మేకల సంతలో ఉద్రిక్తత
మేకల సంతలో ఉద్రిక్తత
Published Tue, Mar 21 2017 12:28 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపలి్లలోని మేకల సంత వివాదం కొలిక్కి రాలేదు. సోమవారం వేకువజామున సంత వద్ద మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. గొర్రెలు, మేకల వర్తక సంఘం, శ్రీ సాయి వర్తక సంఘ సభ్యులతోపాటు బీజేపీ, టీడీపీ వర్గీయులు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో వివాదం తారస్థాయికి చేరింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సంత ప్రాంతంలో పోలీసులు మోహరించారు. తాడేపల్లిగూడెం, నల్లజర్ల వైపు నుంచి వచ్చే వాహన చోదకులు, ప్రయాణికులను ఎక్కడికక్కడ నిలుపుదల చేసి ఎక్కడికి వెళ్తున్నారు.. ఎందుకు వెళ్తున్నారనే విషయాలను పోలీసులు ఆరా తీశారు. సోమవారం వేకువజామున మేకల కొనుగోలుదారులను మాత్రమే ఆ ప్రాంతానికి అనుమతించారు. మిగిలిన వారిని లోనికి వెళ్లకుండా కట్టడి చేశారు. ఆ ప్రాంతానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు వెళ్లగా, అప్పటికే అక్కడ మాటువేసిన టీడీపీ వర్గీయులు వందలాదిగా సంత వద్దకు చేరుకున్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ నున్నా మురళీకృష్ణ ఆధ్వర్యంలో సీఐలు ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి, జి.మధుబాబు, చింతా రాంబాబు, దుర్గాప్రసాద్, ఎస్సైలు ఎం.సూర్యభగవాన్, ఐ.వీర్రాజు, వి.చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం, సిబ్బంది ఇరువర్గాలను నిలువరించారు. వేకువజామున 4 గంటలకు ప్రారంభమైన తోపులాట ఉదయం 8 గంటల వరకూ కొనసాగింది. ఎట్టకేలకు పోలీసులు ఇరువర్గాలను అక్కడ నుంచి బలవంతంగా పంపించివేశారు. కాగా, డీఎల్‌పీఓ ఆదేశాల మేరకు సంత వద్ద ఆశీలు వసూళ్లను నిలుపుదల చేశారు.
Advertisement
Advertisement