పూజగదిలో దక్షిణావర్త శంఖం ఎందుకుండాలి?
నివృత్తం: సిరి సంపదలు చేకూరాలంటే పూజా మందిరంలో దక్షిణావర్త శంఖం ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే కుడివైపు నుంచి తెరచుకుని ఉండే శంఖమన్నమాట. దీన్ని లక్ష్మీదేవి నివాసంగా చెబుతుంటారు. ఈ శంఖం ఎక్కడైతే ఉంటుందో... అక్కడ శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందట. అందుకే పూజగదిలో దీనిని ఉంచి, అనునిత్యం పూజించాలని చెబుతారు. ఫలితంగా దారిద్య్రం వదిలిపోతుంది. అదే విధంగా శంఖంలో పోసిన తీర్థాన్ని స్వీకరించడం వల్ల వ్యాధిబాధలు కూడా నశిస్తాయి. అందువల్ల దక్షిణావర్త శంఖాన్ని పూజగదిలో పెట్టుకోవడం ఎంతైనా ఉత్తమం!
మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు...
ఓ అడవిలో ఒక నక్క ఉండేది. దానికోసారి ఎంత వెతుకులాడినా ఆహారం లభించలేదు. తిరిగి తిరిగి అలసిపోయింది. నడవలేక నడవలేక నడుస్తుంటే ఓ తాటిచెట్టు కనిపించింది. కాసేపు దాని నీడలో విశ్రమిద్దామని వెళ్లి చెట్టు కింద పడుకుంది. అంతలో గట్టిగా గాలి వీచేసరికి తాటిపండు ఒకటి రాలి నక్కమీద పడింది. అసలే తిండిలేక నీరసంతో అల్లాడుతోన్న నక్కకు తాటిపండు దెబ్బకు దిమ్మ తిరిగినట్టయ్యింది.
ఈ కథ ఆధారంగా ఏర్పడినదే ఈ సామెత. అసలే కష్టాల్లో ఉన్న వ్యక్తి మరేదైనా కొత్త కష్టం వచ్చిపడితే ‘మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టుగా’ అయ్యింది పరిస్థితి అంటుంటారు!