అన్నదాతలపై పిడిగుద్దులు
మచిలీపట్నం (కృష్ణా): కృష్ణాజిల్లా బందరు మండలం పోతేపల్లిలో పోలీసులు విచక్షణారహితంగా రైతులపై దాడి చేసి పిడిగుద్దులు కురిపించారు. భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేసినందుకు రైతులు, భూపోరాట కమిటీ నాయకులను ఈడ్చిపడేశారు. దీంతో రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న ‘మీ ఇంటికి-మీ భూమి’లో ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమ నిర్వహణ కోసం తహసీల్దార్ నారదముని శనివారం పోతేపల్లి పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. రైతులు అధికారులతో మాట్లాడుతూ.. బందరు పోర్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అనుబంధ పరిశ్రమల పేరుతో 25 వేల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. జీవనాధారమైన భూములు తీసుకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. నోటిఫికేషన్ రద్దు చేసేదాకా గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని రైతులు, గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.
పోలీసుల రంగ ప్రవేశం..
'మీ ఇంటికి-మీ భూమి' నిలిపేయాలని రైతులు పట్టుపట్టారు. ఇదే సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను చెదరగొట్టేందుకు యత్నిం చారు. 'భూసేకరణ చేస్తే తాము పడే ఇబ్బందులు కూడా చెప్పుకోనివ్వరా?’ అంటూ రైతులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పరస్పరం తోపులాట జరిగింది. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి రైతులు, గ్రామస్తులను విచక్షణా రహితంగా నెట్టేశారు. దీంతో రైతులు ఆగ్రహంతో పోలీసులు, అధికారుల వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. వెంటనే వారిని పోలీసులు ఈడ్చిపడేశారు.
నినాదాలు, తోపులాటలు..
భూ సేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసేవరకు పోతేపల్లిలో మీ ఇంటికి-మీ భూమి కార్యక్రమాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ ఎదుట బైఠాయించిన భూపోరాట పరిరక్షణ కమిటీ నాయకులు కొడాలి శర్మ, పిప్పళ్ల నాగబాబు, సీహెచ్ జయరావుతోపాటు రైతులను పోలీసులు ఈడ్చూకుంటూ జీపు వద్దకు లాక్కెళ్లారు. తమపై నుంచి వాహనాలను పోనివ్వాలని రైతులు నినదించారు. ఈ క్రమంలో పోలీసులు వారిపై పిడిగుద్దులు కురిపించారు. మహిళలు సైతం రోడ్డుపైకి వచ్చి పోలీసులను అడ్డుకొనే యత్నం చేశారు. రూరల్ సీఐ మూర్తి, ఎస్‌ఐ రామకృష్ణ గ్రామస్తులు, రైతుల చొక్కాలు పట్టుకుని ఈడ్చిపడేశారు. అనంతరం వారిని అరెస్టు చేశారు. పెనుగులాటలో అస్వస్థతకు గురైన పిప్పళ్ల నాగబాబు, కొడాలిశర్మను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అక్రమ అరెస్టులపై సీపీఎం ఖండన
మచిలీపట్నం పోర్టు పేరిట ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణకు నిరసనగా ఆందోళన చేస్తున్న రైతులు, ప్రజాప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు ఒక ప్రకటనలో ఖండిం చారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీటీసీ నాగబాబుతో సహా పలువురు రైతులు, సీపీఎం నేతలను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ప్రభుత్వ నిర్బంధ చర్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నట్లు చెప్పారు.
మా ఉసురు తగులుతుంది
రెవెన్యూ అధికారులూ గో బ్యాక్.. తహసీల్దార్ గో బ్యాక్.. అంటూ గ్రామస్తులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పారిశ్రామిక వేత్తలు, విదేశీ సంస్థలకు కట్టబెట్టేందుకు తమ భూములు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సీఎం చంద్రబాబుకు తమ ఉసురు తగులుతుందంటూ మహిళలు శాపనార్థాలు పెట్టారు. అక్రమ అరెస్టులకు నిరసనగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామపెద్దలు వారికి నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు.