విజయవాడ: ఆలయ అర్చకులు, సిబ్బందిపై వేధింపులకు పాల్పడుతున్న విజయవాడ కనకదుర్గ గుడి ఈవో నర్సింగరావును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆలయ ప్రాంగణంలో అర్చకులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. దేవాదాయశాఖ వైఖరికి నిరసనగా ప్రధాన గోపురం వద్ద ధర్నా నిర్వహిస్తున్న అర్చకులు ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేశారు. రేపటి నుండి అన్ని ఆలయాల్లో ఆందోళనకు దిగుతామని అర్చక సంఘాలు హెచ్చరించాయి.
దుర్గగుడి అర్చకులతో చర్చలు జరిపేందుకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆందోళన నిర్వహిస్తున్న ప్రదేశానికి చేరుకున్నారు. ఈవోపై చర్యలు తీసుకుంటామని ఆందోళన విరమించాలని అర్చకులను వారు కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుర్గగుడి అర్చకుడిని మంత్రి మాణిక్యాల రావు శుక్రవారం పరామర్శించారు.