    – వర్ధినీడి వెంకటేశ్వరరావు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇ¯ŒSస్పెక్టర్, రామచంద్రపురం. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement